కదం తొక్కుతున్న సమైక్యవాదులు

17 Sep, 2013 04:32 IST|Sakshi
సాక్షి, అనంతపురం : సమైక్యవాదులు అవిశ్రాంతంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. లక్ష్యం చేరే వరకు పోరుబాటను వీడేది లేదని ఎలుగెత్తి చాటుతున్నారు. 48వ రోజైన సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగాఉద్యమాన్ని హోరెత్తించారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోనూ బలోపేతం చేయాలని సమైక్యాంధ్ర సంయుక్త జేఏసీ కన్వీనర్, డీఆర్‌ఓ హేమసాగర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, తహశీల్దార్లు, ఆర్‌ఐలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. నగరంలో మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ప్లకార్డులు మెడలో వేసుకుని భిక్షాటన చేశారు. జాక్టో, నీటి పారుదల, పీఏసీఎస్, పంచాయతీరాజ్, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీలు, బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నగరంలోని ఉపాధ్యాయులు తపోవనం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు రోడ్లపైనే విద్యాబోధన చేసి నిరసన తెలిపారు. 48 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయులకు జర్నలిస్టు జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఎస్కేయూలో విద్యార్థుల రిలే దీక్షలు 48వ రోజూ కొనసాగాయి. ఆకుతోటపల్లికి చెందిన వందలాది మంది మహిళలు గ్రామం నుంచి ఎస్కేయూ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ రాస్తారోకో చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు సైతం ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామాంజినేయులు డిమాండ్ చేశారు. 
 
 ఊరూ వాడ తగ్గని జోరు
 ధర్మవరంలో ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో సమైక్యాంధ్ర జేఏసీ కో-కన్వీనర్ డాక్టర్ సుమంత్‌కుమార్ గుండెపోటుతో మరణించారు. సమంత్ కుమార్ మృతదేహాన్ని పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉంచి సమైక్యవాదులు నివాళులర్పించారు. పట్టణంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జేఏసీ నాయకులు రోడ్డుపై టీ అమ్ముతూ నిరసన తెలిపారు. గిరిజన మహిళలు రోడ్లపై నృత్యాలు చేశారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించి... వాహనాలను అడ్డుకున్నారు. గుత్తిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. రూ.28,402 వసూలైంది. జేఏసీ ఆధ్వర్యంలో కరిడికొండ వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. న్యాయవాదులు జాతీయ రహదారిపై మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ నాయకుల వాహనాలకు దారి ఇవ్వలేదన్న ఉద్దేశంతో వారు.. జేఏసీ నాయకులతో వాగ్వాదానికి దిగారు.
 
 జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికులు పొర్లుదండాలు పెట్టారు. పామిడిలో సమైక్యవాదులు రోడ్డుపైనే ఆసనాలు వేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు జలదీక్ష చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల ప్రదర్శన, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు రహదారిపై ఆందోళన చేశారు. కదిరిలో చర్చి ఫాదర్లు, క్రెస్తవులు రిలే దీక్షలు చేపట్టారు. రోడ్డుపైనే ఆటా పాట నిర్వహించారు. కదిరి చెరువులో సమైక్యవాదులు జలదీక్ష చేపట్టారు. తలుపులలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు ‘సమైక్యాంధ్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మడకశిరలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. అమరాపురంలో ఉపాధ్యాయులు గడ్డి తింటూ, పుట్టపర్తిలో సమైక్యవాదులు ఎద్దులబండి లాగి నిరసన తెలిపారు. పెనుకొండలో స్కూటర్ ర్యాలీ, గోరంట్ల, సోమందేపల్లిలో ర్యాలీలు చేపట్టారు. రాయదుర్గంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు.‘కేసీఆర్ వికృతరూపం’ నాటికను ప్రదర్శించారు. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. కణేకల్లులో ఎన్‌జీవోలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. 
 
 రాప్తాడులో ఉపాధ్యాయులు వినూత్న నిరసన తెలిపారు. ఆత్మకూరులో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కల్లూరు, గార్లదిన్నెలో సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, మునిసిపల్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య సంఘీభావం తెలిపారు. పెద్దవడుగూరులో జేఏసీ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉరవకొండలో విద్యార్థులు రోడ్లపైనే చదువుతూ నిరసన తెలిపారు. గడేహోతూరు, చిన్నహోతూరు గ్రామస్తులు ఉరవకొండకు చేరుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. సమైక్యవాదులు జేసీ దివాకరరెడ్డి బస్సులను అడ్డుకున్నారు. కొనకొండ్లలో పీహెచ్‌సీ వైద్యులు రోడ్డుపైనే వైద్య పరీక్షలు నిర్వహించి నిరసన తెలిపారు. జీడీపల్లిలో జేఏసీ నాయకులు జలదీక్ష చేశారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. 
మరిన్ని వార్తలు