అక్కడ మొదటిసారిగా బరిలోకి బీసీ..

31 Mar, 2019 10:43 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం రూరల్‌: నిత్యం ప్రజలతో ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ఎంతో కీలకమైన రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానాన్ని ఎప్పుడూ లేని విధంగా బీసీ సామాజికవర్గానికి కేటాయించడం ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమైందన్నారు. పార్టీ ప్రోత్సాహం, కుటుంబ సహకారంతో తాను ఎంపీగా గెలిస్తే ఏం చేస్తానన్నదానిని గురించి ఆయన వివరించారు.

రాజమహేంద్రవరాన్ని నిర్లక్ష్యం చేశారు..
∙ఇప్పటి వరకు రాజమహేంద్రవరాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఎన్నికల హామీలను కూడా పక్కన పడేశారు, దీంతో ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల్లో తీవ్ర నిరాశ నెలకొంది. 


యువతకు ఉపాధి కల్పనే ప్రాధాన్యం
∙రాష్ట్రం విడిపోయాక ఉభయగోదావరి జిల్లాల్లోని యువకులు ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతున్నారు. నా మొదటి ప్రాధాన్యం ఉభయగోదావరి జిల్లాల్లోని యువతకు ఉద్యోగాలు కల్పించడమే. రాజమహేంద్రవరం–కాకినాడల మధ్య ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ప్రత్యేక ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి లభిస్తుంది. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని జగన్‌ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో అత్యధిక  ఎంపీ సీట్లు గెలవాలి. తద్వారా కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలకంగా ఉంటాం. అప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యపడుతుంది. తద్వారా పరిశ్రమలు వస్తాయి. ఇక్కడి యువతకు ఉపాధి దక్కుతుంది. రాజమహేంద్రవరం–కాకినాడ మధ్య అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తే జంటనగరాలుగా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయి. వేమగిరి–కాకినాడ మధ్య రహదారి మార్గం మరింత మెరుగుపరిస్తే ఈ ప్రాంతమంతా మరింత అభివృద్ధి చెందుతుంది.

రాజమహేంద్రవరం నగరానికి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, ఇండోర్‌ స్టేడియం, తీసుకొస్తాం. అన్ని రకాల క్రీడలు ఇక్కడ నిర్వహించే విధంగా కృషి చేస్తాం. స్కూలు పిల్లలకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ కోచ్‌లు, క్రీడాకారులు మన ప్రాంతానికి వస్తారు. రాజమహేంద్రవరం చుట్టుపక్కల గోదావరి లంకల్లో ఉన్న ప్రాంతాల్లో టూరిజం పెంచుతాం. వాటర్‌ స్పోర్ట్స్, అడ్వంచర్‌ స్పోర్ట్స్, ఈవెంట్స్‌ నిర్వహిస్తాం. పర్యాటకులకు గోదావరి అందాలను చూపిస్తాం. స్పీడ్‌బోట్స్, పారా గ్లైడింగ్‌ వంటి వాటిని ఏర్పాటు చేస్తాం. హేవ్‌లాక్‌ బ్రిడ్జిని వెడల్పు చేసి ఫ్యాషన్‌ స్ట్రీట్‌గా మారుస్తాం. వాకింగ్‌ స్పాట్, సాయంత్రం పూట ఆహ్లాదకరమైన మార్కెట్‌ ప్లేస్‌గా చేస్తాం.

మోరంపూడి ఫ్లై ఓవర్, లాలాచెరువు, వేమగిరి ఫ్లై ఓవర్లు మూడుగా కాకుండా ఒక్కటిగా చేస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ దానిమీదుగా వెళ్లిపోతుంది. సిటీ ట్రాఫిక్‌ను కింది నుంచి మళ్లించడం వల్ల వందలాది ప్రమాదాలను నివారించవచ్చు. గోదావరి పక్కనున్న గ్రామాలకు తాగునీటి సదుపాయం పూర్తిస్థాయిలో లేదు. ఇంటింటికీ గోదావరి తాగునీటిని పంపిణీ చేయాలి. గోదావరి నదిలో డ్రైనేజీ వాటర్‌ కలవకుండా చర్యలు చేపడతాం, తద్వారా గోదావరి పవిత్రతను కాపాడుతా. పవిత్ర గోదావరి నదిని కాపాడే ప్రయత్నం ఇంత వరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు. జగన్‌ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఆ పనిచేసి చూపిస్తాం. 

రాజకీయ స్ఫూర్తి....
∙మా తాత ఆరేపల్లి సుబ్బారావు రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌గా, ప్రత్యేక అధికారిగా పనిచేశారు. ఇక్కడ కోటగుమ్మం నుంచి డీలక్స్‌ సెంటర్‌ వరకు రోడ్డు వెడల్పు, ఆనం కళాకేంద్రాన్ని 1970లోనే ఆయన నిర్మించారు. ఇప్పటి వరకు అదొక్కటే ఇక్కడ ఉంది. మరొకటి లేదు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. మా నాన్న మార్గాని నాగేశ్వరరావు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. వారిద్దరే స్ఫూర్తి

నాకు జగనే నా బలం
∙మా ప్రధాన బలం జగన్‌మోహన్‌రెడ్డి.ఆయనను ప్రతి ఒక్కరు  విశ్వసిస్తున్నారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతుందన్న నమ్మకం కూడా పెరిగింది. అదే సమయంలో చంద్రబాబు మోసపూరిత హామీలను కూడా ప్రజలు గుర్తించారు. పవన్, చంద్రబాబులు ఇద్దరూ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇస్తున్న తాయిలాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు ఓటు వేస్తే మళ్ళీ ఎన్నికలప్పుడే మనం గుర్తుకొస్తామని గ్రామస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చింది తీసుకుని జగన్‌కు ఓటేస్తామని పలువురు నేరుగా మాకు చెబుతున్నారు. వృద్ధులు కూడా జగన్‌ ప్రకటించాకనే చంద్రబాబు పెన్షన్‌ పెంచాడంటున్నారు. 

చదువు, కుటుంబం, సేవలు
∙నాతోపాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. నేను ఎంబీఏ చేశాను. వ్యాపార రంగంలో ఉన్నాం. మా తాత ముత్తాతల నుంచి  వంద ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉన్నాం. మరోవైపు సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మార్గాని రామారావు చారిటబుల్‌ ట్రస్టు ద్వారా పలు సేవలు చేస్తున్నాం. 


ప్రజలకు అందుబాటులో ఉంటా
∙ జగన్‌తో పాటు 30 ఏళ్లపాటు రాజకీయాల్లో పయనిద్దామని ముందుకొచ్చాను. క్లీన్‌ ఇమేజ్‌తో నేను రాజకీయ జీవితం ప్రారంభిస్తున్నాను. మళ్లీ ఎన్నికలకు వెళ్లేటప్పుడు నేను ఇది చేశాను కనుక నాకు ఓటేయండి అని అడుగుతాను. ఆ విధంగా నేను ఇక్కడే అందుబాటులోఉంటాను. 


బీసీలకు సీటు కేటాయించిన ఘనత జగన్‌దే
స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం ఒక బీసీ కులానికి  కేటాయించిన ఘనత జగన్‌కే దక్కుతుంది. ఈ కారణంగానే  పలు బీసీ సంఘాలు స్వచ్ఛందంగా తీర్మానాలు చేసి, గెలుపునకు కృషి చేస్తామని ముందుకు వస్తున్నారు. మా కుటుంబ సభ్యులకు ఉభయగోదావరి జిల్లాల్లోని ఇతర కులాలకు చెందిన వారితో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో  మాకు అందరూ సహకరిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు