సత్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించాం

25 Mar, 2018 00:52 IST|Sakshi

‘సాక్షి’ దశాబ్ది ఉత్సవాల్లో సంస్థ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతీరెడ్డి

సాక్షి, హైదరాబాద్ ‌: ఉన్నత ప్రమాణాలు, అత్యున్నత ఆశయాలతో ప్రారంభమైన ‘సాక్షి’ దినపత్రిక సత్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించిందని.. అనేక ఆటుపోట్లు ఎదురైనా విలువలకు కట్టుబడి నిలిచిందని ‘సాక్షి’ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతీరెడ్డి పేర్కొన్నారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి నిలిచిందని చెప్పారు. ‘సాక్షి’ దినపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని ఎడిషన్‌ సెంటర్లలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారతీరెడ్డి ‘సాక్షి’ పది వసంతాల లోగోను ఆవిష్కరించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలిపి, ప్రసంగించారు.

‘‘23 ఎడిషన్లతో ‘సాక్షి’ ప్రారంభమే చరిత్ర సృష్టించింది. 30 ఏళ్ల నుంచి వేళ్లూనుకున్న పత్రికను తొలిరోజునే దీటుగా ఎదుర్కొంది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కొంది. సీబీఐ కేసులు పెట్టారు. ఈడీ కేసులు పెట్టారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్న ‘సాక్షి’ పై అనేక రకాల వివక్ష కొనసాగింది. మనం దేనికీ భయపడలేదు. ఎక్కడా వెనుకడుగు వేయలేదు. 2014 తరువాత కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పత్రికకు ప్రకటనలు ఇవ్వకుండా చేశారు. పేపర్‌ వేయించుకోవద్దంటూ ప్రచారం చేశారు. ఆఖరికి ‘సాక్షి’ విలేకరులను పత్రికా సమావేశాలకు రాకుండా అడ్డుకొనేందుకు యత్నించారు. దాడులకు కూడా పాల్పడ్డారు. అయినా సంస్థ దేనికీ భయపడకుండా ముందుకు నడిచింది..’’అని భారతీరెడ్డి చెప్పారు.

నిర్భయంగా ముందుకు.. 
నిజాల్ని నిర్భయంగా రాయడంలో వెనుకంజ వేయకుండా ‘సాక్షి’ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని భారతీరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోజుల్లోనూ ‘సాక్షి’ గట్టిగా నిలబడిందని.. ఉద్యోగులు, పాఠకుల సహకారం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. సాక్షి పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన సందేశంలోని మూడు అంశాలను ఆమె వివరించారు.

‘‘మనం ఉన్నత ఆశయాలతో పత్రికను ప్రారంభించాం. నంబర్‌ వన్‌గా నిలవాలన్నది మన తొలి ఆశయం. ఈ ప్రయాణం కొంత దూరం ఉండవచ్చుగానీ కచ్చితంగా లక్ష్యాన్ని చేరుతాం. ఇక నిజాన్ని నిజంగానే చెప్పాలని, సత్యాన్ని చెప్పడంలో ఎలాంటి వక్రీకరణలు లేకుండా చెప్పడంలో ‘సాక్షి’ ఎప్పుడూ ముందుండాలన్నది రెండో ఆశయం. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల బాణిని మాత్రమే వినిపించాలన్నది మూడో ఆశయం. ఈ లక్ష్యాలతోనే ‘సాక్షి’ ముందుకు సాగుతుంది..’’అని పేర్కొన్నారు. మొత్తం సమాజం ‘సాక్షి’ని నమ్మకానికి చిహ్నంగా భావిస్తోందని, రాబోయే వంద తరాలు కూడా ‘సాక్షి’ ఇలాగే నిర్భయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.

ఈ జైత్రయాత్ర కొనసాగాలి: కె.రామచంద్రమూర్తి 
‘సాక్షి’కి బీజం వేసినవారు గొప్ప దార్శనికులని ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి పేర్కొన్నారు. ప్రజలకు సత్యాలు చెబితే, వాస్తవాలు తెలియజేస్తే.. వారు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ‘సాక్షి’జైత్రయాత్ర వందల ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. 

విలువలకు కట్టుబడ్డ ‘సాక్షి’: సజ్జల రామకృష్ణారెడ్డి
అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా.. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, విలువలకు కట్టుబడి ‘సాక్షి’ముందుకు సాగుతోందని వ్యవస్థాపక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ విలువలే శ్రీరామరక్షగా నిలుస్తాయని, వచ్చే రెండు మూడేళ్లలో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న తెలుగు పత్రికగా ‘సాక్షి’అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, మార్కెటింగ్‌–అడ్వర్టైజింగ్‌ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ పీవీకే ప్రసాద్, కార్పొరేట్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ రాణిరెడ్డి, ఎడిటర్‌ వర్ధెల్లి మురళి, సీనియర్‌ పాత్రికేయులు దేవులపల్లి అమర్, కొమ్మినేని శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. 

కన్నుల పండువగా సంబురాలు 
‘సాక్షి’ప్రధాన కార్యాలయంలో, ఎడిషన్‌ కేంద్రాల్లో దశాబ్ది ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు క్విజ్‌ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సాక్షి పదేళ్ల ప్రస్థానాన్ని చూపేలా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు