సాహో..సాలూరు

21 Mar, 2019 09:37 IST|Sakshi
 సాలూరు నియోజకవర్గం ముఖచిత్రం 

నాలుగోసారి తలపడుతున్న రాజన్నదొర, భంజ్‌దేవ్‌

ఇద్దరూ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేలుగా రికార్డు నెలకొల్పినవారే

అవినీతి, నిజాయితీ మధ్య ఈసారి ప్రధాన పోటీ

ఒడిశాకు ఆనుకున్ని ఉన్న సాలూరు నియోజకవర్గానికి ఎంతో విశిష్టత ఉంది. రాష్ట్రంలో అతి పెద్ద లారీ పరిశ్రమ విజయవాడలో ఉండగా సాలూరు రెండో స్థానంలో ఉంది. సాలూరులో ఎక్కువ మంది గిరిజనులే ఉన్నా రాజకీయంగా చైతన్యవంతులనే చెప్పాలి. నమ్మితే అందలం ఎక్కించడం.. అపనమ్మకం కుదిరితే దించేయడం ఇక్కడ సర్వసాధారణం. పీడిక రాజన్నదొర, భంజ్‌దేవ్‌లు చెరో మూడుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా వీరిద్దరే బరిలో ఉండగా.. సాలూరు వాసులు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు నియోజకవర్గంలో రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. గిరిజనులకు కేటాయించిన ఈ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్‌సీపీ, టీడీపీ నుంచి సీనియర్‌ నాయకులే ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరూ ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే కావడం ఒక చిత్రమైతే.. అవినీతి, నిజాయితీలకు  చెరొకరూ బ్రాండ్‌ అంబాసిడర్లు కావడం మరో విశేషం. అభ్యర్థుల బలాబలాలతో పాటు, ఆయా పార్టీలకు ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా వారి గెలుపోటములను ప్రభావితం చేయనుంది.

 అవినీతి..వివాదాలు:

అసలు సిసలు గిరిజనుడైన రాజన్నదొర సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసినా ఎలాంటి అవినీతి మరక అంటించుకోలేదు. నీజాయితీపరుడిగా.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. భంజ్‌దేవ్‌ అసలైన గిరిజనుడు కాదన్న వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవలే ప్రభుత్వం తమది కావడంతో తాను ఎస్టీ అంటూ జీఓ తెచ్చుకున్నారు భంజ్‌దేవ్‌. అయితే దానిని సవాల్‌ చేస్తూ రాజన్నదొర హైకోర్టుకు వెళ్లడంతో భంజ్‌దేవ్‌ కులవివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తాను కొండరాజు కులానికి చెందినవాడినంటూ భంజ్‌దేవ్‌ వాదిస్తుండగా, అసలు భారత రాజ్యాంగంలో కొండరాజు పేరుతో ఎస్టీ జాబితాలో కులం లేదని రాజన్నదొర చెబుతున్నారు.

చేపలచెరువులు, ప్రభుత్వ, గ్రామదేవత భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు భంజ్‌దేవ్‌పై ఉన్నాయి. వాటిపై  నెలకొన్న వివాదాలు కూడా ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సాలూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. రాజన్నదొర కోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా పదవిని చేపట్టిన నాటి నుంచి టీడీపీ కోటకు బీటలువారాయి. తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో గడ్డుపరిస్థితి వచ్చేలా చేసింది రాజన్న దొర పనితీరు. ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడంలో రాజన్నదొర విజయం సాధిస్తున్నారు. ఈసారి రాజన్నదొర జగన్‌కు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూనే.. భంజ్‌దేవ్‌ అవినీతి, కులవివాదాన్ని తనకు అనుకూల అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. భంజ్‌దేవ్‌ మాత్రం తనకు ఇవే చివరి ఎన్నికలంటూ ఎలాగైనా గెలవాలని నానా పాట్లు పడుతున్నారు.

 హ్యాట్రిక్‌ వీరులు..

భంజ్‌దేవ్‌ 1994లో తొలిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమచంద్ర సన్యాసిరాజుపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మళ్లీ 1999లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిపై పోటీచేసి గెలుపొందారు. ఆపై 2004 ఎన్నికల్లో పీడిక రాజన్నదొర (కాంగ్రెస్‌)పై గెలిచి హ్యట్రిక్‌ సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో భంజ్‌దేవ్‌ గిరిజనుడు కాదంటూ ఎన్నికల పిటీషన్‌ను హైకోర్టులో రాజన్నదొర వేయడం, గెలవడంతో 2006లో రాజన్నదొర గెలిచినట్టుగా కోర్టు ప్రకటించింది. దీంతో తొలిసారి రాజన్నదొర ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మళ్లీ 2009లో జరిగిన ఎన్నికల్లో రాజన్నదొర (కాంగ్రెస్‌) టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సంధ్యారాణిపై గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ భంజ్‌దేవ్‌ టీడీపీ అభ్యర్థిగా రాజన్నదొరతో తలపడ్డారు. భంజ్‌దేవ్‌ ఓటమిపాలవడంతో రాజన్నదొర కూడా హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. నాలుగోసారి వీరిద్దరూ పోటీ పడుతున్నారు.

 ఇద్దరి మధ్యే పోటీ..

సాలూరు అసెంబ్లీ నియోజకవకర్గంలో ఇద్దరు హ్యాట్రిక్‌ వీరులు తలపడుతుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పోటీ చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆర్‌పీ భంజ్‌దేవ్‌ తలపడుతున్నారు. వీరిద్దరూ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేలుగా పదవులను చేపట్టినవారే. ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి తలపడుతున్నా, వీరిద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం(ఎస్టీ) 

మొత్తం ఓటర్లు 1,82,778
మహిళా ఓటర్లు 98,319
పురుష ఓటర్లు 89,456
ఇతరులు 3
మొత్తం జనాభా 2,50,983


 

మరిన్ని వార్తలు