అవకాశమిస్తే... అభివృద్ధి చేస్తా..

8 Apr, 2019 13:11 IST|Sakshi

టీడీపీ ప్రభుత్వం వారి అనుయాయుల అభివృద్ధికే ప్రాధాన్యం

నియోజకవర్గంలో ప్రతి సమస్య పరిష్కారమే నా లక్ష్యం

‘సాక్షి’తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌ (శ్రీకాకుళం): వైఎస్సార్‌సీసీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ స్థానికుడు. మాజీ మంత్రి, మాజీ జెడ్పీ చైర్మన్‌  గొర్లె శ్రీరాములనాయుడు రాజకీయ వారసుడిగా అందరికీ సుపరిచితుడే. నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు నిత్యం ప్రజలతో మమేకమై, వారి కష్టాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తూ అండగా ఉంటున్న గొర్లె     కిరణ్‌కుమార్‌ నియోజకవర్గ ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న కిరణ్‌కుమార్‌ తన మనసులో మాటను సాక్షి’ ఇంటర్వ్యూలో వ్యక్త పరిచారు. 

ప్రశ్న: నియోజకవర్గం ప్రజలతో ఎలా మమేకమయ్యారు?
జవాబు: మాజీ మంత్రి, మాజీ జెడ్పీ చైర్మన్‌ దివంగత గొర్లె శ్రీరాములనాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను.రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నాను. నేను స్థానికుడిని, రణస్థలం మండలం పాతర్లపల్లి నా స్వగ్రామం. నా భార్య పరిమళ రణస్థలం ఎంపీపీగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌  వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2009 లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం తృటిలో తప్పింది. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాను. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ప్రారంభించినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీలో ఉన్నాను. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉన్నాను. 115 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను నా కుటుంబంగా భావించాను. ప్రజలతో నాకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి.

ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు?
జవాబు: మహానేత వైఎస్సార్‌ హయాంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గంలోని సమస్యలను పూర్తిగా విస్మరించింది. నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఉంది. తోటపల్లి, నారాయణపురం ఆనకట్టు ఆధునికీకరణ, ఎస్‌.ఎం.పురం పెద్దచెరువుకు మడ్డువలస మిగులు జలాలు తరలింపు జరగలేదు.  ట్రిపుల్‌ ఐటీ ఎచ్చెర్లలో ఏర్పాటు చేసినా నూజివీడులో తరగతులు కొనసాగుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఉంది. పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవు. ఈఎస్‌ఐ వంద పడకల ఆస్పత్రి కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. జెట్టీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. బుడుమూరు నారాయణసాగరం జలాశయం ఏర్పాటు సమస్యగా మిగిలిపోతుంది.

ప్రశ్న: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు?
జవాబు: స్థానికుడిగా ప్రతి సమస్యపై నాకు అవగాహన ఉంది. సాగునీటి సమస్య పరిష్కారిస్తా. ట్రిపుల్‌ ఐటీ, బీఆర్‌ఏయూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తాను. స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు, యువతకు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను. జెట్టీల నిర్మాణం, కోల్డ్‌ స్టోరేజ్‌లు, ఎచ్చెర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,బి.ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాను. వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రాధాన్యత నిస్తాను.

ప్రశ్న: టీడీపీ పాలనలో ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు?
జవాబు: టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలు అమల్లో అర్హులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ పథకాల ఎంపికలో నిష్షక్ష పాతంగా జరగాలి, కాని జన్మభూమి కమిటీల పెత్తనం సాగింది. వైఎస్సార్‌సీపీ అధికారంలో వచ్చిన వెంటనే రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హునికీ ప్రభుత్వ పథకాలు ఇంటికి చేరేలా అమలు చేస్తాం. 

ప్రశ్న: మీ విజయానికి వ్యూహాలు ఏమిటి?
జవాబు: ప్రత్యేక వ్యూహం అంటూ లేదు. టీడీపీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది.  నియోజక వర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండానే మంత్రి కుమారుడికి భూములు కేటాయించారు. మంత్రి కళా వెంకట్రావు పీఏలు, పథకాల పేరుతో టీడీపీ నాయకులు ప్రజా ధనం దోచుకున్నారు. ఎస్‌.ఎం.పురం తదితర ప్రాంతాల్లో జెడ్పీ ఛైర్‌పర్సన్‌ కుటుంబ సభ్యులు భూ పట్టాలు అక్రమంగా చేసుకున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం మంత్రి కళా వెంకట్రావు కనుసన్నల్లో సాగుతోంది.

ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు  ఉద్యోగాలను టీడీపీ నాయకులు అమ్ముకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాం. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో, నవరత్నాల పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నాం. మంత్రి కళా వెంకట్రావు నియోజకవర్గ సమస్యలను పట్టించుకోలేదు. ఈ విషయం ప్రజలకు తెలుసు. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రత్యేక హోదాపై మేం పోరాటాలు చేశాం. అన్ని అంశాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వైఎస్సార్‌సీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు