షేర్లలో పెట్టుబడికి అవగాహన తప్పనిసరి

7 Aug, 2016 02:48 IST|Sakshi
షేర్లలో పెట్టుబడికి అవగాహన తప్పనిసరి

‘సాక్షి’ మైత్రి మదుపరుల అవగాహన కార్యక్రమంలో సీడీఎస్‌ఎల్ రీజనల్ మేనేజర్ వెనిశెట్టి
సాక్షి, రాజమహేంద్రవరం: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేముందు మదుపరులు మార్కెట్‌లోని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సీడీఎస్‌ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి పేర్కొన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘సాక్షి మైత్రి’ మదుపరుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఔత్సాహిక మదుపుదారులకు పలు సూచనలు ఇచ్చారు. ఏదైనా కంపెనీ షేర్లు కొనుగోలు చేసే ముందు దాని వ్యాపార లావాదేవీలు మూడేళ్లుగా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.డీమ్యాట్ అకౌంట్ తీసుకునేప్పుడు నామినీ పేరు చేర్చడం వల్ల.. అనుకోకుండా మదుపుదారుడు చనిపోయినా ఎలాంటి ప్రక్రియ లేకుండా నేరుగా ఆ షేర్లు నామినీకి బదిలీ అవుతాయన్నారు.

మైనర్లు కూడా డీమ్యాట్ అకౌంట్ తీసుకోవచ్చని, లావాదేవీలు నిర్వహించేందుకు మాత్రం అనుమతి ఉండదని తెలిపారు. బ్యాంకులు, స్టాక్ బ్రోకర్ల ద్వారా సీడీఎస్‌ఎల్ మదుపుదారులకు సేవలందిస్తుందని చెప్పారు. బ్రోకర్ల ద్వారానే షేర్లు కొనుగోలు చేయాలని చెప్పిన ఆయన.. వారు ఇచ్చే కాంట్రాక్ట్ నోట్ భద్రపరుచుకోవాలని సూచించారు. చిన్న, కొత్త ముదుపుదారులకు రాజీవ్‌గాంధీ పథకం ద్వారా లభించే లాభాలు, రాయితీలను వివరించారు. అనంతరం మదుపుదార్ల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కొటక్ మ్యూచువల్ ఫండ్ తెలుగు రాష్ట్రాల హెడ్ విజయకుమార్ తిమ్ములూరు, హెచ్‌డీఎస్‌సీ ఏరియా సేల్స్ మేనేజర్ జి.విజయ్‌కుమార్, ‘సాక్షి’ రాజమహేంద్రవరం యూనిట్ మేనేజర్ శివుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు