అభివృద్ధే నా అజెండా..!

8 Apr, 2019 10:10 IST|Sakshi

ఫ్లోరైడ్‌ సమస్య తీరుస్తాం.. రక్షిత నీటి కోసం ఆర్వో ప్లాంట్లు

ఒంగోలుకు విమానాశ్రయం సాధిస్తా..

‘సాక్షి’తో వైఎస్సార్‌ సీపీ ఒంగోలు  పార్లమెంట్‌ అభ్యర్థి   

సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లా ప్రజలకు వరప్రసాదిని వెలిగొండ ప్రాజెక్టు. అన్ని సమస్యలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలో వెలిగొండ ద్వారా నీళ్లివ్వడానికి చర్యలు తీసుకుంటానని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. తన మనోభావాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. జిల్లాలో వాణిజ్య పంటల రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫ్లోరైడ్‌ సమస్య గ్రామాలను పీడిస్తోందని తెలిపారు. రైల్వే పరంగా అనేక సమస్యలున్నాయని అన్నారు. నాగార్జున సాగర్‌ కాలువల ఆధునికీకరణ పనులతోపాటు సంగమేశ్వర ప్రాజెక్టు పనులను పూర్తి చేసుకోవాల్సి ఉందని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు తాను అధిక  ప్రాధాన్యం ఇవ్వనున్నానని తెలిపారు.

ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారం
జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రక్షిత నీటిని ఇవ్వడానికి ఆర్వో  ప్లాంటులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను. వీటితోపాటు కిడ్ని బాధితుల సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఒంగోలులో డయాలసిస్‌ కేంద్రం ఉన్నా రోగులకు సరైన సేవలను అందించలేకున్నాయి. కిడ్నీ బాధితులకు అవసరమైన మేరకు డయాలసిస్‌ కేంద్రాలతో పాటు ఫ్లోరైడ్‌ తీవ్రంగా ఉన్న చోట ఆర్వో ప్లాంటులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా.

వాణిజ్య పంటల రైతులకు గిట్టుబాటు ధరలకు కృషి
జిల్లాలో ప్రధానంగా పొగాకు, శనగ, ఇతర వాణిజ్య పంటల రైతులతో పాటు సుబాబుల్, జామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధరల సమస్య తీవ్రంగా ఉంది. కేంద్ర వాణిజ్య ప్రతినిధుల దృష్టికి వీరి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా.

పర్యాటకాభివృద్ధికి చర్యలు
జిల్లాలో పర్యాటక అభివృద్ధి వల్ల సందర్శకులకు సౌకర్యాలు ఏర్పడతాయి. మొత్తం 24 ప్రదేశాలలో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు, కొత్తపట్నం పర్యాటక అభివృద్దితో పాటు భైరవకోన అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. టెంపుల్‌ కారిడార్‌ పేరిట దేవాలయాల సందర్శనకు అనుసంధాన కార్యక్రమాలను రూపొందించాలి. ఒంగోలు తీరం వెంట అభివృద్ధికి వివిధ చర్యలు తీసుకోవాలి. అక్కడ పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటా.

ఆక్వా రైతుల సమస్యలకు పరిష్కారం
జిల్లాలో ఆక్వా ఎగుమతికి రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది. అయితే ఆ రంగంలోని రైతులకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తుల్లో 40 శాతం జిల్లా నుంచే వస్తుంది. రైతులకు సబ్సిడీలపై కరెంటు ఇతర సౌకర్యాలను కల్పించి ఆక్వా సాగు ప్రొత్సాహానికి తగిన చర్యలు తీసుకుంటాను. సాంకేతికంగా అన్ని విధాలుగా ఆక్వా రైతులకు సహకారాన్ని అందిస్తా.

పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు తీయిస్తా..
దొనకొండ పారిశ్రామికవాడతోపాటు పామూరు వద్ద నిమ్జ్‌ అభివృద్ధి వల్ల ఉపాధి మార్గాలు మెరుగవుతాయి. దశలవారీగా పారిశ్రామిక కారిడార్‌ల అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటా. ఒంగోలు కేంద్రం పరిధిలో రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ వర్తక వాణిజ్యపరమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వాన్‌పిక్‌ భూముల్లో ప్రతిపాదించిన విమానాశ్రయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటా. రామాయపట్నంలో అదనంగా బెర్తుల కోసం కృషి చేస్తా. బకింగ్‌హాం కాలువ ఆధునికీకరణ మూలనపడింది, దీని ద్వారా ప్రత్యామ్నాయ రవాణా ఉపయోగకరంగా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. వాటిని పరిశీలించి, కేంద్రం ద్వారా మెరుగైన రవాణాకు బకింగ్‌హాం కాలువ ప్రతిపాదన ముందుకు తీసుకొస్తా.

సేవా కార్యక్రమాల కొనసాగింపు
ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలకు సొంత నిధులతో అందిస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగిస్తా. తాగునీరు, హెల్త్, విద్య వంటి కార్యక్రమాలను మాగుంట కుటుంబం అనేక  సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. ఇంకా ప్రజల అవసరాలను గుర్తించి ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తాం.

రైల్వే సమస్యలు పరిష్కరిస్తా..
జిల్లాలో రైల్వే పరంగా ఎదుర్కొనే అనేక సమస్యలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు డివిజన్ల పరిధిలో ఇంకా కొన్ని ప్రాజెక్టులు  ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి పనులు వేగవంతం చేయించాలి. గిద్దలూరు ప్రాంతంలోని రైల్వే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. వివిధ రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వివిధ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం నిలపాల్సిన పరిస్థితి ఉంది. వీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరిస్తా.

డీకే యాజమాన్య హక్కు మార్పిడికి చర్యలు
ప్రధానంగా ఒంగోలులోని ప్రజలు ఈ డీకే యాజమాన్య హక్కు మార్పిడి జరగక ఇబ్బంది పడ్తున్నారు. ఇంటి పన్నులు వారి పేరుపై రావడం లేదు. ఏ సౌకర్యం తీసుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలుతో పాటు నియోజకవర్గంలోని వివిధ పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. డీకే పట్టాలు ఉన్న వారికి వారి పేరుపైనే యాజమాన్య హక్కు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాను. అలాగే చుక్కల భూములు, ఇనాం భూముల సమస్య తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలో రెవెన్యూ పరంగా ఈ సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను.

ఎన్‌ఎస్‌పీ కాలువల ఆధునికీకరణతో గ్యాప్‌ ఆయకట్టుకు నీరు
ఎన్‌ఎస్‌పీ కాలువల ఆధునికీకరణ పనుల ద్వారానే జిల్లాలోని కాలువల ద్వారా సాగవుతున్న ఆయకట్టులోని లక్ష ఎకరాల గ్యాప్‌ ఆయకట్టు సమస్య తీరుతుంది. ఇందు కోసం కావాల్సిన నిధులను తీసుకురావడానికి కృషి చేస్తాను. దీర్ఘకాలం నుంచి సాగర్‌ కుడికాలువ పొడిగింపు సమస్య అలాగే ఉంది. కాలువ పొడిగింపు వల్ల మరికొన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటికి ఇబ్బంది తొలగుతుంది. కొండపి నియోజకవర్గంలో సంగమేశ్వర ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచాయి. ఈ ప్రాజెక్టు  పరిధిలో ఉన్న సమస్యలను తొలగించి సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాను.

ఏడాదిలోగా వెలిగొండ పూర్తికి కృషి
వెలిగొండ ప్రాజెక్టుతో సమస్యల పరిష్కారం ముడిపడి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెలిగొండ విషయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. సొరంగం పనులు నెమ్మెదిగా జరుగుతున్నాయి. తాగునీరు, సాగునీటికి వెలిగొండ పూర్తి చేయడం ద్వారానే ఇబ్బందులు తొలగుతాయి. టన్నెల్‌ పనులు ఇప్పుడు నెమ్మదిగా జరుగుతున్నాయి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోగా పనులు పూర్తి చేసి నీళ్లివ్వడానికి చర్యలు తీసుకుంటా.

మరిన్ని వార్తలు