మూడు తరాలు.. పూరి గుడిసెలోనే జీవనం

26 Jul, 2019 11:52 IST|Sakshi
కొంతేరు రోడ్డులోని సగరులు నివాసం ఉంటున్న ఆర్‌ అండ్‌ బీ స్థలం ఇదే..

సగరులను భయపెడుతున్న రియల్‌ ఎస్టేట్‌

సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి): వారు నిరక్షరాస్యులు. చెమటోడ్చడం వారి నైజం. చేపల వేట, రైతుల పొలాల్లోని ఎలుకలు పట్టడం. తట్ట బుట్టలు అల్లుకోవడం వారి వృత్తి. మట్టి పనుల్లో అందెవేసిన చేతులు అవి. సుమారు 50 ఏళ్ల నుంచి మూడు తరాల వారికి అక్కడే స్థిర నివాసం. పూరి గుడిసె వారి ఆస్తి. ఇది పాలకొల్లు రూరల్‌ పంచాయతీ కొంతేరు రోడ్డు పక్కన నివాసం ఉంటున్న సగరుల(ఉప్పర్ల) పరిస్థితి. అయితే ఇటీవల వారిని రియల్‌ ఎస్టేట్‌ భూతం భయపెడుతోంది. వెంటనే వారితో ఆ ఇళ్లను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తోంది. రెక్కాడితేకానీ డొక్కాడని స్థితిలో ఉన్న వారిని అర్జంటుగా పూరిగుడిసెలు ఖాళీ చేయాలని బెదిరించటంతో ఉప్పర్లు తల్లడిల్లిపోతున్నారు. కొంతేరు రోడ్డులో ఆర్‌ అండ్‌ బీ పోరంబోకు స్థలం సుమారు 20 సెంట్లు ఉంది. ఈ భూమిలో 50ఏళ్ల నుంచి పూరిగుడిసెలు వేసుకుని సగరులు నివాసం ఉంటున్నారు. మొదట్లో 10 కుటుంబాలు ఉండేవి. వీరి పిల్లలు, మనవళ్లతో ప్రస్తుతం 35 కుటుంబాలకు చేరుకున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

అల్లు హయాంలో 11మందికి పట్టాలు
మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ హయాంలో వీరికి 1986లో పట్టాలిచ్చారు. ఆ తరువాత మరికొంత మందికి పట్టాల కోసం ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. దీంతో అదే పూరిగుడిసెలో రెండు, మూడు కుటుంబాలు జీవనం సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

దక్కని ప్రభుత్వ ఫలాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరికి దక్కటంలేదు. పక్కా గృహం కానీ, మరుగుదొడ్డి గానీ వీరికి మంజూరు కాలేదు. పంచాయతీ నుయ్యి తవ్వింది. ఆ నూతి నూటినే వారు వాడకం నీరుగా ఉపయోగించుకుంటున్నారు.

భయపెడుతున్న సరిహద్దు రైతులు
సగరులకు చెందిన పూరి గుడిసెలకు చేర్చి ఉన్న రైతులు తమ భూముల్ని రియల్‌ ఎస్టేట్‌గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వారు ఇళ్లు ఖాళీ చేయాలని సగరులను బలవంతం చేస్తున్నారని వాపోతున్నారు. మూడు తరాల నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, అర్జంటుగా ఖాళీ చేయాలని బెదిరిస్తుండటంతో ఎక్కడికి పోవాలని వారు ప్రశ్నిస్తున్నారు.

డాక్టర్‌ బాబ్జిని ఆశ్రయించిన బాధితులు
ఇటీవల యాళ్లవానిగరువు విచ్చేసిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జి), మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనందప్రకాష్‌ల దృష్టికి ఈ సమస్య తీసుకురావడంతో వారు బాధితులకు అభయమిచ్చారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

పట్టాల కోసం ప్రయత్నించాం
తాతల కాలం నుంచి ఇక్కడే జీవిస్తున్నాం. పట్టాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. అయినా అధికారులు కనికరించలేదు. పూరి గుడిసెలు ఖాళీ చేయాలని వత్తిడి చేస్తున్నారు.
– మిండ్యాల శాంతారావు, స్థానికుడు

పూరి గుడిసెలోకి కాపురానికి వచ్చా
నా వయసు 60 ఏళ్లు. నలభై ఏళ్ల క్రితం వివాహమైంది. పూరి గుడిసెలోకి కాపురానికి వచ్చా. ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలతో పూరి గుడిసెలో కాపురం ఉంటున్నా. పిల్లలందరికీ వివాహాలు చేశా. పూరి గుడిసెలే మాకు పక్కా ఇళ్లు.
– మిండ్యాల జయమ్మ, వృద్ధురాలు

పట్టాలు ఇవ్వాలి
ఆర్‌ అండ్‌ బీ పోరంబోకు స్థలంలో పూరి గుడిసె నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాం. పట్టా ఇవ్వాలని అధికారులకు అర్జీ పెట్టుకున్నా. చాలీచాలని పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాం. అధికారులు స్పందించి పట్టా ఇవ్వాలి.
– పామర్తి వీరమ్మ, స్థానికురాలు

మౌలిక వసతులు లేవు
మాకు కనీస మౌలిక వసతులు లేవు. ఆరుబయట బహిర్భూమికి వెళుతున్నాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మాకు మరుగుదొడ్లు మంజూరు చేయలేదు. మంచినీటి వసతి లేదు. ఇబ్బందులు పడుతున్నాం. 
– మిండ్యాల నరసమ్మ, స్థానికురాలు

మరిన్ని వార్తలు