హోదాపై బాబు యూటర్న్‌

19 Mar, 2019 11:35 IST|Sakshi
ఆచార్య ఆదిత్య

ప్రత్యేకహోదా పేరెత్తితే జైలుకు పంపుతానన్నదీ చంద్రబాబే... 

అభివృద్ధి చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువ

ఎల్లో మీడియా వల్ల వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు

ప్రముఖ విద్యావేత్త ఆచార్య ఆదిత్య ‘సాక్షి’కి ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూ

సాక్షి, నెల్లూరు: ‘ప్రత్యేక హోదా వల్ల ఏమి ఒరుగుతుంది.. హోదాకు మించి కేంద్రం ప్యాకేజీ ఇచ్చింది. ఇదీ నాకష్ట ఫలితమే’ అంటూ చంద్రబాబు నాలుగేళ్లపాటు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చాడు.. ‘నాలుగేళ్లలో ఎవరైనా హోదా అంటూ రోడ్లపైకి వస్తే జైలుకు పంపుతానని బెదరింపులకు దిగాడు.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్రాన్ని పొగడుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.. ఏడాది నుంచి యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదాపై పోరాటం అంటూ దీక్షలు చేయడంతో ప్రజల్లో చులకనయిపోయాడు.’ అని నెల్లూరుకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక వాది ఆదిత్య విద్యాసంస్థల అధినేత ఆచార్య ఆదిత్య పేర్కొన్నారు. ఆయన సోమవారం సాక్షి ప్రతినిధితో ముచ్చటించారు.

నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి, టీడీపీ చెందిన ఇద్దరు ఎంపీలను కేంద్ర మంత్రులు చేశారు. అంటే కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ ఇద్దరు మంత్రుల ప్రమేయం ఉంటుంది కదా.. మరి ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీ ఇస్తున్నప్పుడు ఆ మంత్రులు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఇంతకంటే ఇంకేమీ కావాలని చెప్పింది చంద్రబాబే కదా..? నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి ప్రపంచంలోనే ఏవరూ లేరంటూ అసెంబ్లీలో పొగిడింది కూడా చంద్రబాబే కదా? మరి ఎన్నికలు ఏడాది ఉండగానే ఆయనకు ప్రత్యేకహోదా గుర్తొచ్చిందా.. ఇలా యూటర్న్‌ తీసుకుంటే ప్రజలు ఏమనుకుంటారనే స్పృహ కూడా చంద్రబాబుకు లేదు.

ఒకే స్టాండ్‌ తీసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచి ఒకే స్టాండ్‌ తీసుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా పైనే  నిలబడ్డారు. చంద్రబాబు పాలన అనుభవం అంత వయస్సు జగన్‌కు లేదు కానీ అనుభవం కంటే జగన్‌కున్న పట్టుదలే గొప్పది. ప్రత్యేక  హోదా అనేది 14వ ఆర్థిక సంఘం పరిధిలో ఉంది. చిన్న రాష్టాలుగా విడిపోతే పరిపాలన సౌలభ్యం ఉంటుందనే పాలసీలో కేంద్రం ఉంది. విడిపోయిన రాష్ట్రాలకు హోదా ఇవ్వాలంటే ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు. దీనికోసమే ప్యాకేజీ ఇచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు ఎన్నికల కోసం మోదీని భూతంలా చూపెడుతున్నాడు.

చంద్రబాబుకు ప్రచార పిచ్చి
చంద్రబాబుకు చేసిన పనుల కంటే ప్రచారం ఎక్కువగా చూపించుకుంటున్నాడు. మీడియాను మ్యానేజ్‌ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఒక్క సాక్షిలో తప్ప ఏ పత్రిక, ఏ చానల్లో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా చూపించరు. ఆయన తప్పు చేసినా కూడా అది ఆంధ్రుల కోసమే చేసినట్లుగా చూపిస్తారు. ఇది పెద్ద దుర్మార్గం. మీడియా అంటే ఒక వర్గానికి కొమ్ము కాయడం కాదు. జరిగే వాస్తవాలను ప్రజలకు చూపించాలి. మీడియా విలువలను కూడా దిగదార్చిన వ్యక్తి చంద్రబాబే.

పాలన, పోషణ, రక్షణ కరువే!
ప్రభుత్వం అంటే పాలన, పోషణ, రక్షణ కల్పించాలి. ఆ మూడింటిలో చంద్రబాబు విఫలమయ్యాడు. పాలనంతా కూడా అవినీతి మయం చేశాడు. పోషణ వ్యవహారం కూడా ఎన్నో అక్రమాలు, అవినీతి జరిగి ప్రజలకు చేరువకాలేకపోయాడు. ఇక రక్షణ విషయంలో చాలా ఘోరంగా విఫలమయ్యాడు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే సీఎం స్థానంలో ఉండి వక్రీకరించడం ఎంతవరకు న్యాయం. కడప మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చారు. అందులో కూడా రాజకీయం వెతకడం చూస్తుంటే ప్రజలకు రక్షణ ఎంత వరకు కల్పిస్తున్నాడో అర్థమైపోతుంది.

గ్రాఫిక్స్‌కే రాజధాని పరిమితం
ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపడతానని సీఎం చంద్రబాబు ఐదేళ్లపాటు ప్రజలకు చెబుతూ వచ్చాడు. 33 వేల ఎకరాలు భూములు సమీకరించాడు.  ప్రతిసారి ఎదో దేశానికి పర్యటనకు వెళ్లి ఆ దేశ స్థాయిలో రాజధాని నిర్మాణం అంటూ గ్రాఫిక్స్‌ చూపిస్తూ వచ్చాడు. ఐదేళ్లలో చూస్తే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం  ఉద్యోగులకు నివాసముండే ఇళ్ల నిర్మాణాలు తప్ప మరేమైనా నిర్మాణాలు జరిగాయా? చేసిన అభివృద్ధి కంటే చూపించే ప్రచారం ఎక్కువగా ఉంది. లోటు బడ్జెట్‌లో ఉంటే సదరన్‌ స్టేట్స్‌లో నంబర్‌వన్‌ అని ఎలా చెప్పుకుంటారు. లోటు బడ్జెట్‌లో ఉంటే అభివృద్ధిలో మనమే ఫస్ట్‌ అని చంద్రబాబు  ఎలా చెప్పుకుంటాడు?

వైఎస్సార్‌ హయాంలో సంక్షేమం బాగు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనకు, చంద్రబాబు పాలనకు చాలా తేడా కన్పిస్తుంది. వైఎస్సార్‌ పేదవర్గాలకు అందే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ , 108 వాహనం ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లాయి. ప్రతి పేదవాడు కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యం బాగు చేయించుకునేవాడు. ఇప్పుడు అలా లేదు. ఆరోగ్యశ్రీ ప«థకంలోకూడా ఎన్నో లోపాలున్నాయి. ఆ పథకానికి కూడా నిధులు కూడా ఇవ్వకపోవడంతో ఆస్పత్రులు వారు రోగులకు పట్టించుకోవడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.35 వేలకు పరిమితం చేయకూడదు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన పేద వర్గాలకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి. ఇక జ్ఞానభూమి ప్రవేశపెట్టి అందులోకూడా ఒక సామాజిక వర్గానికే ప్రోత్సాహం జరిగేలా చేశాడు.

అవినీతే ఎక్కువ
రాష్ట్రంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువగా  కన్పిస్తుంది. చంద్రబాబు తన తనయుడు లోకేష్‌కు పాలనా విషయాల్లో పూర్తిగా పగ్గాలు ఇవ్వడంతో వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు. ఎక్కువగా అవినీతికే ప్రాధాన్యం ఇచ్చాడు. సంక్షేమ పథకాలు అమలులోకూడా అవినీతే తాండవిస్తుంటే పేదవర్గాలకు ఎలా సంక్షేమ ఫలాలు అందుతాయి. ఒకే సామాజిక వర్గాన్ని ప్రోత్సాహించేలా పాలన చేయడం సంస్కారం కాదు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధమే వస్తుంది.

మరిన్ని వార్తలు