నవ్వడం.. నవ్వించడం.. ఓ వరం

7 Oct, 2019 10:51 IST|Sakshi

సాక్షి, అరసవల్లి : సహజంగా అందరూ నవ్వుతారు. అయి తే నవ్వడంతో పాటు నవ్వించడం కూడా పెద్ద వరంలాంటిదే.. అని యువ కమేడియన్, ‘జబర్దస్త్‌’ త్రినాథ్‌ అన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. అంతరాలయ దర్శనం అనంతరం ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. చిన్ననాటి కష్టాలతో పాటుగా పెరిగిన సినీ ఆసక్తి, ప్రస్తుతం వస్తున్న అవకాశాల వివరాలు ఆయన మాటల్లోనే...
సాక్షి: ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం?
త్రినాథ్‌ : మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి. అమ్మ కాటుక డబ్బాలు అమ్ముతూ.. నన్ను పెంచింది. కటిక పేదరికం నుంచి ఈ స్థాయికి వచ్చాను. ఆ కష్టాలేవీ మరిచిపోలేదు. ప్రాథమిక విద్య అంతా నవోదయ స్కూల్‌లో చదివినప్పటికీ.. ఆ తరువాత సినిమాలపై ఇష్టంతో బీఏ వరకు చదివాను. కాలేజీ చదువుల నుంచి సిని మాలపై ఆసక్తి ఎక్కువ ఉండేది. మా ఊరి నుం చి గొప్ప ఆర్టిస్ట్‌గా అందరి అభిమానం పొం దాలనేది నా కోరిక. అందరినీ నవ్వించి మెప్పిం చాలని మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలన్నదే లక్ష్యం.
సాక్షి: కమేడియన్‌గా ఎలా అవకాశం వచ్చింది?
త్రినాథ్‌:: చిన్నప్పటి నుంచి మిమిక్రీపై ఆసక్తి ఉం డేది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు సాయికుమార్‌ గొంతులను అనుకరించేవాడిని. ఇదే బేస్‌తో జబర్దస్త్‌ వంటి సూపర్‌ కామెడీ షోలో అడుగుపెట్టాను. ఇప్పటికి 240 వరకు స్కిట్స్‌ చేశాను. ఇందులో మంచి స్కిట్స్‌తో నవ్వించడంతో పేరు, గుర్తింపు వచ్చాయి. దీంతో నా ఇంటి పేరే జబర్దస్త్‌ అయ్యింది. అలాగే జూలకటక అనే కామెడీ షో కూడా చేస్తున్నాను.
సాక్షి: శ్రీకాకుళం యాస బాగా వంట పట్టించుకున్నారు?
త్రినాథ్‌ : అలా ఏమీ లేదు. ఇది నా సొంత యాస ని గర్వంగా చెప్తుంటాను. శ్రీకాకుళం యాసకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకత ఉంది. నాకు గుర్తింపు తెచ్చింది మన మాటలే. ఈ ప్రాంత యాసను ఎవరు తప్పు పట్టినా ఊరుకునేది లేదు. కామెడీ షోల్లో నా మాటలకే నాగబాబు, రోజాగారు ఇంప్రెస్‌ అవుతున్నారంటే.. అది ఇక్కడి మాటతీరు గొప్పతనం. ఇంతవరకు షకలక శంకర్‌ అద్భుతంగా శ్రీకాకుళం యాసతో మెప్పించి, ప్రస్తుతం హీరో స్థాయికి ఎదిగారు.
సాక్షి: సినిమా చాన్సుల సంగతేంటి?
త్రినాథ్‌ : సినిమా చాన్స్‌లు వస్తున్నాయి. ఇంతవరకు 15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. బాబు బంగారం, కల్యాణ్‌రామ్‌ ఎంఎల్‌ఏ, నందినీ నర్సింగ్‌హోం, మీలో ఎవరు కోటీశ్వరుడు?, అంతర్వేది టు అమలాపురం తదితర చిత్రాల్లో నటించాను. జిల్లాలోని పలాసలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘పలాస 1978’ సినిమాలో రెండో విలన్‌గా నటిస్తున్నాను. ఇందులో ఓ ఐటమ్‌ సాంగ్‌ కూడా చేశాను. ఈసినిమా నవంబర్‌లో విడుదల కానుంది. అలాగే నమిత లేడీ ఓరియంటెడ్‌గా చేస్తున్న సినిమాలో ఆమె వెంట ఉండే కానిస్టేబుల్‌ పాత్ర కూడా చేస్తున్నాను. ఇలా మొదలైంది ప్రేమకథ అనే సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.
సాక్షి: ఎటువంటి పాత్రల్లో నటించడం మీకిష్టం?
త్రినాథ్‌ : నాకు వర్తమానం అంటే ఇష్టం. ఇప్పుడు ఎలా.. ఎంత బాగా చేస్తున్నామో అని మాత్రమే ఆలోచిస్తాను. అవకాశాలన్నీ భవిష్యత్‌లో రావాలంటే ఇప్పుడు బాగా చేయాలి కదా. లేదంటే రేపు ఏం జరుగుతుందో అని టెన్షన్‌ ఒక్కటే మిగులుతుంది. నా గురువు గారు దర్శకుడు వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో ఎంఎస్‌ రాజు గారి కుమారుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా ఓ చిత్రాన్ని చేస్తున్నాను. ఇది నాకు చాలా ప్రాధాన్యమైన ప్రాజెక్టు.
సాక్షి: సంతృప్తి ఇచ్చిన సంఘటనలేమైనా ఉన్నాయా?
త్రినాథ్‌ : నిజంగా ఇదే చెప్పాలనుకుంటున్నా. 2 విషయాల్లో నాకు చాలా ఆనందం కలిగింది. మా గురువుగారు వి.ఎన్‌.ఆదిత్య ప్రోత్సాహం తో అమెరికా తానా మహాసభల్లో పాల్గొని ప్రదర్శన ఇవ్వడం మర్చిపోలేను. అంతకంటే ముఖ్యం గా ఎన్నో కష్టాలు పడి, నన్ను పెంచి, పెద్ద చేసిన నా తల్లిని, సొంత కారులో ఎక్కించుకుని తిప్పడం జీవితంలో మరిచిపోలేనిది.

మరిన్ని వార్తలు