సమాధులనూ వదలడం లేదయ్యా!

30 Mar, 2015 03:24 IST|Sakshi

యడ్లపాడు : కొండలు, గుట్టలు, మట్టికట్టలు, ప్రభుత్వ భూముల్లోని గ్రావెల్ అమ్మకాల ఆదాయం అక్రమార్కులకు సరిపోలేదు. అక్రమార్జనే ధ్యేయంగా మరుభూములలో సైతం మట్టి తవ్వకానికి శ్రీకారం చుట్టారు. నేరుగా తవ్వకాలు చేస్తే గ్రామస్తుల తెలిసి పోతుందని, శ్మశానం వెనుకవైపు నుంచి తవ్వకాలు మొదలు పెట్టారు. తవ్విన గ్రావెల్‌ను తరలించేందుకు ఏకంగా సమాధుల మధ్య నుంచి మార్గం చేసుకున్నారు. ఆలస్యంగా దీనిని గమనించిన గ్రామస్తులు అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
 
200 కుటుంబాలకు అదే శ్మశానం...
కొండవీడు కొండల అంచుల రాజప్రసాదాలు ఉన్న ప్రాంతంలోనే పూర్వం పుట్టకోట గ్రామం ఉంది. ఆయా కుటుంబాలకు చెందిన హిందూ శ్మశాన వాటిక అప్పటి రెడ్డిరాజులు శతృమూక రాజ్యంపై దండెత్తకుండా నిర్మించిన ఎర్రమట్టిపై అప్పట్లో శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎత్తయిన కొండలు కావడంతో మేఘాలు అడ్డుకోవడంతో తరుచు వర్షాలు కురవడం, నివాసాలకు చుట్టూ కొండలు ఆవరించుకొని ఉండటంతో వర్షపునీరంతా కొండవాగులా మారి గ్రామంపై విరుచుకు పడేది.

వీటిని తట్టుకోలేక కొండలకు నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తగా నివాసాలు ఏర్పరచుకున్నారు. కొత్తగా వేసుకున్నందున దీనికి కొత్తపాలెంగా పేరొచ్చింది. కుటుంబాలు మారినా శ్మశానాన్ని మాత్రం మార్చుకోలేదు. కొత్తపాలెంలో సుమారు 400 కుటుంబాలు ఉన్నాయి. వీటిలో సగం కుటుంబాలకు కాల్పుకాగా, మిగిలిన వారు పూడ్పు ఆచారంగా వ్యవహరిస్తున్నారు.
 
చారిత్రక మట్టికట్టకొడితే కొండవాగులు ఊరిని ముంచేస్తాయి...
చారిత్రక మట్టికట్టను తవ్వడం వలన కొండమీదుగా వచ్చే వాగులు ఊరిని ముంచే ప్రమాదం ఉందంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఒకవైపు చారిత్రక ఆనవాళ్లు కనుమరుగు అవ్వడంతోపాటుగా ఊరంతా జలముంపుకు గురయ్యే అవకాశం ఉందంటూ చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామానికి ఆగ్నేయదిశగా ఈ హిందూ శ్మశానం ఉంది. వణుకుల కుంటగా పిలుచుకునే ఈ శ్మశానం మధ్యలో నుంచి గ్రావెల్ తరలించే మార్గాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గత పదిరోజులు రాత్రిపూట నిర్వీరామంగా తవ్వకాలు చేసి ట్రాక్టర్‌ల ద్వారా తరలించారని ఆరోపిస్తున్నారు. శ్శశానం వెనుక భాగంవైపుగా మట్టికట్టను సగం వరకు తవ్వేశారని ఇలాగే ఇంకొంత తవ్వితే పూర్తిగా శ్మశానం కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక కట్టడమైన మట్టికట్ట తవ్వకం చేయడం వలన కొండవాగులు ఊరిపై పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్త చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
సమాధులు మధ్య దారి...
సమాధుల మధ్యగా దారి ఏర్పాటు చేశారు. శ్మశానానికి వెనుక నుంచి తవ్వకాలు చేయడం ఏంటి? అసలు శవాలను తవ్వి అమ్ముకోబోయారా? సమాధుల్లో తవ్వితే మట్టి ఒక్కటే కాదు అందులోని శవాలు అమ్ముకున్నట్టే లెక్క. ఇది గ్రామస్తులందరికీ చెందిన శ్మశానం అని గుర్తుంచుకోవాలి.
  -మానం సాంబయ్య
 
రోజు రాత్రిళ్లు మట్టి తవ్వుతున్నారు...
పదిరోజులుగా రాత్రివేళ తవ్వకాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు గ్రామస్తులంతా ఫిర్యాదు చేస్తున్నాం. శ్మశానం ఎత్తయిన మట్టిపై ఉంది. ఈ కట్టను తవ్వడం వలన కొందపై నుంచి వచ్చే కొండవాగులు ఊరిపై పడతాయి. అధికారులు చారిత్రక కట్టడమైన మట్టికట్టకు రక్షణ కల్పించాలి.

మరిన్ని వార్తలు