రైల్ రోకో కార్యక్రమాలపై సమైక్యాంధ్ర జేఏసీ దృష్టి

16 Sep, 2013 16:11 IST|Sakshi

హైదరాబాద్: రైల్ రోకో కార్యక్రమాలపై సమైక్యాంధ్ర జేఏసీ దృష్టి సారించనుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జేఏసీ  సోమవారం ఏపీఎన్జీవో భనవ్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యచరణపై చర్చించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైల్ రోకో కార్యక్రమాల నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.

 

అంతకుముందు ఉద్యోగుల సమ్మెపై హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగర శాఖ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల నాయకుల సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. హైకోర్టు తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా వచ్చినా, సమ్మె కొనసాగించాల్సిందేనని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయడ్డారు. తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చించారు.

మరిన్ని వార్తలు