చంద్రబాబు ఆరోపణలు అవాస్తవం

14 Apr, 2020 18:20 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ వల్లనే కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా నివారణలో ఏపీ ముందే మేల్కోందని.. అభివృద్ధి చెందిన దేశాలే కరోనా నియంత్రణలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి రోజు సమీక్ష చేస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేస్తున్నామని చెప్పారు.

‘‘మాది పబ్లిసిటీ ప్రభుత్వ కాదు. చంద్రబాబులా సంక్షోభంలో రాజకీయాలు చేయం. లాక్‌డౌన్‌తో జీవనోపాధి కోల్పోయిన పేదలకు ఉచిత రేషన్‌, కందిపప్పుతో పాటు రూ.1000 అందించామని’’ ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా పేదల కోసం ఎప్పుడూ ఆలోచించలేదని విమర్శించారు. విపత్తుల సమయంలో చంద్రబాబు ప్రచార ఆర్భాటానికే పరిమితమయ్యేవారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ఎన్నడూ పేదలకు విపత్తు సమయంలో రేషన్ డబ్బులు ఇవ్వలేదన్నారు.

వ్యవసాయ రంగంపై కూడా సీఎం జగన్ పూర్తిగా దృష్టి సారించారని తెలిపారు. రైతులకు ఏ ఇబ్బంది రాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించారని పేర్కొన్నారు. పేదలందరికి అభివృద్ధి అందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. పక్క రాష్ట్రంలో ఉంటూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. టెస్టింగ్‌ల్లో వెనకపడ్డామన్న చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇప్పటికే ఏపీలో మూడు సార్లు ఇంటింటికి ఆరోగ్య సర్వే నిర్వహించామని పేర్కొన్నారు.

అందరూ ఊహించినట్లే ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ పొడిగించారని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పనితీరును జాతీయ మీడియా ప్రశంసించిందన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి రెడ్, అరేంజ్, గ్రీన్ జోన్ అంటూ సలహా ఇచ్చానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అఖిలపక్షం సమావేశం అనడం విడ్డూరంగా ఉందని.. ఆయన ఎప్పుడైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా అని సజ్జల ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఎన్ని సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అడిగిన పట్టించుకోలేదన్నారు.

చంద్రబాబు తానా అంటే కొన్ని పార్టీలు తాందాన అంటున్నాయని.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అధికారంలో ఉన్నట్లు ఊహించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంతో చర్చించకుండా నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేశారన్నారు. కొత్త ఎన్నికల కమిషనర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా  సిద్ధంగా ఉండాలని మాత్రమే చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు