ప్రజల పక్షపాతి జగన్‌

12 Jun, 2019 08:15 IST|Sakshi

సీఎం నిర్ణయాలతో ప్రతిపక్ష టీడీపీకి మాటల్లేవ్‌

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయ న కుమారుడైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజల పక్షపాతి. మాట మార్చ రు, మడమ తిప్పరు అనేది వైఎస్‌ వంశంలోనే ఉంది’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామా త్యులు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ‘ఇన్నాళ్లూ హామీలు ఇచ్చి మరచిపోయే ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాటన్నింటినీ రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో జగన్‌ చూశారు. తమ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఇచ్చిన ప్రతి హామీ, ప్రతి వాగ్దానమూ నెరవేర్చే దిశగా యువ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుం టున్నారు. అందులో భాగంగానే గత వారం రోజుల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో సోమవారం జరిగిన క్యాబినెట్‌ తొలి సమావేశమే అద్భుతం. ఆ మంత్రివర్గంలో సభ్యుడిగా నేనూ పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది’ అని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఉద్వేగంతో చెప్పారు. బుధవారం అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....

‘మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయే నాయకుడు కాదు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ, వాగ్దానాన్నీ అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదీ పూర్తి పారదర్శక విధానంతో అవినీతికి ఆస్కారం లేకుండా పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానంలోనే తమ ప్రభుత్వం పనిచేస్తుం దని ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారం రోజునే జగన్‌ విస్పష్టంగా ప్రకటించారు. శాసనసభాపక్ష సమావేశంలోనూ, క్యాబినెట్‌ మీటింగ్‌లోనూ మాకు కూడా అదే దిశానిర్దేశం చేశారు. మరో విశేషమేమిటంటే జగన్‌ మంత్రివర్గ కూర్పు. బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన మాదిరిగానే తు.చ తప్పకుండా అమలుచేయడం ఆయన విశ్వసనీయతకు అద్దం పడుతోంది.

నవరత్నాలు అమలు 
మా పార్టీ వైఎస్సార్‌ సీపీ మ్యానిఫెస్టోలో జగన్‌ రూపకల్పన చేసి నవరత్నాల్లాంటి పథకాలను పొందుపరిచారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటిని అమలు చేసేందుకు ఆయన కనబరుస్తున్న శ్రద్ధాసక్తులు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటన వారి జీవితాలను మెరుగుపరుస్తుంది. 2004 సెప్టెంబరు తర్వాత ఉద్యోగాలు పొందినవారికి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌ను దూరం చేసే సీపీఎస్‌ విధానం రద్దుకు తీసుకున్న నిర్ణయం అద్భుతం.

రైతులపై మమకారం..
వ్యవసాయం దండగని తన మనసులో మాటను బయటపెట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతుల పట్ల వివక్షనే చూపించారు. కేవలం అధికారంలోకి రావడానికే రైతు రుణాలన్నీ మాఫి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి గత ఐదేళ్లలో చూశాం. అందుకు భిన్నం మా ప్రభుత్వం. రైతులపై గౌరవం ఉంది. వ్యవసాయం అంటే మమకారం ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే జగన్‌ వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ప్రకటించారు. ఆయనకంటే అన్నదాత అభిమాని ఇంకెవరూ ఉండరు.

విప్లవాత్మకమైన మార్పులు..
అమ్మ ఒడి పథకం నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ వరకూ అన్ని అంశాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులకు జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయన పరిపాలనలో రాష్ట్ర ప్రజలు నిజమైన, మెరుగైన జీవన ప్రమాణాలు పొందుతారనడంలో సందేహం లేదు. ప్రభుత్వపరంగా అనవసర ఖర్చులకు, ఆడంబరాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు చేయాలనే సంకల్పం ఆయనది.

ప్రతిపక్షం నుంచి మాటల్లేవ్‌..
రాష్ట్ర శాసనసభ బుధవారం కొలువుదీరుతున్న వేళ యువ ముఖ్యమంత్రిగా జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చూసి ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నోట మాటే కరువైంది. ఒకప్పుడు జగన్‌ ఇస్తున్న హామీలను ఎద్దేవా చేసింది వారే. ఆ హామీలు సాకారమవుతుంటే ఏమంటారని ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మూలాలతో సహా పెకిలించి త్వరలోనే ఆయా నాయకుల జాతకాలు బయటపెడతాం.

ప్రజా సంక్షేమ ప్రభుత్వం మాది..
ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల వరకూ జీతాలు, వేతనాల్లో ఒకేసారి మార్పుతీసుకొచ్చిన ప్రభుత్వం మాది. బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి జగన్‌ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గొప్ప విజన్‌ ఉన్న నాయకుడు జగన్‌. ఆయన మంత్రివర్గంలో నాకు చోటుదక్కడం నా జీవితంలో ఓ అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నా. నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా. జిల్లా అభివృద్ధికి నా వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తా.’

మరిన్ని వార్తలు