అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా.. 

9 Apr, 2019 14:49 IST|Sakshi

నమ్మి ఓట్లేసిన ప్రజలను ఎమ్మెల్యే కలమట మోసం చేశారు

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా

సాక్షితో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి

సాక్షి, ఎల్‌.ఎన్‌.పేట (శ్రీకాకుళం): పాలవలస రాజశేఖరం కుమార్తెగా రెడ్డి శాంతి జిల్లా ప్రజలకు సుపరిచితం. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై, వారికి చేదోడువాదోడుగా ఉంటూ వారి అభిమానాన్ని పొందారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. విరామ సమయంలో తన మససులోని మాటలను ‘సాక్షి’తో పంచుకున్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అంటున్నారు.

సాక్షి: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు?
రెడ్డి శాంతి: గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలిపించిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీలో చేరిపోయారు. వైఎస్సార్‌ కుటుంబాన్ని, వైఎస్సార్‌సీపీని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మి ఆయనకు ఓట్లు వేసిన ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని జగన్‌మోహన్‌రెడ్డి నన్ను నియోజకవర్గానికి పంపించారు. 2016 మే నెలలో ఇక్కడ అడుగు పెట్టాను. అప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తూ వారి ఆదరాభిమానాన్ని పొందాను. ఇక్కడి వారు నన్ను వారి కుటుంబ సభ్యురాలిగా అక్కున చేర్చుకుని ఆదరించారు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసి ఓటమి చెందాను. పాలవలస రాజశేఖరం కూతురిగా నియోజకవర్గంతో పాటు జిల్లా ప్రజలకు నేను సుపరిచితురాలినే.
సాక్షి: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు?
రెడ్డి శాంతి: 2016 నుంచి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి రెండు, మూడు సార్లు వెళ్లి అక్కడి ప్రజలతో కూర్చోని గ్రామాల్లోని ప్రధాన సమస్యలు వారిని అడిగి తెలుసుకున్నాను. వంశధార నిర్వాసితులకు 2013 ఆర్‌ఆర్‌ చట్టం, 2017 వరకు యూత్‌ ప్యాకేజీ వర్తింప చేసి న్యాయం చేస్తాం. అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటాం. మెళియాపుట్టి ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ బాధితులకు అండగా ఉంటాం. గిరిజన గ్రామాలను వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.

కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లో వంశధార నదికి కరకట్టలు నిర్మిస్తాం. బాలికల జూనియర్‌ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. పాతపట్నం, కొత్తూరు సీహెచ్‌సీల్లో సదుపాయాలు మెరుగుపర్చుతాం. వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టడం ద్వారా ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తాం. కల్లట, జిల్లేడుపేట, కోరసవాడ, కాగువాడ గ్రామస్తుల వంతెన కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వంతెన నిర్మాణానికి కృషిచేస్తాను.

సాక్షి: మీ విజయానికి వ్యూహాలు ఏమిటి?
రెడ్డి శాంతి: ప్రత్యేక వ్యూహాలు అంటూ ఏమీ లేవు. ఫిరాయింపు ఎమ్మెల్యే అక్రమాలు, టీడీపీ వైఫల్యాలే మా విజయానికి దోహదపడతాయి. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఎమ్మెల్యే కలమట గంగలో కలిపేశారు. ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిన ఎమ్మెల్యే ఇసుక అక్రమ వ్యాపారం, ప్రభుత్వ భూములు కబ్జాపై దృష్టిసారించారు. అందుకే పార్టీ ఫిరాయించారు. టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారు. మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ముందుకు పోతోంది. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ప్రతీ కుటుంబానికి అందజేస్తాం.

సాక్షి: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి?
రెడ్డి శాంతి: నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, వంశధార నిర్వాసితులు ఉన్నారు. వారికి పరిహారం అందించి న్యాయం చేయాల్సిన పాలకులు కట్టుబట్టలతో గ్రామాల నుంచి గెంటేశారు. పంట కోతకొచ్చిందని, సంక్రాంతి పండగను వారి స్వగ్రామాల్లో చేసుకుని వెళ్లిపోతామని ఎంత బతిమాలినా వినకుండా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పోలీసులతో భయపెట్టి, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి బలవంతంగా బయటకు పంపించారు. ఆ సంఘటన నన్న ఎంతగానో కలచివేసింది. సమస్యను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లాను.

ఆయన హిరంమడలం వచ్చి బహిరంగ సభ నిర్వహించి నిర్వాసితులకు అండగా ఉంటానని, 2013 చట్టం వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులపై అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేస్తామన్నారు. 2017 వరకు యూత్‌ ప్యాకేజీ ఇస్తామన్నారు. అలాగే గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. వంశధార, మహేంద్ర తనయ నదులకు ఏటా వచ్చే వరదల కారణంగా తీర ప్రాంత గ్రామాల రైతులు, ప్రజలు నష్టపోతున్నారు. వరద గట్టుల నిర్మాణం పూర్తి చేస్తాం. రైతులను ఆదుకుంటాం. ఏనుగుల సమస్య పరిష్కారానికి కృషిచేస్తాను. అలాగే ఏబీ రోడ్డుతో పాటు గ్రామీణ రహదార్లు అధ్వానంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు