35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు

12 Mar, 2019 05:58 IST|Sakshi

35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయకల్లం

గత రెండేళ్లలో రైతులకు రూ. 12 వేల కోట్ల బకాయిల్ని ఎగ్గొట్టారు

రాజధాని నిర్మాణాన్ని సొంత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చేసుకున్నారు 

అవినీతిని పెంచి పోషించి వ్యవస్థల నిర్వీర్యం

మనంత అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదు

వాటాల కోసం ప్రాజెక్టుల అంచనా విలువను 3 రెట్లు పెంచేశారు

పథకాలు, సహజవనరులు, కాంట్రాక్టులు  కాదేదీ అవినీతికనర్హం అన్నట్లుగా దోపిడీ

గిన్నిస్‌ రికార్డుకు చేరువలో ఇళ్ల పథకంలో అవినీతి.. రూ.వేల కోట్ల దోపిడీ

తాత్కాలిక సచివాలయంలో చ.అడుగుకు రూ. 11,000 ఖర్చా?.. 

కి.మీ రోడ్డుకు రూ. 36 కోట్లా? 

‘రాష్ట్రంలో 35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు.అన్నింటా అవినీతి విలయ తాండవం చేసింది. అరాచక పర్వం రాజ్యమేలింది. విపత్తుల బారిన పడ్డ రైతులకు మొండిచేయి చూపారు. ఈ రెండేళ్లలో వారికి చెల్లించాల్సిన రూ. వేల కోట్ల బకాయిల్ని ఎగ్గొట్టి.. ఎన్నికల ముందు రూ.వెయ్యి విదిలించి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారు. రాజధాని పేరుతో కేవలం శంకుస్థాపనలు, శిలాఫలాకాలకే రూ. 350 కోట్ల ఖర్చుపెట్టడమేనా చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం? రాజధాని నిర్మాణాన్ని సొంత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చేసుకున్నారు. లేనిది ఉన్నట్లు, జరగనిది జరిగినట్లు  గ్రాఫిక్స్‌తో సినిమా చూపించారు. డబ్బులు వెదజల్లి తప్పుడు లెక్కల్ని ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు గోబెల్స్‌ను మించిపోయారు. అవినీతిని పెంచి పోషించడంలోను, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడంలో,రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో తప్ప ఆయన అనుభవం ఎందుకూ కొరగాదు.’
– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయకల్లం

‘ఇసుక, మట్టితో సహా సహజ వనరుల్ని అడ్డంగా దోచేశారు. నీరు–చెట్టు, ఉపాధి హామీ ఇలా కాదేదీ అనినీతికనర్హం అన్నట్లు చంద్రబాబు సర్కారు పాలన ఇష్టారాజ్యంగా సాగింది. సాగునీటి పెండింగ్‌ ప్రాజెక్టుల అంచనాల్ని మూడు రెట్లు పెంచేసి, కమీషన్ల కోసం రెండు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్ని తెరపైకి తేవడమే ఈ ప్రభుత్వం సాధించిన ఘనత. పోలవరం సాకారం కోసం శ్రమించింది ఒకరైతే.. మేమే చేస్తున్నామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ పథకంలోని అవినీతి గిన్నిస్‌ రికార్డుకు చేరువలో ఉంది. మితిమీరిన దుబారా, అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. పోలవరం విహారయాత్రలకు రూ. 400 కోట్ల ఖర్చు ఈ ప్రభుత్వ దుబారాకు పరాకాష్ట. ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం ఎలాగో తెలియని పరిస్థితికి పూర్తిగా దిగజార్చారు. ముడుపులివ్వందే ఏ పనీ జరగడం లేదు.  ఈ పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.’ ఇలా చంద్రబాబు ప్రభుత్వ నిజ స్వరూపాన్నీ, తెరవెనుక అవినీతి, అక్రమాల్ని చీల్చిచెండాడారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయకల్లం. పదవిలో ఉన్నప్పుడు, అనంతరం జరిగిన వాస్తవాలను చూసిన ఆయన గత అయిదేళ్ల బాబు పాలన తీరుపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అజేయకల్లం ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

సాక్షి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరయ్యారు కదా! రాష్ట్రంలో ప్రస్తుత సర్కారు పాలనపై మీ విశ్లేషణ ఏమిటి?

అజేయకల్లం 
అన్ని స్థాయిల్లోను వ్యవస్థలు కుప్పకూలాయి. గ్రామ పంచాయతీల వ్యవస్థ నీరుగారింది. జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నాయి. శాసనసభ్యులు పరిపాలనను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పలువురు అధికారులు నియమ, నిబంధనల్ని గాలికొదిలి చేతులెత్తేశారు. రాష్ట్రంలో 35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన ఎన్నడూ లేదు. 

సాక్షి: టీడీపీ సర్కారు గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటుందన్న అధికార వర్గాల వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి?
కల్లం:  ఏదీ జరగకపోయినా, ఏం చేయకపోయినా అంతా మేమే చేసినట్లు మీడియాలో చెప్పుకోవాలనే ఆలోచనతో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. పోలవరం గురించి ఏవేవో గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందో అందరికీ తెలుసు. అనుమతులు తెచ్చిందొకరు, రాష్ట్ర సర్కారు డబ్బు ఖర్చుపెట్టిందొకరు, జాతీయ ప్రాజెక్టుగా చేసిందొకరు. డబ్బిచ్చేదొకరు. మరి పోలవరం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమిటో ఎవరికీ అర్థం కాదు. కానీ మేమే చేశాం. మేమే చేసేస్తున్నామని డబ్బా కొడుతున్నారు. విహార యాత్రల పేరుతో రూ. 400 కోట్లు దుర్వినియోగం చేసి ప్రజలను పోలవరం తీసుకురావడమేంటి?

సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ముఖ్యమంత్రుల్లో తానే సీనియర్‌నని చెప్పుకుంటున్నారు కదా? వాస్తవం ఏమిటి?
కల్లం: అనుభవం దేనిలో ఉపయోగపడింది? అవినీతిని పెంచడంలోనా? వ్యవస్థలను భ్రష్టుపట్టించడంలోనా? ఆర్థిక క్రమశిక్షణను కూలదోయడంలోనా? చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం బహుశా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేయడానికి పనికొచ్చినట్లుంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీకి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అప్పు తీసుకోవడానికి కూడా బహుశా అనుభవం ఉపయోగపడిందేమో! రాష్ట్ర అప్పు – జీడీపీ దామాషా 35 శాతం దాటిపోతున్నట్లుంది. ఆర్థిక క్రమశిక్షణను గాలికొదిలి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించాక పాలన ఎక్కడుంది.

సాక్షి: విజన్‌ 2020, విజన్‌ 2029,విజన్‌ 2050తో వృద్ధిరేటు సాధించామని  సర్కారు చెబుతున్నగణాంకాల మాటేమిటి? 
కల్లం: అసలు దూరదృష్టి(విజన్‌)కి అర్థమేంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వచ్చే ఏడాది కట్టాల్సిన అప్పు వాయిదా, వడ్డీ కలిపితే మనం తెచ్చే అప్పును మించిపోయేలా ఉంది. ఎవరు పరిపాలనలోకి వచ్చినా ఏం చేయాలో దిక్కు తెలియక జుట్టుపీక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. కేవలం కాగితాల్లో దొంగలెక్కలు చూపుతూ మీడియాలో ఆ తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకుంటున్నారు.

సాక్షి:రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలో వాస్తవమెంత?
కల్లం: రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి ఆక్టోపస్‌లా తారాస్థాయికి చేరింది. గ్రామస్థాయిలో నీరు – చెట్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పేర్లతో దోపిడి చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద వచ్చే డబ్బంతా కేంద్ర ప్రభుత్వమిచ్చేదే. అది తన సొంత డబ్బు అన్నట్లు మేమే రోడ్లు వేయించాం, మా రోడ్ల మీద నడిచేవారంతా మాకు ఓటు వేయాలని బహిరంగంగా చెప్పుకోవడం దారుణమైన విషయం. 

సాక్షి: ఇంకా ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో చెప్పగలరా?
కల్లం: సహజ వనరులను సైతం దోచుకుంటున్నారు. ఇసుక, మట్టి  పేర్లతో దోపిడీ, దందాలు సాగుతున్నాయి. ప్రతి పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది. ట్రాక్టర్లు (ప్రగతి రథం), ఆటోలు, సెల్‌ఫోన్ల కొనుగోలు మొదలు సెట్‌టాప్‌ బాక్సుల కొనుగోలు వరకూ అవినీతి లేనిదెక్కడో ప్రభుత్వానికే తెలియాలి.

సాక్షి: భూముల వ్యవహారంలో ఏం నడుస్తోంది?
కల్లం: భూముల విషయమైతే ఇక చెప్పేదేమీ లేదు. ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.కోట్లకు ఇస్తూ ప్రయివేటుకైతే లక్షలకే కట్టబెడుతున్నారు. అమరావతి కేంద్రంగానే ఈ వ్యవహారం సాగుతోంది. విశాఖ వంటి నగరాల్లో సైతం విలువైన భూములను ఐటీ సంస్థల ఏర్పాటు ముసుగులో పప్పుబెల్లాల చందంగా అస్మదీయులకు రియల్‌ వ్యాపారం కోసం కేటాయిస్తున్నారు. ఫ్రాంక్లిన్‌ సంస్థకు రూ. 406 కోట్ల విలువైన భూమిని రూ. 13 కోట్లకే అప్పనంగా కట్టబెట్టడం వెనుక వాటాలే కారణం.  

సాక్షి: వాటాల కోసమే ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయాల్ని భారీగా పెంచారన్న విమర్శలపై మీ అభిప్రాయం?
కల్లం: టెండర్లన్నింటిలో అవకతవకలే. ఫైబర్‌గ్రిడ్‌ మొదలు, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి భవనాలు, రహదారులు, భోగాపురం విమానాశ్రయం వరకూ అన్నింటా అవినీతి దందాలే. బహుశా అంచనాలకు రెక్కలు రాని టెండరే లేదేమో!

సాక్షి: సాగు నీరిచ్చామని బాబు ప్రతి వేదికపైనా చెబుతున్నారే?
కల్లం: ఈ ప్రభుత్వం సాగునీటి రంగంలో సాధించిందేమైనా ఉందంటే పెండింగులో ఉన్న అన్ని ప్రాజెక్టుల అంచనాలు మూడు రెట్లు పెంచి దోచుకోవడమే.  ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం మొదలుపెట్టింది లేదు. కమిషన్ల కోసం చేసిన రెండు లిఫ్ట్‌ ఇరిగేషన్లు తప్ప ఇంకేమీ చేయలేదు.

సాక్షి: వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి సాధించామని సీఎం చెబుతున్నారు. ఈ గణాంకాలు వాస్తవమేనా?
కల్లం: వ్యవసాయ రంగంలో సర్కారు చెబుతున్న ప్రగతి అంతా బూటకమే. అయిదేళ్లుగా సాధారణ వర్షపాతం కూడా లేదు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోతుందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. సాగు భూములు బీళ్లుగా ఉంటే రైతులు సంతోషంగా ఎలా ఉంటారు? వ్యవసాయ రంగం ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? గతంలో ఇదే పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో ఏడేళ్లు వరుణుడితో పోరాటమే. పాడి, మత్స్య రంగంలో అద్భుత ప్రగతి సాధించామని చెబుతున్నారు. గత కొన్నేళ్లలో రాష్ట్రంలో 13.65 లక్షల మేర గేదెల సంఖ్య తగ్గింది. అందులో 9.2 లక్షలు పాడిగేదెలే. అయినా పాల ఉత్పత్తి సాలుకు 4.2 మిలియన్‌ లీటర్లు పెరిగిందని చెబుతున్నారు. ఇదెలా సాధ్యమో ఆ అంకెలు తయారుచేసిన వారికే తెలియాలి. బహుశా ఇది పాల ఉత్పత్తి కాకుండా అంకెల ఉత్పత్తి  అయి ఉండవచ్చు. శాస్త్రీయంగా పరిశీలిస్తే కిలో దాణాకు 1.44 లీటర్ల పాలు వస్తాయని అనుభవజ్ఞులు చెబుతుంటే మన పాలకులు మాత్రం కిలో దాణాకు ఏకంగా 13.7 లీటర్ల పాల ఉత్పత్తి చేసినట్లు చెప్పుకుంటున్నారు. మన అంకెల ఉత్పత్తి ఎంత గొప్పదో చెప్పేందుకు ఈ ఒక్కటి చాలు. చేపల విషయంలోను ఇదే స్టోరీ రిపీట్‌ అవుతోంది. ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వాకల్చర్‌లో హెక్టారుకు రూ. 20 లక్షల విలువ చేసే కనీస ఉత్పత్తి సాధించామంటున్నారు. సముద్ర చేపల విషయంలో వాస్తవంగా ప్రభుత్వాలు చేసేదేమీ లేదు. ఇలాంటి కల్పిత అంకెల ఆధారంగా దేశంలోనే అద్భుత ప్రగతి సాధించామని చెప్పుకోవడం చూసి తెలుగువారిగా సిగ్గుపడాలో లేదో మనమే తేల్చుకోవాలి. 

సాక్షి: ఇతర రాష్ట్రాలు అసూయపడేలా రాష్ట్రం అభివృద్ధి చెందిందని బాబు చెబుతున్నారు కదా?
కల్లం: దేశంలో వాస్తవంగా ఈ రోజు మనంతగా అప్పుల బారిన పడ్డ రాష్ట్రం మరొకటి లేదు. ఇంత అవినీతి రాష్ట్రం కూడా వేరొకటి లేదు. మరి దేన్ని చూసి ఇతర రాష్ట్రాలు అసూయపడతాయో అర్థంకాని విషయం. 

సాక్షి: కౌలు రైతులకు సర్కారు ఏమైనా చేసిందా?
కల్లం: రైతులకే గతి లేదు. ఇక ఈ సర్కారు కౌలు రైతులకు ఏదో చేస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. కౌలు రైతులకు పెట్టుబడి రాయితీ కూడా ఇవ్వడంలేదు.

సాక్షి: నిధులను సర్కారు వృథా చేస్తోందన్న విమర్శలపై మీ అభిప్రాయం
కల్లం: దుబారా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సర్కారు బరితెగించిందని చెప్పక తప్పదు. నిరర్థకమైన వ్యయాలు, విలాసవంతమైన తిరుగుళ్ల కోసం కొన్ని వేల కోట్లు దుబారా చేసిన విషయం అందరికీ తెలిసిన వాస్తవం. ఆదాయం లేదని బీద అరుపులు అరుస్తూ.. ఒక్క సంవత్సరం కూడా ఉండని హైదరాబాద్‌లో సచివాలయంలో మరమ్మతుల పేరుతో ఎల్‌ బ్లాకు కోసం రూ. 14.63 కోట్లు వృథాగా వెచ్చించారు. సీఎం కుటుంబాన్ని హైదరాబాద్‌లోని హోటల్‌ పార్కు హయత్‌లో పెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చెల్లించడం దుబారా కాక మరేమిటి? ఇక పాలకుల విదేశీయానానికి ప్రత్యేక విమానాలు, విలాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

సాక్షి: దేశంలో తొలిసారి నదుల అనుసంధానం మేమే చేశామని చంద్రబాబు చెబుతున్నారు కదా! ఇందులో వాస్తవమెంత?
కల్లం: ఇది చాలా గమ్మత్తయిన విషయం. గోదావరి – కృష్ణా నదుల్ని అనుసంధానం చేశామని పాలకులు చెబుతున్నారు. దాని అర్థమేమిటో చెప్పేవారికే తెలియదు. రెండు నదుల నీరు కలవడం అనుసంధానమైతే ఎన్నో దశాబ్దాల క్రితమే గోదావరి – కృష్ణా అనుసంధానం జరిగిపోయింది. ఏలూరులో లాకులు, ఆక్విడెక్టులు కొన్ని దశాబ్దాల క్రితమే నిర్మించారని బహుశా రాష్ట్రంలో తెలియని వారు ఉండరేమో? గోదావరి – కృష్ణా కాలువను అనుసంధానం చేయడమే వాటి లక్ష్యం. 

సాక్షి: రాజధాని నిర్మాణం ఎలా ఉండటం ఆదర్శం? సర్కారు చేస్తున్నదేంటి?
కల్లం: ఎవడో డబ్బున్నోడికి బెంజ్‌ కారు ఉందని లేనివాడు కూడా అప్పు చేసి అదే కొనుక్కోవాలనుకోవడం మూర్ఖత్వం. అందుకే మంచమున్నంత వరకే కాళ్లు చాపుకోవాలని పెద్దలు చెబుతుంటారు. తమకున్న ఆదాయ పరిధికి తగ్గట్టుగా జీవించాలనేది ప్రాథమిక ఆర్థిక సూత్రం. పెద్దలు చెప్పేది, కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేది కూడా ఇదే. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ప్రజాధనం వినియోగం విషయంలో ఇంకా పొదుపుగా వ్యవహరించాలి కదా.? ఆదాయం లేనప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ఎవరైనా ఇల్లు కడతారా? అప్పు చేస్తే వడ్డీ పెరిగి భారమవుతుందని తెలిసే.. అప్పులిచ్చేవారున్నా కూడా ఇష్టారాజ్యంగా అప్పులు తేరాదని విజ్ఞులంతా చెబుతుంటారు. అత్యవసరంలో తప్ప అప్పు చేయరాదని ప్రతి ఒక్కరూ చెప్పడమే కాదు నమ్మే సూత్రం కూడా అదే. అలాంటప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రానికి అప్పులు తెచ్చి కోటల్లాంటి నిర్మాణాలు ఎవరు చేపడతారు? కేవలం బాధ్యతారాహిత్యంగా ఉండేవారు, ప్రజల శత్రువులు మాత్రమే ఇలా చేస్తారు. 

సాక్షి: రాజధానిలో ఏం ఉండాలి?
కల్లం: రాజధానిలో ఉండాల్సిందేమిటి? ఉండేదెవరు? అనేది ముందు చూడాలి. తక్కువ ఖర్చుతో అవసరానికి సరిపడా మాత్రమే మనం రాజధానిని నిర్మించుకోవచ్చు కదా? విలాసవంతమైన భవనాలు, సౌకర్యాలు ఎవరికోసం? ప్రపంచంలో అన్ని దేశాల రాజధానులకు ప్రాధాన్యమివ్వకుండా చిన్న పట్టణాల్లో చిన్న కట్టడాలు నిర్మించుకుంటున్న విషయం అక్షరసత్యం. మరి ఈ తమాషాలన్నీ ఎందుకు? కేవలం కమిషన్ల కోసం, ముందుగానే భూములు కొన్న రాజకీయ నాయకుల ‘రియల్‌ ఎస్టేట్‌’ వ్యాపారం కోసం తప్ప మరి దేనికీ ఉపయోగం ఉండదు. 

సాక్షి: అవినీతి ఇంతగా పెరిగిపోతే ఎవరూ ప్రశ్నించడం లేదా?
కల్లం: నింగి, నేల హద్దుగా అవినీతి పెరిగిపోతున్న తీరును అధికారులు ఎక్కడైనా ప్రస్తావిస్తే.. మా కార్యకర్తలు బతకొద్దా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నించిన సంఘటనలు ఉన్నాయి. సేవ చేయడం కాకుండా దోచుకోవడమే పని అనేవాడు కార్యకర్త ఎలా అవుతాడో నాకు అర్థం కావడంలేదు. ప్రొటోకాల్‌ పేరిట భారీగా ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు, అధికారులు చేసిన ఖర్చుతో పోల్చితే రాష్ట్రం విడిపోయిన తర్వాత పదింతలు ఖర్చు పెట్టారు. ఒకవైపు లోటు బడ్జెట్‌ అంటూనే నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, పుష్కరాల పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జనం సొమ్మును విచ్చలవిడిగా మంచినీళ్లలా దుబారా చేశారు. 

సాక్షి: అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నామని సీఎం చెబుతున్నారు కదా?
కల్లం: అయిదు నక్షత్రాల హోటళ్లకూ, విమానాల్లో తిరిగే వారికీ రాయితీలు ఇస్తున్నారు. రాష్ట్రంలో రైతుల ఖర్మేమిటోగానీ గత రెండేళ్ల నుంచి ప్రకృతి విపత్తుల బారిన పడ్డ వారికి మాత్రం ఒట్టి చేయి చూపుతున్నారు. ఈ రోజు వరకూ రైతు రుణమాఫీకి రెండు వాయిదాలకు సంబంధించి సుమారు రూ. 8,830 కోట్లు, విపత్తుల బారినపడ్డ వారికి పెట్టుబడి రాయితీ రూ. 2,200 కోట్లు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల బిల్లులు రూ. 800 కోట్లు, మొక్కజొన్నలకు రూ. 200 కోట్లు వెరసిరైతులకు చెల్లించాల్సిన రూ. 12,030 కోట్ల బిల్లులు గతేడాది, ఈ సంవత్సరానికి సంబంధించినవి ఖజానాలో పెండింగ్‌లో మూలుగుతున్నాయి. వీటిని విడుదల చేయకుండా ఆపి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పేరుతో ఓట్ల కోసం రైతుల ఖాతాల్లో వెయ్యి రూపాయలు విదిలిస్తున్నారు.  దీనిని సాధారణ పరిపాలన అంటామా? అనుభవజ్ఞులైనవారు అందించే పాలన అంటారా? చేతగాని వారి పాలన అంటారా? ప్రజలే ఆలోచించుకోవాలి.
- లేబాక రఘురామిరెడ్డి, సాక్షి ప్రతినిధి

‘రాజధానిలో శిలాఫలకాల్ని వేసినవే మళ్లీ మళ్లీ వేయడం, ఇందుకోసం సభలు, ఆర్భాటాల కోసం రూ. 350 కోట్లు ఖర్చు చేయడం ఏ పరిపాలనానుభవం కిందకు వస్తుంది? బహుశా హైదరాబాద్‌లోనూ, అమరావతిలోనూ రెండు చోట్ల క్యాంపు ఆఫీసులకు సొబగులు, ఫాంహౌస్‌ల హంగులకు వందల కోట్లు ఖర్చుపెట్టారు. ఏ మాత్రం వినియోగించకుండానే హైదరాబాద్‌లో సచివాలయం మరమ్మతుల కోసం కోట్లాది రూపాయిలు దుర్వినియోగం చేయడానికి సీఎం చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం పనికొచ్చిందేమో’

‘సామాన్య రైతుల నుంచి రాజధాని పేరిట సేకరించిన భూమిని ప్రజాప్రయోజనాల కోసమే వినియోగించాలనేది ప్రాథమిక మౌలిక సూత్రం. లాభార్జన కోసం నడిపే ఏ సంస్థకూ దీన్ని తక్కువ ధరకు ఇవ్వకూడదు. ఇంజనీరింగ్, మెడికల్‌ కోర్సులు నిర్వహిస్తామని, ఆస్పత్రులు నిర్మిస్తామన్న ప్రైవేటు సంస్థలకు కారు చౌకగా ఈ భూముల్ని ఎందుకివ్వాలి. అవేవీ పేదలకు ఉచితంగా లేదా రాయితీతో  సీట్లు ఇవ్వడం లేదు. ఉచిత  వైద్యం చేయడం లేదే. రైతుల నుంచి సేకరించిన వందలాది ఎకరాలను లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యా, వైద్య వ్యాపారాలు చేసుకుంటున్న సంస్థలకు పప్పుబెల్లాల్లా ఇవ్వడం వెనుక మతలబేమిటో సర్కారు పెద్దలకే ఎరుక.  సామాన్యులు వెళ్లలేని అయిదు నక్షత్రాల హోటళ్లకు కారు చౌకగా భూములు ఇవ్వడమే కాకుండా రాయితీలు ఇవ్వడంలో ఔచిత్యం పాలకులకే తెలుసు.’

‘జాతీయ రహదారి నిర్మాణానికి కి.మీ.కి రూ. 17 కోట్ల నుంచి రూ. 26 కోట్లు అయితే అమరావతిలో రోడ్లకు కి.మీ.కి రూ. 36 కోట్లు పోస్తున్నారు. చ.అడుగుకు రూ. 2 వేలతో అధునాతన భవనం నిర్మించుకుంటున్న ఈ రోజుల్లో తాత్కాలిక సచివాలయానికి చదరపు అడుగుకు రూ. 11,000 ఖర్చు పెట్టారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో పర్యవేక్షక వ్యవస్థలు ఎంత బలహీనపడ్డాయో చెప్పనక్కరలేదు’

‘చేనేత కార్మికుల పేరుతో బోగస్‌ సొసైటీల మాటున పవర్‌లూమ్స్‌ మీద తయారైన వస్త్రాన్ని ఆప్కోకు సరఫరా చేసి ఒక్క వైఎస్సార్‌ జిల్లాలోనే  వందల కోట్లు దోచుకున్నారన్నది ఆధారాలతో సహా బట్టబయలైన నగ్నసత్యం. మరి రాష్ట్రమంతా లెక్కలోకి తీసుకుంటే ఇందులో ఎంత కుంభకోణం జరిగిందో?’

‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు చదరపు అడుగుకు వెచ్చిస్తున్న వ్యయం పక్క రాష్ట్రంతో పోల్చితే మన రాష్ట్రంలో రూ. వెయ్యికి పైగా ఎక్కువ కావడం గమనార్హం. మరి మనం పది లక్షల ఇళ్లు కట్టిస్తే దాదాపుగా 36.5 కోట్ల చదరపు అడుగులు నిర్మించినట్లు. మరి చదరపు అడుగుకు రూ.1000 లెక్కన 36.5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణానికి దుర్వినియోగం ఎన్ని వేల కోట్లో ప్రజలే తేల్చుకోవాలి.’    – అజేయ కల్లం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌