కరోనా కట్టడికి ముమ్మర కసరత్తు

25 Mar, 2020 05:31 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు వల్లే అదుపులో పరిస్థితి

వలంటీర్ల వ్యవస్థతో ఎంతగానో ఉపయోగం

అసెంబ్లీ సమావేశాలపై రెండు రోజుల్లో నిర్ణయం

సాక్షి, అమరావతి: అత్యంత ప్రమాదకర కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ముమ్మరంగా చర్యలు చేపట్టామని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల తెలంగాణ, కేరళ, రాజస్థాన్‌ మాదిరిగా మన రాష్ట్రం తీవ్రంగా ప్రభావితం కాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్‌ ఎంత సులువుగా రావడానికి అవకాశం ఉందో.. అంతే సులువుగా దాన్ని నియంత్రించ వచ్చనే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

అందరూ సహకరించాలి
- మన పక్కన మనిషి లేక పోయినా గాలి వల్ల కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వస్తున్న వార్తల వల్ల ఆందోళన పెరుగుతోంది. వాతావరణం అనుకూలంగా ఉంటే ఎనిమిది గంటల వరకు వైరస్‌ గాలిలో ఉండగలుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అందువల్ల జనం బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. 
- కొత్త వ్యక్తులను కలవక పోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి.
- జాగ్రత్తగా ఉండకపోతే మన కోసం పని చేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పారా మెడికల్‌ సిబ్బంది, పోలీస్, అత్యవసర సర్వీసుల సిబ్బందిపై కూడా పని ఒత్తిడి పెరుగుతుంది.
- ఈ వైరస్‌ మరింతగా వృద్ధి చెందితే ఎవరి నుంచి అయినా వ్యాపించే ప్రమాదం వుంది. శానిటైజర్లు, మాస్క్‌ లు కూడా లభించడం లేదు. ఇవి కూడా ప్రజల కోసం రోడ్ల మీదకు వస్తున్న వారికే అందేలా అందరూ సహకరించాలి. 
హుద్‌ హుద్‌ అదో పెద్ద స్కాం
- హుద్‌హుద్‌ సమయంలో చంద్రబాబు ఏం చేశారో తెలుసు. (ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా) అదో పెద్ద స్కాం. ఎలాంటి హంగామా లేకుండానే ముందు నుంచే 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా నియంత్రణపై దృష్టి పెట్టారు.
- పేదలకు సరుకులు, రేషన్తో పాటు వెయ్యి రూపాయలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
- చంద్రబాబులా దోమలపై దండయాత్ర అంటూ మేం హంగామా చేయడం లేదు. జగన్‌కు చంద్రబాబులా మెలో డ్రామాలు చేయడం చేత కాదు. 
- ఈ విపత్కర పరిస్థితిపై ఎవరైనా రాజకీయంగా మాట్లాడితే అది వారి లేకి తనానికి నిదర్శనం. 
- అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. 

ముందుచూపే మందు
- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతి రోజూ కరోనాపై సమీక్షలు జరుపుతున్నారు. ఉదయం, సాయంత్రం నివేదికలు తెప్పించుకుంటున్నారు.
- సీఎం ముందు చూపుతో అప్రమత్తమై తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంది. 
- ఫిబ్రవరి నెలాఖరులో ఇమ్మిగ్రేషన్‌ అధికారుల నుంచి సమాచారం రాక పోయినప్పటికీ వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ వెళ్లి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. 
- తద్వారా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంది. ఎలాంటి హంగామా లేకుండా సమర్థవంతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. 

>
మరిన్ని వార్తలు