ఉప్పు రైతుకు అప్పు తిప్పలు

25 Nov, 2015 02:24 IST|Sakshi

పట్టించుకోని ప్రభుత్వం
 ఆవేదనలో రైతులు  
 పూసపాటిరేగ :
జిల్లాలోని తీరప్రాంతంలో  ఉప్పురైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు.ఉప్పుసాగుకు వేలల్లో ఖర్చు చేస్తున్నప్పటికీ, పంట చేతికందుతున్న సమయంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటకలిసిరాకపోవడంతో ఉప్పు రైతులు అప్పుల పాలవుతున్నారు. పూసపాటిరేగ మండలం కోనాడలో బ్రిటిష్ కాలంలో 1947 ముందు నుంచి ఉప్పుసాగవుతోంది. లక్షల రూపాయల మదుపులు పెట్టి సాగు చేసినదంగా హుద్‌హుద్ తుఫాన్ సమయంలో  వృథా అయింది.తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పైసా కూడా పరిహారం అందించలేదు., ఉప్పుసాగుకు కావాల్సిన పరిస్థితులు అన్నీ కలిసి వచ్చిన తరువాత ప్రకృతి సహకరించక పోవడంతో  ఖర్చు అంతా వృథా అవుతూ రైతులు నష్టపోతున్నారు.  కొంత కాలంగా ఇదే పరిస్థితి  ఉన్నా ప్రభుత్వం  ఆ రైతులను కనీసం పట్టించుకోవడం లేదు.

 ఆదుకోని ప్రభుత్వం
 ఉప్పురైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఉప్పురైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక శాఖ ఆధ్వర్యంలో రైతులకు కావాల్సిన రుణసౌకర్యాలతో పాటు, ఉప్పురైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉప్పుసాగును   నిర్వీర్యం చేసేవిధంగా అధికారులు కనీసం పట్టించుకోవడంలేదు. దీంతో ఉప్పురైతులకు ప్రోత్సాహం కరువవడంతో పాటు పండించిన అరకొర పంటకు మార్కెట్‌లో గిరాకీ లేకపోవడంతో ఉప్పుసాగుపై రైతులు నిరాశ చెందుతున్నారు.
 ఉత్తరాంధ్రలో మూడుచోట్ల మాత్రమే ఉప్పు సాగవుతోంది. విజయనగరం జిల్లాలో కోనాడ,విశాఖ జిల్లాలో భీమిలి, శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం ప్రాంతాలలో మాత్రమే ఉప్పుసాగవుతోంది.

 తగ్గిన గిరాకి
 కొత్త కొత్త బ్రాండ్లతో రెడీమేడ్ ఉప్పు మార్కెట్లలోకి రావడంతో రైతులు తయారుచేసిన కల్లు ఉప్పుకు గిరాకీ తగ్గుతోంది. ఇక్కడ తయారు చేసిన ఉప్పు నిల్వ  ఉంచిన చేపలు,రసాయన పరిశ్రమలలోకి మాత్రమే వాడుతున్నారు,ప్రజావసరాలుకు ఇక్కడ ఉప్పును వినియోగించకపోవడంతో ధరలు లేక రైతులు దివాలా తీస్తున్నారు. కేజీ  ఉప్పు 1 రూపాయి చొప్పున కూడా కొనుగోలు చేసే వారు లేరని కోనాడకు చెందిన ఉప్పు రైతులు చాట్ల తోటరెడ్డి ,ఉల్లి అజయ్‌కుమార్ గోపాల్ ,కొల్లా వెంకటప్రసాదులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉప్పురైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు