బీసీలను దగా చేశారు

7 Apr, 2019 10:49 IST|Sakshi

టీడీపీ ప్రభుత్వంలో బీసీల కులవృత్తులను నిర్వీర్యం చేశారు

బీసీలను గుర్తించింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే..

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్‌ బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు ధన్నారపు మస్తానరావు

సాక్షి, ప్రకాశం: ‘మాట్లాడితే చాలు.. మాది బీసీల పార్టీ అంటారు. వెనుకబడిన తరగతుల వారికి వెన్నుదన్నుగా ఉన్నామంటారు. బీసీల ఓట్లన్నీ మావేనంటారు. ఊకదంపుడు ఉపన్యాసాలు మినహా బీసీల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిందేమీ లేదు’ అని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు ధన్నారపు మస్తానరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీలను చంద్రబాబు ఏ విధంగా నయవంచనకు గురిచేశారో ఆయన వివరించారు.

‘మన రాష్ట్రంలో, జిల్లాలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. అలాంటి బీసీలను చంద్రబాబు దగా చేశారు. రాజకీయంగా పూర్తిగా అణగదొక్కారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని స్వయంగా సుప్రీంకోర్టుకు లేఖరాశారు. బీసీలు తెలివితక్కువ వారంటూ ఆయన రాసిన లేఖను బీసీ సామాజికవర్గానికి చెందిన జస్టిస్‌ ఈశ్వరయ్యగౌడ్‌ బయట పెట్టకుంటే చంద్రబాబును నమ్మి బీసీలు మరింత మోసపోయేవారు. బీసీల పట్ల ఆయనకున్న చులకన భావం గురించి సమాజానికి తెలిసేది కూడా కాదు. బీసీలకు చెందిన మత్స్యకారులు సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబును కలవగా, ‘తాటతీస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. నాయీబ్రాహ్మణులు వెళ్లి కలిస్తే.. ‘తోలుతీస్తా’ అని అన్నారు. ముదిరాజ్‌లు వెళ్లి కలిస్తే ‘అసలు రాష్ట్రంలో మీరెక్కడున్నారు’ అంటూ అవమానించారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలను నిర్వీర్యం చేయడం ద్వారా బీసీలే అత్యధికంగా నష్టపోయారు.. ఇలా చెప్పుకుంటూపోతే బీసీలకు చంద్రబాబు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు’ అని మస్తానరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంటర్వ్యూ విశేషాలు...

సాక్షి : బీసీల పట్ల చంద్రబాబు వైఖరి ఏంటి..?
మస్తానరావు : బీసీల పట్ల చంద్రబాబు చెప్పేది ఒకటి, లోలోపల చేసేది మరొకటి. బీసీలు తనకు అండగా ఉంటారని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు లేఖ రాశాడంటే, తన మనసులో బీసీల పట్ల ఎంతటి కుట్ర దాగి ఉందో బట్టబయలైంది. కొన్ని సంవత్సరాల పాటు అత్యున్నత న్యాయస్థానాల్లో బీసీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుది. ఆ విషయం బయటపడేటప్పటికే బీసీ న్యాయమూర్తులుగా వెళ్లాల్సిన వారికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. కొంతకాలం తర్వాత.. అది కూడా ఒక బీసీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్యగౌడ్‌ ఆ లేఖను బయట పెట్టిందాకా ఏ ఒక్కరికీ చంద్రబాబు కుట్ర తెలియలేదు. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.

సాక్షి : చంద్రబాబు పాలనలో వెనుకబడిన తరగతుల వారికి ఉన్నత విద్య అందిందా..?
మస్తానరావు : ఎక్కడ అందింది..? రాష్ట్రంలో కార్పొరేట్‌ కళాశాలలు 80 శాతానికిపైగా ఆయన సామాజికవర్గానికి చెందిన వారివే. నారాయణ, చైతన్య, భాష్యంతో పాటు ఇంకా ఎన్నో కార్పొరేట్‌ కళాశాలలు ఆయన సామాజికవర్గానికి చెందిన వారివే. అందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులను రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుకోవచ్చని జీఓ ఇచ్చారు. దీంతో వారంతా అమాంతం ఫీజులు పెంచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయడంతో బీసీలు ఆ ఫీజులు కట్టలేక ఉన్నత విద్య పొందలేకపోయారు. 

సాక్షి : ప్రస్తుతం బీసీల విద్య పరిస్థితి ఎలా ఉంది..?
మస్తానరావు : 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పాఠశాల విద్యపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో 9,500 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిన మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబే. సర్కారు విద్యను నిర్వీర్యం చేశారు. ఎందుకంటే కార్పొరేట్‌ కళాశాలలకు ప్రయోజనం చేకూర్చడమే ఆయన లక్ష్యం. 
రాష్ట్రం విడిపోకముందు సమైక్యాంధ్రలో 18 గురుకుల కళాశాలలు ఉన్నాయి. విడిపోయిన తర్వాత కూడా అవే ఉన్నాయి. కొత్తగా ఒక్క కళాశాలను కూడా తీసుకొచ్చింది లేదు. కార్పొరేట్‌ కళాశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివలన బీసీలు, సంచార జాతుల వారు సర్కారు విద్యకు దూరమయ్యారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని సన్నబియ్యంతో పెడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం రేషన్‌ బియ్యంతో పెడుతున్నారు.

సాక్షి : ఆరోగ్యశ్రీ, 108 పథకాల అమలు ఏ విధంగా ఉంది..?
మస్తానరావు : వైఎస్సార్‌ హయాంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే సమీపంలోని వైద్యశాలలకు వెళ్లాలంటే 108కు ఫోన్‌ చేస్తే రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఫోన్‌ చేస్తే 108 ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈలోగా ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వైఎస్సార్‌ పాలనలో ఆరోగ్య శ్రీ పథకం వల్ల నిరుపేదలు రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్లు సైతం చేయించుకున్నారు. ఇప్పుడు వైద్యశాలకు వెళితే ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని, ఉచిత వైద్యం లేదని చెప్పడంతో పేదలు అనారోగ్యంతో చావుకు చేరువవుతున్నారు.

సాక్షి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌ వల్ల బీసీలకు ప్రయోజనం చేకూరుతుందా..?
మస్తానరావు : యువనేత అయినా బీసీల పట్ల చాలా ముందు చూపుతో వైఎస్‌ జగన్‌ వ్యవహరించారు. తన పాదయాత్ర సమయంలోనే బీసీ అధ్యయన కమిటీని పార్టీ తరఫున నియమించారు. అనేక బీసీ సామాజికవర్గాలకు చెందిన వారిని ఆ కమిటీలో సభ్యులుగా వేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏలూరులో బీసీ గర్జన ఏర్పాటు చేసి బీసీలకు తాను ఏం చేస్తాడో వెల్లడించారు.

సాక్షి : బీసీ గర్జన వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరింది..?
మస్తానరావు : బీసీ గర్జన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే.. వైఎస్సార్‌ సీపీకి ఒక ఎమ్మెల్సీకి అవకాశం వచ్చింది. ఆ ఒక్క స్థానాన్ని బీసీ సామాజికవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తియాదవ్‌కు ఇచ్చి తనకు బీసీల పట్ల ఉన్న అభిమానాన్ని జగన్‌ చాటుకున్నారు.

సాక్షి : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ఏమైనా చేశారా..?
మస్తానరావు : రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా బీసీలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రతాంబూలం ఇచ్చారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఊహకు అందని విధంగా, ఎవరూ సాహసం చేయలేని విధంగా బీసీలకు 41 అసెంబ్లీ సీట్లు కేటాయించి బరిలో నిలిపారు. సామాన్యులైన ఏడుగురు బీసీలను పార్లమెంట్‌ అభ్యర్థులుగా పోటీలో ఉంచారు.

సాక్షి : బీసీల పట్ల చంద్రబాబు దురుసుగా ప్రవర్తించిన సందర్భాలేంటి..?
మస్తానరావు : సమస్యలు చెప్పుకునేందుకు రాజధానికి సీఎంను కలిస్తే పళ్లు బిగపట్టి కళ్లు ఎర్రచేసి వేలు చూపిస్తూ తోలు తీస్తా.. తాట తీస్తా అని మాట్లాడారు. బీసీలేమైనా పశువులా.. తోలు తీయడానికి..? వీళ్లేమైనా జామాయిల్‌ కర్రా తాట తీయడానికి. ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తగని పని. మత్స్యకారులు వెళ్లి వేట నిషేధ సమయంలో జీవనం దుర్భరంగా ఉందని, ఆ సమయంలో నెలకు రూ.10 వేలు కేటాయించాలని ప్రాధేయపడితే తోలు తీస్తానని బెదిరించాడు. 
♦ నాయీబ్రాహ్మణులు రాజధానికి వెళ్లి బార్బర్‌ షాపులకు ఏటా రూ.10 వేలు ఆర్థికసాయం అందించాలని, షాపునకు నెలకు 150 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని, దేవాలయ పాలకమండలి కమిటీల్లో తమ సామాజికవర్గానికి స్థానం కల్పించాలని అడిగితే తోలు తీస్తానని బెదిరించాడు.
ముదిరాజ్‌లు చాలా వెనుబడి ఉన్నామని, కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరితే అసలు మీరెక్కడున్నారని గదిమాడు. వాళ్లను తీవ్రంగా అవమానపరిచి బయటకు గెట్టించేశాడు. బీసీలపై ఆయనకున్న భావన అది.

మరిన్ని వార్తలు