వెలిగొండ పూర్తే ప్రధాన ధ్యేయం

10 Apr, 2019 10:19 IST|Sakshi
బూదాల అజితారావు, మెడబలిమి వెంకటేశ్వరరావు

ప్రతి ఇంటికి రక్షిత నీరు సరఫరా చేస్తాం

చెరువులు పునరుద్ధరణకు చర్యలు

‘సాక్షి’తో వైఎస్సార్‌ సీపీ యర్రగొండపాలెం అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

సాక్షి, ప్రకాశం: వైఎస్సార్‌ సీపీ యర్రగొండపాలెం అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సాక్షితో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రతి మండల కేంద్రంలో రైతు బజారు ఏర్పాటు చేయిస్తాం. రైతులు పండించిన తమ పంటలను రైతు బజార్లలో అమ్ముకోవచ్చు. దీనివలన రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రజలకు తాజా కూరగాయలు అందుతాయి’ అన్నారు.

ప్రతి పంచాయతీ మండల కేంద్రానికి అనుసంధానం
ప్రతి పంచాయతీ మండల కేంద్రాలకు అనుసంధానం అయ్యేవిధంగా రోడ్లు అభివృద్ధి చేస్తాం. దీనివలన మండలకేంద్రాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

2020 నాటికి వెలిగొండ పూర్తి
వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితేనే పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నిరంగాల్లో పూర్తిగా వెనకబడిన యర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి దిశలో నడుస్తుంది. ఈ ప్రాజెక్టును 2020 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాను. అందుకు మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే ప్రాజెక్టుకు పుష్కలంగా నిధులు కేటాయిస్తారు. తన తండ్రి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తారన్న నమ్మకం నియోజకవర్గ ప్రజల్లో ఉంది.

ప్రతి ఇంటికి రక్షిత నీరు అందజేస్తాం
నియోజకవర్గంలోని 5మండలాల్లో 84పంచాయతీలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. కాలంతో పనిలేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాగర్‌ కాలువ అందుబాటులో ఉన్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. నిధులు పూర్తిగా దుర్వినియోగం చేశారేతప్ప శాశ్వత పరిష్కారం చూపించలేక పోయారు. భవిష్యత్తు కాలంలో అటువంటి పరిస్థితి తలెత్తకుండా ప్రతి ఇంటికి రక్షిత నీరు అందచేయటానికి చర్యలు తీసుకుంటాం.

వైపాలేన్ని అభివృద్ధి చేస్తా
యర్రగొండపాలెం నియోజకవర్గం జిల్లాలో పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు, రైతు కూలీలు ఎక్కువగా వలసలు వెళ్తుంటారు. ఆ వలసలను ఆపాలంటే శాశ్వత ప్రాతిపదిక పనులు కల్పించాలి. అందుకు తగిన వనరులు వెతుక్కోవలసి ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని 2004లో వైఎస్సార్‌ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారు. తగిన నిధులు కెటాయించి 70 శాతం పనులు పూర్తిచేశారు. ఆయన అకాల మరణంతో ఈ ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి. వైఎస్సార్‌ తరువాత వచ్చిన పాలకులు వెలిగొండ ప్రాజెక్టును ఎరగా చూపి పశ్చిమ ప్రకాశం ప్రజలను మభ్యపెడుతు వచ్చారు. ఓట్ల కోసం ఆ ప్రాజెక్టును ఉపయోగించుకున్నారు.

పంచాయతీలతో సంబంధం లేకుండా గిరిజన గూడేల అభివృద్ధి
నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో ఎక్కువగా గిరిజనులు నివసిస్తున్నారు. ఆ గూడాలు అభివృద్ధికి నోచుకోలేదు. పాతయుగంనాటి జీవితాలే వారు గడుపుతున్నారు. గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు పంచాయతీలతో సంబంధం లేకుండా నిధులు కేటాయించి గూడాలను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది.

సాగర్‌ ఆయకట్టు రైతులకు నీరు అందేవిధంగా చర్యలు 
సాగర్‌ ఆయకట్టు రైతులకు సకాలంలో నీరు అందేవిధంగా చర్యలు తీసుకుంటాం. పంటలు వేసిన తరువాత ఆ పంట చేతికి వచ్చేవరకు నీరు సరఫరా అయ్యేందుకు కృషి చేస్తాం. సాగర్‌ కాలువలు ఆధునీకరణకు నిధులు పుష్కలంగా విడుదల అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటాను.

చెరువులు పునరుద్ధరణకు చర్యలు
నియోజకవర్గంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. రైతులు తమ పొలాల్లో 800 అడుగులలోతు బోరు డ్రిల్లింగ్‌ చేసినా నీరు ఉబికి వచ్చే పరిస్థితిలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు చెరువులలో నీరు చేరుతున్నప్పటికి ఆ నీరు వృథాగా బయటికి వెళ్తున్నాయి. అందుకు కారణం చెరువు కట్టలు పటిష్టంగా లేకపోవడం, కాలువలు, తూములు శిథిలావస్థకు చేరడమే.  చెరువులను పునరుద్ధరించి, చెరువు కట్టలు పటిష్టం చేసినట్లయితే నీటి నిలువలు మెంటుగా ఉంటాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి.

నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ధ్యేయం
నియోజకవర్గ అభివృద్ధే ప్రధానధ్యేయంగా పెట్టుకున్నాను. నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించేవిధంగా కృషి చేస్తాను. ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను. గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చేస్తాను. నియోజకవర్గంలో జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించి ఉద్యాన పంటలు పండించే రైతులు తమ పంటలను ఇక్కడే గిట్టుబాటు ధరలకు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటాను. జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వలన కొంత మేరకు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజి ఏర్పాటు చేస్తాను. ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండి వారిసమస్యలను పరిష్కరిస్తాను. 
– టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు

ప్రజలచెంతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు
ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే, నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను. గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరవేసేందుకు కృషి చేస్తాను.  ప్రధానంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నియోజవర్గంలో పరిశ్రమలు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటాను.
– కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మెడబలిమి వెంకటేశ్వరరావు

మరిన్ని వార్తలు