ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యమే మా అబ్బాయి ప్రాణం తీసింది

23 Aug, 2018 07:08 IST|Sakshi
తమ కుమారుడు మృతిపై అనుమానాలను వివరిస్తున్న తల్లి రమాదేవి, కుటుంబ సభ్యులు సాయివికాస్‌(ఫైల్‌)

విజయనగరం జేఎన్‌టీయూలో పరిస్థితులు అధ్వానం

మృతుడు సాయివికాస్‌ తల్లి రమాదేవి  

తూర్పుగోదావరి,రాయవరం (మండపేట): తమ కుమారుడు ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడని భావిస్తే.. తమకు మృతదేహాన్ని అప్పగించారని విజయనగరం జేఎన్‌టీయూ విద్యార్థి సాయివికాస్‌ తల్లి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. రాయవరం మండలం లొల్ల గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తమ కుమారుడు సాయివికాస్‌ మృతికి విజయనగరం జేఎన్‌టీయూ కళాశాల బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తన కుమారుడి మృతికి దారితీసిన పరిస్థితులను ఆమె విలపిస్తూ తెలిపారు. జూన్‌ 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు మృతి చెందినట్టు కళాశాల విద్యార్థి సమాచారం అందించారన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో మిస్టరీగా ఉందన్నారు. ఇందులో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కన్పిస్తోందని ఆమె ఆరోపించారు. జిల్లాలోని ఎటపాక జవహర్‌ నవోదయ స్కూల్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఫొతేదార్‌ భాస్కరాచారి, రమాదేవిల కుమారుడు సాయి వికాస్‌ 2015లో విజయనగరం జేఎన్‌టీయూ కళాశాలలో బీటెక్‌(ఐటీ)లో చేరాడు. కళాశాలలోనే ఉంటూ ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్నాడు.

స్నేహితులే తీసుకుని వెళ్లారు...
జూన్‌ 29న రాత్రి కళాశాలలోని ఇద్దరు స్నేహితులు రాత్రి 10.30 గంటల సమయంలో బైక్‌పై బయటకు తీసుకుని వెళ్లారని రమాదేవి తెలిపారు. బైక్‌ ప్రమాదంలో సాయివికాస్‌ మృతి చెందినట్టుగా కళాశాలలోని సహచర విద్యార్థులు ఫోన్‌ చేసి చెప్పారన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రిన్సిపాల్‌ రాములు కనీసం తమకు సమాచారం అందించలేదని ఆమె ఆరోపించారు. కళాశాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. తమ కుమారుడి మృతితో డిప్రెషన్‌కు లోనైన తాము దానుంచి కోలుకున్న అనంతరం కుమారుడి మృతి విషయమై తెలుసుకునేందుకు ఈ నెల 6, 20న రెండు పర్యాయాలు కళాశాలకు వెళ్లగా ప్రిన్సిపాల్‌ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నెల 20న ప్రిన్సిపాల్‌ను కలుసుకునేందుకు వెళ్లగా అందుబాటులో లేరని, ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించ లేదన్నారు.

ఈ ప్రశ్నలకు బదులేది?
ప్రమాదానికి గురైన సాయివికాస్‌ ఆ రోజు రాత్రి 10.30 గంటలకు స్నేహితులు బయటకు తీసుకువెళ్లినట్టు చెబుతుంటే, సెక్యూరిటీ గార్డు బుక్‌లో రాత్రి 9.30 గంటలకు వెళ్లినట్టు రాసి ఉందన్నారు. కళాశాల నుంచి బయటకు వెళ్లినట్టు పేజీ చివర ఇరికించి ఎందుకు రాశారన్న ప్రశ్నకు సమాధానం లేదని వాపోయారు. ఆగస్టు 6న వెళ్లేసరికి రిజిస్టర్‌లో లేని పేరు 20న ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ‘రాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం జరిగితే ఉదయం వరకు తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు కళాశాలకు వెళ్తే ప్రిన్సిపాల్‌ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారన్నారు? రాత్రి 10.30 గంటలకు విద్యార్థులు బయటకు వెళ్తుంటే సెంట్రీ ఎందుకు అడ్డుకోలేదు? గేట్లు ఎందుకు మూసి ఉంచలేదు? అసలు ప్రిన్సిపాల్, వార్డెన్‌ల పర్యవేక్షణ ఉంటే వారు రాత్రి సమయంలో ఎలా బయటకు వెళ్తారు? తన గదిలో చదువుకుంటున్న సాయివికాస్‌ను బలవంతంగా ఆ విద్యార్థులు ఎందుకు తీసుకుని వెళ్లినట్టు?’ ఈ ప్రశ్నలకు తమకు ఎక్కడా సమాధానం దొరకడం లేదని ఆమె వాపోయారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్టు రమాదేవి తెలిపారు.

మరిన్ని వార్తలు