ప్రజా సంక్షేమమే ధ్యేయం

9 Apr, 2019 15:09 IST|Sakshi

ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా

అవినీతి రహిత పాలనను అందిస్తాను

సాక్షి, పాలకొండ రూరల్‌ (శ్రీకాకుళం): రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతి మరకలు అంటని నేత. నీతి, నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం. మాయ మాటలు చెప్పడం రాదు. నమ్మిన వాళ్లను అక్కున చేర్చుకుంటారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా నిరాడంబర జీవితం గడపడంలో ఆమెకు ఆమే సాటి. ఆమే వైఎస్సార్‌సీపీ పాలకొండ అసెంబ్లీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల అండదండలతో ఫ్యాన్‌ హోరు గాలిలో ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం అధికంగా ఉండే ఈ రోజుల్లో.. ప్రజల విశ్వాస నియత, ప్రేమానురాగాలతో విజయ సాధనకు కృషి చేస్తున్నారు. కళావతితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..  

సాక్షి: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు?
కళావతి: ఈ ప్రాంతంలో పుట్టిన ఆదివాసీ బిడ్డగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టాలు తెలసుకున్నాను. ఆసెంబ్లీలో ప్రాంత సమస్యలపై గళమెత్తాను. అధికారం లేకపోయినా నçన్ను ప్రజలు ఆదరించారు. అధికార పార్టీ నన్ను ఇబ్బంది పెట్టినా ప్రజలు నాకు అండగా నిలిచారు. 

సాక్షి: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలు ఏమిటి?
కళావతి: ఈ ప్రాంతలంలో అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాగు నీరు లేక ఏటా వారు పడుతున్న కష్టాలు నన్ను కలచి వేశాయి. అలాగే గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఏనుగుల సమస్యతో సతమతమవుతున్నారు. భామిని మండంలో వంశధార పనులు, జంపరకోట జలాశయం వంటి సాగునీటి ప్రాజెక్టుల సమ్యలు వేధిస్తున్నాయి.

 సాక్షి: సమస్యల పరిష్కారానికి ఏలా కృషి చేస్తారు?
కళావతి: ఇప్పటికే నియోజకవర్గ సమస్యలు మా పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాను. పాదయాత్ర ద్వారా జగన్‌ ఇక్కడి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు.  అధికారంలోకి వచ్చిన తరువాత పాలకొండ నియోజవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇక్కడి బహిరంగ సభలో కూడా చెప్పారు. ఆయన మాటపై నమ్మకం ఉంది. అవసరమైతే నేను ఈ ప్రాంత అభివృద్ధికి పోరాటాలకు వెనుకాడను.

సాక్షి: నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే భరోసా ఏంటి?
కళావతి: నియోజకవర్గంలో యువత, నిరుద్యోగులు ఉపాధి లేక వలసలు పోతున్నారు. దీనిపై దృష్టి పెడతాను. ఈ ప్రాంతంలో చిన్నతరహా పరిశ్రములు ఏర్పాటుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ పారిశ్రామికికరణతోపాటు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటాం. తద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి, ఆర్థిక పురోగతి చేకూరుతుంది.

సాక్షి: పట్టణ ప్రజల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు?
కళావతి: పాలకొండ పట్టణంలో ఇంటి పన్నులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమిస్తాం. అలాగే తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. నన్ను నమ్మిన ప్రజలకు ఊపిరి ఉన్నంతవరకు సేవలందిస్తాను.

సాక్షి: ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మీ వ్యూహాలు ఏమిటి?
కళావతి: నేను వ్యూహాలతో విజయం సాధించే వ్యక్తిని కాను. ఎందుకంటే నేను ప్రజల మనిషిని. నా విశ్వసనీయత, జగనన్నపై ప్రజలకున్న విశ్వాసమే నన్ను విజయతీరం దాటిస్తుంది. టీడీపీ మాదిరి అధికారం కోసం అడ్డదారులు తొక్కను. గడిచిన ఐదేళ్లలో ఎన్నో ప్రలోభాలకు అధికారు పార్టీ గురిచేసింది. తలొగ్గలేదు. చివరకు నా ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి అవమాన పర్చినా భరించాను. దీనిని ప్రజలు గమనించారు. ప్రజా ఆశీస్సులే తిరుగులేని విజయానికి బాటలు వేస్తాయన్న నమ్మకముంది.

సాక్షి: టీడీపీ పాలనలో పలు ఇబ్బందులకు గురైన బాధితులకు మీరు ఎలా న్యాయం చేస్తారు?
కళావతి: టీడీపీ పాలనలో ప్రజలే కాదు నేను ఇబ్బందులు పడ్డాను. ఓ మహిళగా ప్రజల కష్టాలను ఐదేళ్లగా దగ్గరగా చూశాను. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా, అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తాను. ఎటువంటి వివక్ష లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరీ సమస్య పరిష్కరానికి ఎంత దూరమైనా వెళ్తాను. 

మరిన్ని వార్తలు