గ్రామ స్వరాజ్యానికి నాంది

1 Oct, 2019 04:57 IST|Sakshi

గ్రామ సచివాలయాల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం

జాతిపిత కలలను సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్‌ 

కొత్తగా 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం

సంక్షేమ పథకాల రాయితీని సామాజిక పెట్టుబడి నిధిగా పరిగణిస్తాం

ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాజధానిపై నిర్ణయం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం 

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు, అభివృద్ధి వికేంద్రీకరణ, పీపీఏలు, పారిశ్రామిక విధానం, రాజధాని, రివర్స్‌ టెండరింగ్‌ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో ‘సాక్షి’ ముఖాముఖి చర్చించింది. ఆ వివరాలు ఇవీ..

గాంధీ జయంతి రోజే ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికేలా గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి?
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందించవచ్చన్నది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావన. పంచాయతీలు తీసుకున్న నిర్ణయాల అమలుకు కార్యనిర్వాహక వ్యవస్థ లేదు. స్థానిక సంస్థల బలోపేతం కోసం పార్లమెంట్‌ చేసిన 73, 74వ రాజ్యాంగ సవరణలను అమలు చేస్తూ దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. సర్పంచి నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడమే వీటి ఉద్దేశం. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమిదే. గ్రామంలోనే సమస్యలు పరిష్కారమవడం వల్ల ప్రజాప్రతినిధులు, అధికారులపై భారం తగ్గుతుంది. సచివాలయాలు అందుబాటులోకి రావడం వల్ల సర్పంచి తప్పనిసరిగా గ్రామసభ నిర్వహించాల్సిందే.   

గ్రామ సచివాలయాల్లో అక్రమాలకు తావులేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
సచివాలయ ఉద్యోగులకు పకడ్బందీగా శిక్షణ ఇస్తాం. నైతిక, మానవీయ విలువలను పాటించేలా శిక్షణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజాసేవే పరమావధిగా సచివాలయ ఉద్యోగులు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం.

సచివాలయ ఉద్యోగుల నియామకం వల్ల ఖజానాపై భారీ భారం పడుతుందని ప్రతిపక్షం విమర్శిస్తోంది కదా?
గత సర్కార్‌ ఒక పరిశ్రమ ఏర్పాటుకు రూ.1,200 కోట్ల రాయితీలు ఇచ్చింది. ఆ పరిశ్రమ ద్వారా కేవలం వెయ్యి మందికే ఉద్యోగాలు వచ్చాయి. అవి ప్రైవేట్‌వి. కానీ.. గ్రామ సచివాలయాల వల్ల 1,34,534 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. వారి సర్వీసులు పూర్తి రెగ్యులర్‌ అయ్యాక వారందరి జీతాలు రూ.నాలుగు నుంచి ఐదు వేల కోట్లకు మించవు. ఇప్పుడు చెప్పండి ప్రతిపక్షం విమర్శల్లో వాస్తవం ఉందా? 

సచివాలయ ఉద్యోగాలు ఒక వర్గానికే వచ్చాయంటూ ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది కదా?
సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సామాజిక న్యాయానికి ఇంతకంటే నిదర్శనం ఎక్కడైనా ఉంటుందా? ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను తప్పుబట్టడమే ప్రతిపక్షం పనిలా ఉంది తప్ప ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇద్దామన్న ఆలోచన వీసమెత్తు కూడా లేదన్నది వారి చేష్టల ద్వారా అవగతమవుతోంది. 

పెన్షన్లు, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ రైతు భరోసా లాంటి పథకాల ద్వారా రాయితీలు ఇవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వీటికేం చెబుతారు?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ప్రతిపక్షాలు రాయితీ కింద చూస్తే మేం సామాజిక పెట్టుబడిగా పరిగణిస్తాం. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ప్రభుత్వం ఏటా ఒక్కో రైతుకు ఇచ్చే రూ.12,500లను వ్యవసాయ పెట్టుబడి కింద సర్కార్‌ పరిగణిస్తుంది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాల ద్వారా సామాజిక పెట్టుబడిని ప్రజలకు అందిస్తాం. ఈ అంశంలో విమర్శలకు వెరవం.

అభివృద్ది చెందిన, చెందుతున్న దేశాలు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నారని, ఇది తిరోగమన చర్యగా కొందరు నేతలు అభివర్ణిస్తుండటంపై ఏమంటారు?
ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో కెనడా ఒకటి. కెనడాలో ప్రభుత్వ రంగ సంస్థలు బలంగా ఉన్నాయి. రాష్ట్రంలోనూ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశం. అందులో భాగంగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ సంస్థలను తలదన్నే రీతిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం.

రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధితో రైతులకు గిట్టుబాటు ధర ఎలా అందిస్తారు?
పప్పు దినుసులు, చిరు ధాన్యాలు, వరి తదితర వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక వ్యూహం రచించారు. తొలిదశలో పల్సెస్, మిల్లెట్స్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధిక దిగుబడులిచ్చే వంగడాల అన్వేషణ దగ్గర నుంచి.. ప్రపంచంలో ఏ పంటకు ఎక్కువ ధర ఉందో.. ఏ వస్తువులకు అధిక డిమాండ్‌ ఉందో గుర్తించి.. ఆయా పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించి.. ఫలాన ధరతో కొనుగోలు చేస్తామని ఆయా బోర్డులు ఒప్పందాలు చేసుకుంటాయి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాయి. ఈ బోర్డులు ధరల స్థిరీకరణ నిధి నుంచి రుణ రూపంలో నిధులను సమకూర్చుకుంటాయి. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కడంతోపాటు.. దేశానికి విదేశీ మారకద్రవ్యం కూడా లభిస్తుంది.

ప్రణాళిక సంఘం స్థానంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నాలుగు ప్రాంతీయ ప్రణాళిక మండళ్ల ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?
పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయా ప్రాంతాల అవసరాలు? తీర్చడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అభివృద్ధికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశాలపై ప్రాంతీయ మండళ్లు ప్రభుత్వానికి ప్రణాళిక సమర్పిస్తాయి. వాటిని అనుసరించి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది.

గ్రామానికి పంచాయతీ.. రాష్ట్రానికి శాసనసభ, మండలి.. దేశానికి పార్లమెంట్‌  శాసనాలు చేస్తాయి. వాటిని అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సచివాలయాలున్నాయి. కానీ గ్రామ పంచాయతీలకు మాత్రం సచివాలయాలు లేవు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ విప్లవాత్మక చర్యలకు నాంది పలికారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయడం వల్లే గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు దక్కించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఇస్తున్న వాటిని రాయితీలుగా కాకుండా సామాజిక పెట్టుబడిగా పరిగణిస్తోంది.

సాంప్రదాయేతర ఇంధన వనరులను అందిపుచ్చుకునేలా సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విద్యుత్‌ ధరలు తగ్గుతాయని 2014 నుంచే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెబుతూ వస్తున్నారు. డిస్కమ్‌లు వారించినా వినకుండా అధిక ధరలకు విద్యుత్‌ను సుదీర్ఘ కాలానికి కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం గత పాలకుల అవగాహనరాహిత్యానికి, అక్రమార్జనకు సజీవ సాక్ష్యాలు కాదా?.

కేంద్రం నియమించిన ప్రొఫెసర్‌ శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వక ముందే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా, బహిరంగ చర్చ (పబ్లిక్‌ డిబేట్‌) లేకుండా ఏకపక్షంగా రాజధానిపై నిర్ణయం తీసుకుంది. నాటి నుంచి నేటివరకు రాయలసీమలో, ఉత్తరాంధ్రలో ప్రజోద్యమాలు ఎగసిపడుతున్నాయి.  ప్రజల మనోభావాలను గౌరవిస్తూ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సెప్టెంబరు 13న రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికపై బహిరంగ చర్చ నిర్వహించి జనం మెచ్చేలా.. ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాజధానిపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారు.

పరిశ్రమల పేరుతో విలువైన భూములను గత పాలకులు కొందరికి అతి తక్కువ ధరకు కట్టబెట్టారు. ఇప్పటికీ పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
నిబంధనల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేయని సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామికాభివృద్దే లక్ష్యంగా పెట్టుబడిదారులకు, ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా ఉండేలా అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నాం. 

గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలను ప్రభుత్వం సమీక్షించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి కదా?
సరికొత్త ఆవిష్కరణలు రావడంతో సౌర, పవన విద్యుత్‌ ధరలు భారీ ఎత్తున తగ్గుతాయని 2014 అక్టోబర్‌ 10న ఎన్‌ఆర్‌ఈఎల్‌ నివేదిక ఇచ్చింది. 2015–22 మధ్య కాలంలో సౌర విద్యుత్‌ ధరలు 17 నుంచి 22 శాతం, పవన విద్యుత్‌ ధరలు 6 నుంచి 11 శాతం తగ్గుతాయని నీతి ఆయోగ్‌ తేల్చి చెప్పింది. 2025 నాటికి సౌర, పవన విద్యుత్‌ ధరలు 26 నుంచి 35 శాతానికి తగ్గుతాయని ఇంటర్నేషనల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఆర్‌ఏఎన్‌ఏ) 2017లో స్పష్టం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి, నాటి విద్యుత్‌ శాఖ మంత్రికి ఆ రంగంపై కనీస అవగాహన ఉంటే అధిక ధరలకు పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు చేయరు. 25 ఏళ్లపాటు అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేసి ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారన్నది స్పష్టమవుతోంది. పీపీఏల సమీక్షించడం వల్ల ఏపీలో విద్యుత్‌ ధరలు తగ్గిస్తే.. ఇతర రాష్ట్రాల్లోనూ తగ్గించాల్సి వస్తుందని ఉత్పత్తి సంస్థలు భయపడుతున్నాయి. ప్రజలపై భారం తగ్గించడమే లక్ష్యంగా పీపీఏలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి తీరుతుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా