విధులు నిర్వర్తిస్తూ.. జనోద్యమం @ 115

23 Nov, 2013 02:55 IST|Sakshi
విధులు నిర్వర్తిస్తూ.. జనోద్యమం @ 115

సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 115వ రోజైన శుక్రవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. పలు జిల్లాల్లో జోరున వర్షం కురుస్తున్నా ఉద్యమం మాత్రం సడలలేదు. ఎన్జీవోలు ఓవైపు కార్యాలయాల్లో విధులకు హాజరవుతూ మరోవైపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. చిత్తూరులో న్యాయవాదులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతిలో సాప్స్ ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో చేశారు. పుంగనూరులో బీసీ సంఘం, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. సమైక్య ఉద్యమాన్ని తక్కువచేస్తూ మాట్లాడిన పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ దిష్టిబొమ్మను కృష్ణాజిల్లా కలిదిండిలో జేఏసీ నాయకులు దహనం చేశారు. అవనిగడ్డలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం భారీవర్షంలోనూ కొనసాగాయి. తూర్పుగోదావరి,  నెల్లూరు,  అనంతపురం తదితర జిల్లాల్లో   వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగాయి. అనేకచోట్ల గడపగడపకూ వైఎస్సార్పీపీ పేరిట పాదయాత్రలు కూడా నిర్వహించారు.
 
 మంత్రి కాసుకు సమైక్య సెగ
 గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డికి సమైక్య సెగ తగిలింది. రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన కాన్వాయ్‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కాసు కారు దిగి ఆందోళనకారుల వద్దకు రాగా, మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా నినాదాలు చేశారు. విభజనను అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని ఆయన చెప్పడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు