కౌలు రైతులకు అప్పు తిప్పలు

26 Sep, 2013 04:17 IST|Sakshi

ఇంకొల్లు, న్యూస్‌లైన్: ఖరీఫ్ ముగిసి రబీ సీజన్ వస్తున్నా.. జిల్లాలో కౌలు రైతులకు బ్యాంకులు రుణాలివ్వక వారి పరిస్థితి దయనీయంగా మారింది. బయట అప్పులు పుట్టక కౌలు రైతులు పంటల పెట్టుబడుల కోసం అల్లాడుతున్నారు. అధిక వడ్డీలకు తెచ్చయినా పంటలు కాపాడుకునేందుకు రుణ దాతల కోసం ఎదురుచూస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కౌలు రైతులకు గుర్తింపుకార్డులిచ్చే దిక్కులేదు. బ్యాంకర్లు మాత్రం కార్డులు లేనిదే రుణాలివ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు.
 
జిల్లాలో 1.50 లక్షల మందికిపైగా కౌలు రైతులున్నారు. వారు 3 లక్షల ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు. ఈ ఖరీఫ్‌లో లక్ష ఎకరాలకు పైగా పత్తి, మిర్చి, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తుండటంతో పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. పైర్లను కాపాడుకునేందుకు ఎరువులు కొనేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేక కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో అప్పు తీసుకొని చెల్లించిన కౌలు రైతులకు కూడా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపుకార్డులివ్వాలని, గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించిన వారికి కార్డులతో నిమిత్తం లేకుండా రుణాలివ్వాలని కౌలు రైతులు కోరుతున్నారు.
 
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11న జిల్లా కేంద్రంలో ధర్నా చేసి సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 12వ తేదీన బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కౌలు రైతుల సంఘ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గతంలో అప్పు తీసుకొని తిరిగి చెల్లించిన కౌలు రైతులందరికీ కార్డులతో నిమిత్తం లేకుండా వెంటనే రుణాలు చెల్లించాలని బ్యాంకర్లను ఆదేశించారు. అయినా బ్యాంకర్లు వ్యవసాయాధికారుల, వీఆర్వోల సంతకాలు కావాలని కౌలు రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల సంఘం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతోంది. గురువారం  జే పంగులూరులో జిల్లా సదస్సు నిర్వహించి పోరాట కార్యాచరణ రూపొందించేందుకు సమాయత్తమవుతోంది.  
 
పాత రుణాలు చెల్లించాం: నల్లపు రంగారావు, కౌలు రైతు, ఇంకొల్లు
మూడేళ్లుగా 2 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాను. పత్తి ఎకరం, మిర్చి ఒక ఎకరం వేశాను. గత ఏడాది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 30 వేలు రుణం తీసుకున్నాను. పంట చేతికి రాగానే రుణం తిరిగి చెల్లించాం. ఈ ఏడాది ఇంకా రుణాలివ్వలేదు.  అధికారుల సంతకాలపేరిట బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 50 వేలు వరకు పెట్టుబడి పెట్టాను. బలం మందులు వేయాల్సి ఉంది. తక్షణం రూ. 50 వేలు వరకు అవసమమవుతాయి.
 
అప్పుల కోసం ఎదురు చూస్తున్నాం : గట్టుపల్లి యహోషువా, కౌలు రైతు ఇంకొల్లు
అప్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఈ ఏడాది ఒక ఎకరం పత్తి, ఒకటిన్నర ఎకరా మొక్కజొన్న, రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాను. ఇప్పటికి పెట్టుబడి రూ. 1.5 లక్షలు పెట్టాను. గత ఏడాది బ్యాంకు రుణం రూ. 30 వేలు తీసుకున్నాను. తిరిగి చెల్లించాం. కానీ ఇప్పుడు కౌలు రుణాలు ఇవ్వలేదు.
 
సమ్మె మాపాలిట శాపంగా మారింది: బేతాల ఆనందరావు, కౌలురైతు ఇంకొల్లు
ఉద్యోగుల సమ్మె మాపాలిట శాపంగా మారింది. సమ్మె కారణంగా రుణాలు సకాలంలో పొందలేక పోతున్నాం. ఈ ఏడాది 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. 5 ఎకరాల్లో పత్తి, ఒక ఎకరంలో మిర్చి వేశాను. ఇప్పటి వరకు ఖర్చు రూ. 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. గత ఏడాది రూ. 30 కౌలు రుణం తీసుకుని తిరిగి చెల్లించా. కానీ ఈ ఏడాది ఇప్పటికీ ఇవ్వలేదు. రుణాల కోసం ఎదురు చూస్తున్నాం. అధికారులు స్పందించి రుణాలిచ్చి ఆదుకోవాలి.
 

మరిన్ని వార్తలు