తాగు, సాగునీటిపై ప్రత్యేక దృష్టి

9 Apr, 2019 10:16 IST|Sakshi

సంగమేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తా

కొండపిలో వంద పడకల వైద్యశాల ఏర్పాటు

‘సాక్షి’తో వైఎస్సార్‌ సీపీ కొండపి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ వెంకయ్య 

సాక్షి, కొండపి (ప్రకాశం): నియోజకవర్గంలో సాగు, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక్క ప్రాజెక్టు లేకపోవడంతో రైతుల ఇక్కట్లు చెప్పేవీ కావు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీటి ఇక్కట్లును తీరుస్తానని వైఎస్సార్‌సీపీ కొండపి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ వెంకయ్య అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత చేసే అభివృద్ధి పనులను సాక్షిలో ముచ్చటించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువ జరిగిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని తెలిపారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో కరువు కాటాలతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.

వైద్యునిగా ప్రజలకు సుపరిచతం..
పేదల వైద్యునిగా నియోజకవర్గంలో నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. లాభపేక్షలేకుండా సేవా భావంతో వైద్య వృత్తిలో ముందుకు పోతున్నా. అదే తరహ రాజకీయాల్లో సైతం పాటిస్తా. అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవే పరామర్ధంగా ప్రజలకు సేవ చేస్తా. కొండపి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తా.

వంద పడకల వైద్యశాల మంజూరుకు కృషి
కొండపిలోని 30 పడకల వైద్యశాలలో రోగులకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదు. వైద్యాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత 30 పడకల వైద్యశాలను 100 పడకలుగా పదోన్నతి కల్పించి పేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలు ఉచితంగా అందేలా చూస్తా.

అంతర్గత డ్రైనేజీ ఏర్పాటు చేస్తా..
నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో డ్రైనేజీ వ్యవస్థ లేదు. సైడు కాలువల నిర్మాణం సక్రమంగా లేదు. దీంతో వర్షం నీరు పారే వీల్లేక చిరు జల్లులకే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. బురద రోడ్లపై నడవాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో రోడ్లు తటాకాల్లా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తా. కొండపిలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణం చేయిచి ప్రజలకు మురుగు సమస్య పరిష్కారం చేయిస్తాం.

ఓవీ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి..
ఓవీ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఎమ్మెల్యే స్వామి ఐదేళ్లలో రోడ్డు విస్తరణను పట్టించుకోలేదు. రోడ్డు విస్తరణ పనులు జరగ్గా తరుచూ వాహన ప్రమాదాలు జరిగి ఐదేళ్లలో 20 మందికి పైగా మృతి చెందారు. వందల మంది క్షతగాత్రులయ్యారు. పొన్నలూరు మండలంలో ముత్తరాసుపాలెం నుంచి పరుచూరివారిపాలెం వరకు సుమారు 16 కిలోమీటర్ల ఓవీ రోడ్డు విస్తరణ పనులు చేయించి కొండపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని 50గ్రామాల పైగా ప్రజల ఇబ్బందులు తీరుస్తాం. 

చెక్‌డ్యాంల నిర్మాణంతో రైతులకు చేదోడు
నియోజకవర్గ పరిధిలో అవసరమైన చోట మూసి, పాలేరుపై చెక్‌డ్యాంలు నిర్మిస్తా. వర్షాకాలంలో సముద్రం పాలయ్యే నీటిని ఆపి రైతుల వ్యవసాయ అవసరాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. కొండపిలో అట్లేరు మీద ఆగిపోయిన చెక్‌డ్యాం పనులు సైతం పూర్తి చేసి 200 ఎకరాల భూములకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.

ఫ్లోరైడ్‌ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేస్తాం..
నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ నీటి తాగి వందల మంది మృత్యువాత పడ్డారు. ఇంకా చాలా మంది కిడ్నీ వ్యాధితో ప్రమాదపుటంచున ఉన్నారు. ప్రధానంగా మర్రిపూడి మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రజలకు మంచినీరు అందించటం ద్వారా కిడ్నీ వ్యాధులను దూరం చేయవచ్చు. వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తయితే మంచినీటి సమస్య తీరుతుంది. గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయించి తాగునీరు అందిస్తాం. 

టీడీపీ పాలన మొత్తం దోపిడీమయం 
టీడీపీ హయాంలో పాలకులు ప్రకృతి వనరులను దోచుకున్నారు. ఇసుక, మట్టి ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు. ముఖ్య నాయకులకు పర్సంటేజీలు కుదరక సంగమేశ్వరం పనులు నిలిచిపోయాయి. మండలానికి ఒకరిద్దరు చొప్పున కోటరి ఏర్పాటు చేసుకుని ప్రజల సొమ్మును స్వాహా చేశారు. 

సంగమేశ్వరం పూర్తితో రైతుకు ఊతం
నియోజకవర్గంలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. ఐదేళ్లుగా చంద్రబాబు పాలనలో తీవ్ర వర్షాభావంతో కరువు విలయతాండవం చేస్తోంది. నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్ట్‌ లేకపోవడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్‌ హయంలో  పొన్నలూరు మండలంలో చెన్నిపాడు వద్ద పాలేరుపై సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించారు. అయితే టీడీపీ పాలనలో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ఎమ్మెల్యే స్వామి ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే తొలి ప్రాధన్యతగా సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేయించి రైతన్నలకు కానుకగా అందిస్తా. ప్రాజెక్టు పూర్తితే 9,500 ఎకరాలకు సాగునీరు, పొన్నలూరు, జరుగుమల్లి, మర్రిపూడి మండలాల్లోని సుమారు 15 గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుంది.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా. నియోజకవర్గంలో  సాగు, తాగునీరు ప్రధాన సమస్యలు. కనీసం మూసికి సాగర్‌నీరు అందిస్తే మూసి ఒడ్డున ఉన్న గ్రామాల్లో సమస్యలు తీరుతాయి. అత్యంత ప్రధానమైన ఓవీ రోడ్డు ఇప్పటి వరకు వేయలేదు. అధికారంలోకి వస్తే రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాను. నియోజకవర్గానికి సాగునీటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. 
– కాకి వీరచంద్ర ఖర ప్రసాద్, బీఎస్పీ అభ్యర్థి

మరిన్ని వార్తలు