నవ పాలనకు నాంది

9 Apr, 2019 14:39 IST|Sakshi

అన్ని వర్గాల వారికి సేవలందిస్తా

పార్టీలకు అతీతంగా పథకాలు పంచిపెడతా

రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు

సాక్షి, రాజాం (శ్రీకాకుళం): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే కంబాల జోగులును గంజాయివనంలో తులసిమొక్కగా ఊరకనే అభివర్ణించలేదు. టీడీపీ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా అమ్ముడుపోలేదు. బెదిరింపులకు దౌర్జన్యాలకు సైతం దిగినా వెన్నుచూపలేదు. అందుకే ఆయన నిష్కళంకుడిగా, నిస్వార్థపరుడిగా, అవినీతి రహితుడిగా గుర్తింపు పొందారు. ప్రజలకు సైతం నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉంటూ అధికార పార్టీ అవినీతి అక్రమాలను ఎండగట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నందున ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న ఈయన్ను మరోమారు గెలిపిస్తే రాజాం నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కంబాల జోగులు సాక్షితో కాసేపు ముచ్చటించారు.

నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు.?
జవాబు: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచే పార్టీలో ఉన్నాను. మాటమీద నిలబడే నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 2014 ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని పార్టీ కోల్పోయింది. రాజాం నియోజకవర్గ ప్రజలు మాత్రం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అనంతరం ఈ ఐదేళ్లు ప్రజల్లో ఉండేలా జగన్‌మోహన్‌రెడ్డి పలు కార్యక్రమాలను రూపొందించారు. ప్రజల తరపున పోరాడుతూ రచ్చబండ, పల్లెనిద్ర, గడపగడపకు వైఎస్సార్, నిన్ను నమ్మం బాబు వంటి కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోయాం. గ్రామాల్లో ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆప్యాయతగా పలకరిస్తున్నారు. కలివిడిగా వెన్నంటి నడుస్తున్నారు.

నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలేమిటి ?
జవాబు: రాజాం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన రాజాం రోడ్డు విస్తరణను, హైటెక్‌ సిటీ నిర్మాణాన్ని, పార్కుల ఏర్పాటును పక్కన పెట్టేశారు. 777 రోజులుగా సంతకవిటి మండలం వాల్తేరు వద్ద వంతెన కోసం దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదు. వంగర మండలం కిమ్మి, రుషింగి వంతెనను అర్ధాంతరంగా వదిలేశారు. వంగర, సంతకవిటి, రేగిడి మండలాల్లోని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సుల్లేవు. మడ్డువలస, తోటపల్లి సాగునీరు పొలాలకు అందడం లేదు. రూ. 49 కోట్లతో నిర్మించిన పథకం నీరుగారి ప్రజలకు తాగునీటి కష్టాలు తెచ్చి పెడుతోంది. రేగిడిలో జూనియర్‌ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాజాంలో మోడల్‌ స్కూల్, రెసిడెన్షియల్‌ పాఠశాల లేక చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. పత్తి, మొక్క జొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు లేవు. ఈ సమస్యలన్నింటినీ తెలుసుకున్నాం.

సమస్యలు పరిష్కారానికి ఎలా కృషిచేస్తారు?
జవాబు: ఒకప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాజాంలో జ్యూట్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మా పార్టీ అధికారంలోకి రాగానే జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో పరిశ్రమల యాజమాన్యానికి ఆర్థికసాయం అందించే ఆలోచనలో ఉన్నాం. తద్వారా ఫ్యాక్టరీలను తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. రాజాం రోడ్డు విస్తరణతోపాటు హైటెక్‌ సిటీ నిర్మాణం, పార్కుల ఏర్పాటు వేగవంతం చేస్తాం. అన్ని మండల కేంద్రాలకు డబుల్‌ రోడ్డు నిర్మాణంతోపాటు ఆర్టీసీ షటిల్‌ సర్వీసులను పునరుద్ధరిస్తాం. రేగిడిలో జూనియర్‌ కళాశాల ఏర్పాటుతోపాటు రాజాంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ప్రారంభిస్తాం. మోడల్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడంతోపాటు కార్పొరేట్‌ ఫీజులకు కళ్లెం వేస్తాం. కిమ్మి, రుషింగి వంతెన నిర్మాణంతోపాటు బలసలరేవు వంతెన నిర్మాణం పూర్తి చేస్తాం.

టీడీపీ పాలనలో నష్టపోయిన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు?
జవాబు: టీడీపీ పాలనలో అరాచకాలు అధికమయ్యాయి. ప్రధానంగా రాజాం నియోజకవర్గంలో సంతకవిటి మండలంలో ఇండీట్రేడ్‌ పేరుతో టీడీపీ నేతలు రూ. 200 కోట్లు దోచేశారు. బాధితుల తరపున పోరాడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం. కేసును వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటాం. జన్మభూమి కమిటీలతోపాటు టీడీపీ కార్యకర్తల కారణంగా సంక్షేమ పథకాలకు నోచుకోని బాధితులందరికీ పార్టీలకతీతంగా అందిస్తాం. అడిగిన వారికి ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, కొత్త గ్యాస్‌ కనెక్షన్లు, ప్రతీ ఇంటికి తాగునీటి సదుపాయం, ప్రతీ రైతుకు ఉచిత విద్యుత్, ప్రతీ నిరుద్యోగికి ఉపాధి అవకాశం, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం, ఉపాధి వేతనదారులకు 150 పని దినాలను కల్పిస్తాం. ఇందులో ఎటువంటి కమిటీలు రాజకీయ ప్రలోభాలు లేకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతీ పంచాయతీలో పది మంది యువకులకు ఉద్యోగ కల్పన ద్వారా నిరుద్యోగ సమస్యను అధిగమిస్తాం.

మరిన్ని వార్తలు