పాలన వికేంద్రీకరణ ఆగదు

5 Feb, 2020 05:13 IST|Sakshi
తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం నాయకుల సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజలు, ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు

అభివృద్ధి పేరుతో చంద్రబాబు చేసింది స్టంట్‌ మాత్రమే

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటు కీలకమని, కోర్టులు, వ్యాజ్యాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ విద్యార్థి, యువజన నేతల సమావేశంలో పాల్గొన్న అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కి పోతున్నాయనేది టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారమేనని చెప్పారు. చంద్రబాబు పాలనలో పెట్టుబడులు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు. శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌.. చంద్రబాబు ఒత్తిళ్లకు లొంగి అసంబద్ధ నిర్ణయం తీసుకున్నారన్నారు. వాస్తవానికి.. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు అవకాశమే లేదన్నారు.

మండలిలో జరిగిన హైడ్రామాను అందరూ చూశారని.. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ కళ్లల్లోకి చూస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకునేలా చేశారన్నారు. ప్రజలతో ఎన్నికైన శాసనసభకు.. మండలి సమానమైనది కానే కాదన్నారు. బిల్లులను మండలి వ్యతిరేకించినా శాసనసభ మళ్లీ ఆమోదింపజేసుకుంటుందని తెలిపారు. వాస్తవానికి.. వికేంద్రీకరణ బిల్లును ఆమోదించడమో, వ్యతిరేకించడమో చేయకుండా షరీఫ్‌.. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రభావంతో సెలెక్ట్‌ కమిటీ అన్నారన్నారు. దీని వల్ల నిర్ణయం కొంత ఆలస్యం అవుతుందే తప్ప అడ్డుకోజాలరన్నారు.

శాసనమండలి రద్దుకు శాసనసభ తీర్మానించింది కాబట్టి ఇక తమ దృష్టిలో మండలి లేనట్లేనన్నారు. తాము చేస్తున్నది రాజధాని తరలింపు కానే కాదని, పాలనా వికేంద్రీకరణ మాత్రమేనన్నారు. వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రజలు, ఉద్యోగులు స్వాగతిస్తున్నారని చెప్పారు. త్వరలోనే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. విశాఖ ఒక కాస్మొపాలిటన్‌ సిటీ అని, అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరమని గుర్తు చేశారు. చంద్రబాబు అధ్వాన పాలనను సాగించారని ధ్వజమెత్తారు. ఆయన అధికారంలో నుంచి దిగిపోయేనాటికి రూ.60 వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు చేసింది ఒక స్టంట్‌ మాత్రమేనన్నారు. చంద్రబాబు ఒక కరోనా
 వైరస్‌ లాంటివారని మండిపడ్డారు.  

వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
అధికార, అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతిస్తున్నారని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా అన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రజలను చైతన్యపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మంగళవారం తాడేపలిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణను కోరుతూ చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సమావేశం తర్వాత జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, ఆయన అనుయాయులు అమరావతిలో వందల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు.

వారి భూములకు రేట్లు పడిపోతాయనే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో దాదాపు 600 హామీలు ఇచ్చి ఐదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలను సీఎం అమలు చేస్తున్నారని చెప్పారు. కేవలం ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉన్న అమరావతికే రూ.లక్షల కోట్లు పెడితే ఎలాంటి అభివృద్ధి ఉండదని చెప్పారు. 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, వికేంద్రీకరణకు మద్దతు పలుకుతూ ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ నెల 6 నుంచి 15 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

6న రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు, 7న కొవ్వొత్తుల ర్యాలీ, 8న చంద్రబాబుకు బుద్ధి రావాలని ప్రతి దేవాలయంలో పూజలు, ప్రార్థనలు, 10న రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, మేధావులతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, 12న వంటా వార్పు,  13న రిలే నిరాహార దీక్షలు నిర్వహించి 14న గులాబీ పూలు, కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. 15న అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. అలాగే 10న అనంతపురంలోని ఎస్‌కే యూనివర్సిటీ, 12న వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ, 14న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీల్లో విద్యార్థులతో సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌ కొండమడుగుల సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు