ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది : సజ్జల రామకృష్ణారెడ్డి

20 Sep, 2018 20:31 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం

హాజరైన పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

సాక్షి, గుంటూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి , ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వీరితో పాటుగా కిలారి రోశయ్య, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి, ముస్తఫా, ఆర్కే తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు.

ప్రజలంతా వైఎస్‌ జగన్‌ సీఎం కావాలంటున్నారు : సజ్జల
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. అయినా గానీ మళ్ళీ అధికారం కోసం చంద్రబాబు దింపుడు కళ్లం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని సజ్జల వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన వస్తుందో జగన్‌ చెప్పిన మాటలను ప్రజలు నమ్ముతున్నారని, అందుకే అన్ని సర్వేల్లోనూ 50 శాతం మంది ప్రజలు జగన్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబుది నీచపు రాజకీయం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది నీచపు రాజకీయమని సజ్జల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ పాలన మాఫియా ముఠాలా కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలవదని తెలిసే మరో మోసపూరిత పార్టీ కాంగ్రెస్‌తో బాబు చేతులు కలిపారని.. ఈ అనైతిక పొత్తు వల్ల ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని రామకృష్ణా రెడ్డి విమర్శించారు.

టీడీపీని ప్రజలు చీదరించుకుంటున్నారు : ఉమ్మారెడ్డి
విలువలు లేకుండా ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కున్న టీడీపీని ప్రజలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు, మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రాజధాని నిర్మాణం దగ్గరి నుంచి పోలవం వరకూ అన్నింటా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. సింగిల్‌గా పోటీచేయడం చేతకాకే చంద్రబాబు.. కాంగ్రెస్‌ పార్టీ కాళ్లు పట్టుకుని మద్దతు కోరారని ఎద్దేవా చేశారు. వాగ్దానాలను తుంగలో తొక్కిన చంద్రబాబును క్షమించే స్థితిలో ప్రజలు లేరని విమర్శించారు.

మరిన్ని వార్తలు