రాజ్‌మా చిక్కుడు

18 Jan, 2014 05:05 IST|Sakshi

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వ్యాపారులు కొనుగోలు చేయరు.. జీసీసీ పట్టించుకోదు.. దాంతో ఏజెన్సీలో రాజ్‌మా రైతు బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏదో ఒక ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తేనే బాగుండేదని అనుకునేటంత విషమ స్థితికి వారి సమస్య చేరుకుంది. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాజ్‌మా చిక్కు డు వ్యాపారం స్తంభించిపోయింది. దీంతో గిరిజన రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.

 విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో గిరిజనులు రాజ్‌మా చిక్కుడును ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. ఏటా సుమారు రూ. 60 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో పండించిన రాజ్‌మాను నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి వీటిని ఢిల్లీ, పుణె, ముంబాయి, కర్ణాటక, మహారాష్ట్ర  వంటి నగరాలకు ఎగుమతి చేస్తుంటారు.

 ఈ ఏడాది రాజ్‌మా పంట అంతంత మాత్రంగానే ఉంది. గిట్టుబాటు ధర మాత్రం బాగానే ఉంది. ప్రస్తుతం కిలో రాజ్‌మాను వ్యాపారులు రూ.48 ధరకు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వారు కొనుగోళ్లను నిలిపేశారు. నర్సీపట్నం వ్యాపారులే కాక, స్థానిక వర్తకులు కూడా లావాదేవీలు ఆపేశారు.

 అసలు కారణం..
 రాజ్‌మా కొనుగోలు చేసే వ్యాపారులు గిరిజనులకు భారీ ఎత్తున బకాయి పడ్డారు. గత ఏడాది చాలా మందికి పూర్తి స్థాయిలో చెల్లించలేదు. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు రంగంలోకి దిగారు. జీకే వీధికి చెందిన ఓ వ్యాపారిని మావోయిస్టులు గత సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ మొత్తాన్ని చెల్లిస్తానని వ్యాపారి భార్య హామీ ఇవ్వడంతో ఆమెను నిర్బంధించారు. దీంతో నర్సీపట్నం వ్యాపారులు ఈ ప్రాంతంతో కాలు మోపడానికే వెనుకాడుతుండగా స్థానిక వ్యాపారులు సైతం మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు సాహసించడం లేదు.

 జీసీసీ నిర్లక్ష్యం
 గత ఏడాది కూడా రాజ్‌మాను కొనుగోలు చేసిన జీసీసీ, ఈసారి మాత్రం అసలు ఆ జోలికే పోలేదు. సరకు నిల్వ ఉండిపోతోందన్న కారణం చూపి కొనుగోలు చేపట్టలేదు. దాంతో పెదపాడు, మర్రిపాకలు, అగ్రహారం, లక్కవరం, ఈతరబ్బలు, సాగులు వంటి ప్రాంతాల్లో రాజ్‌మా నిల్వలు పేరుకుపోయాయి.

రైతులు కావళ్లతో వారపు సంతలకు మోసుకువచ్చి విక్రయించలేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.
 ప్రస్తుతం చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని అన్ని మారుమూల ప్రాంతాల్లో రాజ్‌మా చిక్కుడు వ్యాపా రం నిలిచిపోయింది. మావోయిస్టుల ఉత్సాహం గిరిజనులకు సమస్యలు తెచ్చిపెట్టింది.

మరిన్ని వార్తలు