షిప్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకున్నారు!

3 Jun, 2014 04:24 IST|Sakshi
షిప్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకున్నారు!

 నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేసి షిప్ట్ ఆపరేటర్ పోస్టులను ఎస్‌ఈ నాగశయనరావు అమ్ముకున్నారని జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి హజరత్తయ్య ఆరోపించారు. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలను ప్రశ్నించేందుకు సోమవారం నెల్లూరులోని విద్యుత్ భవన్‌కు వచ్చిన కాంట్రాక్టర్లను ఎస్‌ఈ లోనికి అనుమతించలేదు. దీంతో వారు కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ అంశం తమ పరిధిలోది కాదని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని కార్యాలయ పీఓ చిన్నయ్య వా రికి సర్దిచెప్పారు. హజరత్తయ్య మాట్లాడుతూ జిల్లాలో 130 షిప్ట్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయన్నారు. వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇ వ్వాల్సి ఉండగా, ఏఈలు, ఏడీఈల సహకారంతో ఎస్‌ఈ నాగశయనరావు అమ్ముకున్నారని ఆరోపించారు.

ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. మంత్రి పేరు చెప్పి భారీ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించామని, కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో చట్టా న్ని అతిక్రమించి ఎస్‌ఈ నియామకాలు చేపట్టారని చెప్పారు. ఈ విషయాన్ని తాము లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

మానవ హక్కుల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ఆ సంఘం ప్రతి నిధులు వస్తే వారిని లోపలికి కూడా అనుమతించకపోవడం దారుణమని, ఎస్‌ఈ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు. కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం పబ్లిక్ అడ్వైజర్ దత్తాత్రేయ, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ప్రతినిధి చిట్టిబాబు, కాంట్రాక్ట్ అసోసియేషన్ నేతలు రమణారెడ్డి, శ్రీనివాసులు, గౌస్‌బాషా, రాఘవేంద్ర పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు