సమైక్యాంధ్ర పరిరక్షణకే శంఖారావం

24 Dec, 2013 04:02 IST|Sakshi
సమైక్యాంధ్ర పరిరక్షణకే శంఖారావం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణకే వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం కార్యక్రమాన్నిచేపడుతున్నారని పార్టీ నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమైక్యశంఖారావం పేరిట జగన్‌మోహన్‌రెడ్డి  పర్యటించనున్నారని వివరించారు. సమైక్యాంధ్ర విషయంలో మొదటినుంచి స్పష్టమైన వైఖరితో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన విభజన లేఖను ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
 
 జిల్లాలోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్‌లో టీ బిల్లు ఆమోదం పొందకుండా ఉండేందుకు జగన్‌మోహన్‌రెడ్డి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయా పార్టీల నాయకుల మద్దతు కూడగడుతున్నారన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల ఎంతోమందికి ఉపాధిలేకుండా పోతోందన్నారు. శ్రీకాకుళం పట్టణ శాఖ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ సమన్యాయమంటూ టీడీపీ తెలుగు ప్రజలను వంచిస్తోందన్నారు. పార్టీ నేత ఎన్ని ధనుంజయ్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను గౌరవించకుండా చంద్రబాబు విభజనకు వంతపాడడం దురదృష్టకరమన్నారు. అనంతరం సమైక్య శంఖారావం పోస్టర్లను కృష్ణదాస్ తదితరులు ఆవిష్కరించారు. పార్టీ నేతలు చింతాడ గణపతిరావు, మహమ్మద్ సిరాజుద్దీన్, లావేటి శ్యాం పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు