ఉక్కు సంకల్పంతో...సమైక్యాంధ్ర ఉద్యమం

11 Aug, 2013 04:20 IST|Sakshi
లక్ష గొంతులు ఒక్కటైన వేళ.. ‘జై సమైక్యాంధ్ర’ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగుతోంది. అందరి గుండె చప్పుడూ సమైక్యాంధ్ర ఘోషనే ప్రతిధ్వనిస్తోంది. ఉత్తుంగ తరంగమై ఎగసిపడుతున్న ప్రజానీకం.. చేయీచేయీ కలిపి సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా కదులుతోంది. ‘ఒకే భాష-ఒకే జాతి-ఒకే రాష్ర్టం’ స్ఫూర్తితో రూపుదిద్దుకొన్న తెలుగుతల్లిని ముక్కలు చేస్తే సహించబోమంటూ ఉక్కు సంకల్పంతో కదం తొక్కుతోంది.
 
 సాక్షి, రాజమండ్రి : రాజకీయ స్వార్థంతో చేసిన రాష్ర్ట విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేంత వరకూ సమైక్య ఉద్యమం ఆగదని జనం స్పష్టం చేస్తున్నారు. సమైక్యాంధ్ర కదనరంగంలోకి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఉరుకుతున్నారు. విభజనకు కారకులైన నేతలను హెచ్చరిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
 
 కొనసాగుతున్న దీక్షలు
 జిల్లావ్యాప్తంగా నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో తొమ్మిది రోజులు గా వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో శనివారం పదిమంది పాల్గొన్నారు. త్రీటౌన్ పోలీస్ స్టేష న్ ఎదుట జేఏసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మూడో రోజు రిలే దీక్షల్లో కేబుల్ టీవీ ఆపరేటర్లు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఎదుట న్యాయవాదుల దీక్షలు తొమ్మిదో రోజూ కొనసాగాయి. పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కోటగుమ్మంలో జరుగుతున్న రిలే దీక్షల్లో శనివారం నలుగురు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు శనివారం కూడా జరిగాయి. గోదావరి గట్టున ఉన్న ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఈపీడీసీఎల్ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. అమలాపురం గడియారం స్థంభం సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రావులపాలెంలో జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు శనివారం కొనసాగాయి. కాకినాడ రూరల్ తూరంగిలో జేఏసీ ఆధ్వర్యంలో, సర్పవరంలో రెసిడెన్షియల్స్ అసోసియేషన్ పేరుతో స్థానికులు, అచ్చంపేట జంక్షన్‌లో ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు ఆరు రోజులుగా కొనసాగుతున్నాయి. 
 
 ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రిలే దీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. ప్రత్తిపాడులో వైఎస్సార్ సీపీ చేపట్టిన దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. అనపర్తిలో న్యాయవాదుల రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు కర్రి శేషారత్నం దీక్షలకు సంఘీభావం తెలిపారు. మండపేటలో జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. రామచంద్రపురం మండలం ఓదూరులో శనివారం ఆఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. కాకినాడ భానుగుడి సెంటర్‌లో మంత్రి తోట నరసింహం భార్య, వీరవరం సర్పంచ్ సరస్వతి (వాణి) శనివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
 
 రాజమండ్రిలో..
 రాజమండ్రిలో సుమారు 500 మంది మహిళలు ప్రదర్శన చేశారు. సుబ్రహ్మణ్య మైదానంలో సమావేశమై సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పుష్కరాల రేవు వద్ద రాస్తారోకో చేసి ఆటలు ఆడారు. అనంతరం ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని, సమైక్యాంధ్ర కోరుతూ ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్కాట్‌తోట ఐదుబళ్ల మార్కెట్ సెంటర్‌లో వంటావార్పు నిర్వహించారు. రౌతు యూత్ ఆధ్వర్యంలో నందం గనిరాజు సెంటర్‌లో వంటావార్పు చేశారు.
 
 కాకినాడలో..
 రామారావుపేటలోని పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు అయ్యప్ప స్వాములు క్షీరాభిషేకం చేసి, నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. బిల్డర్స్, డెవలపర్స్ అసోసియేషన్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కల్యాణి ఆటోమొబైల్స్, రోటరీ బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఫిషింగ్ బోట్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్నాథపురం వంతెన వద్ద వంటావార్పు చేపట్టారు. భానుగుడి సెంటర్‌లో హిజ్రాలు ప్రదర్శన చేశారు. అచ్చంపేట జంక్షన్ నుంచి భానుగుడి సెంటర్ వరకూ పొక్లెయిన్‌‌స అసోసియేషన్ సభ్యులు జేసీబీలతో ర్యాలీ చేశారు. కైట్ విద్యాసంస్థల బస్సులతో సిబ్బంది, విద్యార్థులు ప్రదర్శన చేశారు. గుర్తింపు సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో భానుగుడి సెంటర్‌లో ప్రదర్శన జరిగింది. జేఎన్‌టీయూకే విద్యార్థులు కూడా ఆందోళన చేశారు.
 
 జర్నలిస్టుల ఆధ్వర్యంలో..
 సమైక్య రాష్ర్టం కోసం కాకినాడ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు శాంతిహోమం నిర్వహించారు. రాజమండ్రి జాంపేట సెయింట్ దేవదాసు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆది, సోమవారాల్లో దేవాలయం, మసీదుల్లో కూడా ప్రార్థనలు చేపట్టనున్నారు. సామర్లకోటలో సంతకాల సేకరణ చేపట్టారు.
 
 కోనసీమలో...
 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన దాట్ల సత్యనారాయణరాజు అనే అంధుడు అమలాపురం నుంచి అయినవిల్లి సిద్ధివినాయకస్వామి ఆలయం వరకూ పాదయాత్ర చేశారు. ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కొత్తపేటలో ఆర్యవైశ్య సంఘాలు, వర్తక సంఘాలు బంద్ పాటించాయి. తొలుత గ్రామంలో ప్రదర్శన చేసి, ముగ్గుల పోటీలు నిర్వహించారు.  మామిడికుదురులో టీడీీపీ నేతలు రాస్తారోకో చేశారు. అంబాజీపేట మండలం వక్కలంకలో వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అయినవిల్లి, పి.గన్నవరంలలో రాస్తారోకో నిర్వహించారు. మలికిపురం మండలం దిండి గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు చేశారు.
 
 విద్యార్థుల నిరసనలు
 పిఠాపురంలో 216 జాతీయ రహదారిపై కైట్, రాజీవ్‌గాంధీ విద్యాసంస్థల విద్యార్థులు బస్సులతో ప్రదర్శన నిర్వహించారు. రహదారిని దిగ్భంధం చేసి డప్పులు వాయిస్తూ, సమైక్యాంధ్ర పాటలు పాడుతూ నిరసన తెలిపారు. తొండంగి, కోటనందూరు గ్రామాల్లో విద్యార్థి సంఘాలు ర్యాలీలు చేపట్టాయి. కాగా, పెద్దాపురంలో న్యాయవాదులు ప్రదర్శన చేశారు.
 
 ఉద్యమ బాటలో వైఎస్సార్‌సీపీ నేతలు
 రాజమండ్రిలో మహిళలు నిర్వహించిన సమైక్యాంధ్ర ఆందోళనల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కం పూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. వివిధ జేఏసీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాలకు వెళ్లి సంఘీభావం తెలిపారు. కడియంలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరానికి మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు మద్దతు తెలిపారు. కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో పెనుగుదురు నుంచి కాకినాడ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. అమలాపురం గడియారం స్థంభం సెంటర్‌లో కొనసాగుతున్న రిలే దీక్షల్లో పాల్గొన్న కోనసీమ రైతు పరిరక్షణ సమితి నేతలకు, రైతులకు పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ చింతా కృష్ణమూర్తి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు సంఘీభావం తెలిపారు. సామర్లకోటలో జర్నలిస్టులు చేపట్టిన సంతకాల సేకరణలో ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు పాల్గొన్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్లలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి సంఘీభావం తెలిపారు. 
 
 మలికిపురం మండలం కేశవదాసుపాలెంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన ధర్నాలో కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ పాల్గొన్నారు. పిఠాపురంలో వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు, క్లీనర్ల సంఘం నేతలు బస్సులతో ప్రదర్శన చేశారు. గండేపల్లిలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పరిమి బాబు ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. సీతానగరంలో పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనపర్తి మండలం రామవరంలో వైఎస్సార్‌సీపీ నేతలు సత్తి సూర్యనారాయణరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు సత్తి వీర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాజులూరు మండలం దుగ్గుదూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. జగ్గంపేట మండలం సీతానగరానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శస చేశారు.
 
 రేపటి నుంచి నిరవధిక బంద్
 రాజమండ్రిలో ఈ నెల 12 నుంచి నిరవధిక బంద్‌కు అన్ని వ్యాపార, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. నిరవధిక బంద్‌ను జిల్లా స్థాయిలో చేపట్టే అంశంపై చర్చించేందుకు ఆదివారం ఉదయం 10 గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి, వ్యాపార, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో జిల్లాకు చెందిన పలు ఉద్యోగ సంఘాలు శనివారం సమావేశమై, ఈ నెల 12 నుంచి నిరవధికంగా విధులు బహిష్కరించాలని నిర్ణయించాయి. నేతల రాజీనామాలకు పట్టుబట్టాలని తీర్మానించాయి.
 
మరిన్ని వార్తలు