ఫిబ్రవరి వరకే సాగర్ జలాలు

30 Nov, 2014 01:39 IST|Sakshi

కురిచేడు, త్రిపురాంతకం: నాగార్జున సాగర్ జలాలు ఫిబ్రవరి నెలాఖరు వరకే విడుదల చేస్తామని ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ  శారద పేర్కొన్నారు.    ఆయకట్టుకు వచ్చే జలాలను వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాగర్ కాలువపై దర్శి నుంచి జిల్లా సరిహద్దు 85/3 మైలు వరకు శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా 126వ మైలు  కురిచేడు వద్ద విలేకరులతో మాట్లాడారు.  గతంలో వేసిన నాట్లను మాత్రమే సాగు చేసుకోవాలని..కొత్తగా నార్లు పోసి నాట్లు వేయవద్దని ఆమె సూచించారు. ఫిబ్రవరి నెలాఖరుకు నీటి సరఫరా నిలిచిపోతుందని..అప్పుడు పంట దశలో ఉందని రైతులు ఆందోళన చేసినా ప్రయోజనం ఉండదని, ముందుగా జాగ్రత్తలు పాటించాలని కోరారు.

మేజర్లపై ఏర్పాటు చేసిన అక్రమ తీములను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన కాలువ 124వ మైలు వద్ద ఉన్న రైల్వే గేటు ముసివేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారని..దీనిపై వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట చీమకుర్తి, దర్శి ఈఈలు శ్రీనివాసరావు, బీఎస్‌వీ.ప్రసాదు, ఒంగోలు, దర్శి, కురిచేడు డీఈఈలు పూర్ణచంద్రరావు, కరిముల్లా, లాల్ అహమ్మద్, కురిచేడు ఏఈ శ్రీనివాసరావు, ఎస్‌వీ.ఎస్.గుప్తా తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు