బొబ్బిలి వాడి.. పందెం కోడి

15 Jan, 2020 09:32 IST|Sakshi
కాకి డేగ పుంజు

నెలిపర్తి పందెం కోళ్లకు గిరాకీ 

తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌ 

ప్రత్యేక పద్ధతుల్లో పెంపకం

ఆ కోళ్లు బొబ్బిలి పౌరుషానికి ప్రతిరూపం. బరిలో దిగితే గెలుపు ఖాయం. అందుకే వాటికి మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉంది. పందెం రాయుళ్ల నుంచి విపరీతమైన డిమాండ్‌ పెరుగుతోంది. సాలూరు మండలం నెలిపర్తి ఎన్‌ఆర్‌ఆర్‌ అగ్రికల్చర్, హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో పెంచుతున్న పందెం కోళ్లు పౌరుషానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.          – సాలూరు రూరల్‌ 

నెలిపర్తి ఎన్‌ఆర్‌ఆర్‌ అగ్రికల్చర్, హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో పెంచుతున్న పందెం కోళ్ల పెంపకంలో యాజమాన్యం తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇచ్చే శిక్షణ ప్రత్యేకం. ప్రొటీన్లు సమకూరే ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసి కోళ్లకు అందిస్తారు. కాలానికి అనుగుణంగా సమశీతోష్ణస్థితిని ఏర్పాటు చేస్తారు. పందాలకు అవసరమైన ప్రత్యేక శిక్షణను ఇస్తూ బోలెడన్ని మెలకువలు కూడా నేర్పిస్తారు. ప్రత్యేక గూళ్లలో పరుగు నేర్పిస్తారు. నాటు పడవుల్లో ఈత నేర్పుతారు. దీంతో అవి మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. 


కోళ్లుకు ఈత నేర్పే నాడు పడవ

ఎన్నో రంగులు.. జాతులు  
సాలూరు, బొబ్బిలి, మక్కువ, మెంటాడ పరిసర ప్రాంతాలతో పాటు ఒడిశా సరిహద్దు గ్రామాల్లోని రకరకాల రంగులు, జాతుల కోళ్లను కొనుగోలు చేసి వాటికి ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. ఎన్నోరకాల రంగులు, జాతుల కోళ్లకు ఇక్కడ శిక్షణ ఇచ్చి పందేనికి సిద్ధం చేస్తున్నారు. డేగ, కాకి పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ. రసంగి, అబ్రాసు, నెమలి బరుల జాతుల కోళ్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.


కోళ్లకు రన్నింగ్‌ నేర్పే గూడు

ఇతర జిల్లాల నుంచి డిమాండ్‌  
కోళ్లను మార్కెట్‌లో అమ్మేటప్పుడు బొబ్బిలి పులితో పోల్చుతారు. జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఎక్కువగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందెం పోటీల కోసం అధిక సంఖ్యలో వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. ఒక్కొక్క కోడిని రూ.10 నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తుంటారు. 


శిక్షణ పొందిన కోళ్లు

మార్కెట్లో మంచి గిరాకీ
ఈ ప్రాంతంలో దొరికే కోళ్లనే కొని వాటికి బలమైన ఆహారం పెట్టి పందేనికి అనుగుణంగా తయారు చేస్తున్నాం. బొబ్బిలి పందెం కోళ్లుగా మార్కెట్లో విక్రయించడం వల్ల మంచి గిరాకీ ఉంది. పొరుగు జిల్లాల నుంచి అధికంగా వచ్చి కొనుగోలు చేసుకుంటారు. ప్రస్తుతం 5 వందల వరకు కోళ్ల పుంజులున్నాయి.  
– ఎన్‌.రామారావు, కోళ్ల పెంపకందారు, నెలిపర్తి  

 

మరిన్ని వార్తలు