నీరుగారిన ఉప్పు రైతు

29 May, 2014 03:44 IST|Sakshi
నీరుగారిన ఉప్పు రైతు

సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: ప్రకృతి వైపరీత్యాలతో ఉప్పు రైతులు  తీవ్ర నష్టాల పాలవుతున్నారు. నాలుగేళ్ల నుంచి అతలాకుతలమవుతున్నా  ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఉప్పురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. మండలంలోని నౌపడ, భావన పాడు, మర్రిపాడు, యామలపేట, మూలపేట, లింగూడు పంచాయతీల్లో సుమారు 4800 ఎకరాల్లో ఉప్పును సాగు చేస్తున్నారు.

 ఉప్పు పంట సీజన్ కావడంతో డిసెంబర్ నుంచి మే వరకు ఉప్పు సాగు చేస్తారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు ఉప్పు కరిగిపోవడంతో ఆరు నెలల తమ శ్రమ నీటిపాలైందని వాపోతున్నారు. గతంలో పైలీన్ తుపానుతో నష్టం వాటిల్లినపుడు ఎకరాకు రూ.9 వేల పరిహారం కోరితే రూ.4 వేలు చెల్లించాలని అధికారులు ప్రతిపాదించారని, ఆ డబ్బులు ఇంతవరకు రాలేదని చెప్పారు. లైలా, నీలం, జల్ తుపాన్లకు సంబంధించి ఇంతవరకూ పరిహారం అందలేదన్నారు. తమకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు