23న పార్టీ జెండా ఎగరవేయాలి: సజ్జల

20 May, 2020 15:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల ఆశలు-ఆకాంక్షలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాల్లో సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తెచ్చారని ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు బుధవారం లేఖ రాశారు. తొలి ఏడాదిలోనే ఎన్నికల హామీలను 90 శాతం నెరవేర్చడమే కాకుండా.. మేనిఫెస్టోలో లేని మరో 40 కొత్త పథకాలను కూడా అమలు పరిచారన్నారు. (అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు)

దేశంలో అత్యుత్తమ సీఎంగా.. మంచి మనుసున్న సీఎంగా.. వైఎస్ జగన్‌ ప్రజల మన్ననలు పొందారని సజ్జల లేఖలో పేర్కొన్నారు. 23న అన్ని నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్‌ల‌తో పాటు మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని, పేదలకు పండ్ల పంపిణీతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి డేటా సేకరించాలని, అన్ని నియోజకవర్గాల్లో సాధించిన ప్రగతిపై వీడియోలు, ప్రకటనల రూపంలో సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 30వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలన్నారు. ఏడాది పాలన, ప్రగతి పథకాలపై ఇప్పటికే ప్రభుత్వం 23 నుంచి 30 వరకు కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని, అందుకు అనుగుణంగానే కరోనా నిబంధనలతో కార్యక్రమాలు చేయాలని సజ్జల లేఖలో సూచించారు.

మరిన్ని వార్తలు