17, 18న ‘సకలం బంద్’

11 Jan, 2014 04:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం మరోసారి ఆందోళన ఉధృతం చేసేందుకు ఉద్యోగ సంఘాలతో పాటు మిగిలిన అన్ని వర్గాలు సన్నద్ధం కావాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. ఏపీఎన్జీవో భవన్లో శుక్రవారం జరిగిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాల అనంతరం..  భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. తుది విడత అసెంబ్లీ సమావేశాల్లో విభజన బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులందరూ తమ అభిప్రాయాలు చెప్పే విధంగా వారిపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణను రూపొందించామన్నారు. కార్యాచరణను విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా భోగిమంటల్లో టి-బిల్లు ప్రతులను దహనం చే యాలని, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజాప్రతినిధులతో బహిరంగ ప్రమాణాలు చేయించాలని నిర్ణయించినట్లు వివరించారు.
 
 ఈనెల 17, 18 తేదీల్లో ‘సకలం బంద్’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రైళ్లు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను ఎక్కడికక్కడే స్తంభింప జేయాలని పిలుపునిచ్చారు. అప్పటికీ విభజన అంశంపై స్పష్టత రాకపోతే ఈనెల 20న లక్షలాదిమందితో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అసెంబ్లీ బయట ఆందోళన ద్వారా లోపల ఉన్న ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచడమే తమ ఆందోళనల ఉద్దేశమని ఆయన తెలిపారు.
 
 దాడులు హేయనీయం: సమైక్యవాదాన్ని వినిపిస్తున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై విభజనవాదులు భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్యగా అశోక్‌బాబు అభివర్ణించారు. సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డిపై శుక్రవారం జరిగిన దాడిని ఖండించారు. గతంలో ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిలపై కూడా ఇటువంటి దాడులు జరిగాయని గుర్తుచేశారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిస్తేనే.. పార్లమెంట్‌లో కూడా బిల్లును వ్యతిరేకించేం దుకు జాతీయ పార్టీలన్నీ ముందుకు వస్తాయన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ కో కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మార్పీఎస్(ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, విద్యార్థి జేఏసీ కన్వీనర్ అడారి కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 బంద్‌ను విజయవంతం చేయండి: వి.లక్ష్మణరెడ్డి
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ చేపట్టానికి నిరసనగా ఈనెల 17, 18వ తేదీల్లో తలపెట్టిన సీమాంధ్ర బంద్‌ను విజయవ ంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ భోగి మంటల్లో తె లంగాణ బిల్లు ప్రతులను దహనం చేయాలని కోరారు. విభజన బిల్లును వ్యతిరేకించని ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు