ఆగని ఆగ్రహజ్వాల

8 Oct, 2013 01:59 IST|Sakshi

సాక్షి నెట్‌వర్క్: సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పతాకస్థాయికి చేరింది. రాష్ర్ట విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ అడుగడుగునా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. కేంద్రం తెలంగాణ నోట్‌ను ఆమోదించిన దరిమిలా నిప్పుకణికలై ఉద్యమిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సుంకేసుల వద్ద చేపట్టిన ‘రైతు శంఖారావం’ రైతులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. బ్యారేజీపై సమావేశం నిర్వహించేందుకు రైతులు సన్నాహాలు చేయగా, పోలీసులు అడ్డుకుని కేసీ కెనాల్ గట్టుపై సభ జరుపుకోమని సూచించారు. ఇందుకు ససేమిరా అన్న రైతులు బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జిచేశారు.
 
 అనంతపురంలో వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది కేంద్ర మంత్రుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమణమూర్తి, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ శాఖ కార్యాలయానికి తాళాలు వేశారు. చెన్నేకొత్తపల్లిలో జేఏసీ నాయకులు పెనుకొండ వైపు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సును అడ్డుకున్నారు. విశాఖ జిల్లా సీలేరులో సమైక్యవాదులు విద్యుత్ ఉత్పత్పి కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డు నిర్బంధించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ గేటు వద్ద ఉద్యోగులు, కార్మికులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరు జిల్లావ్యాప్తంగా విద్యుత్ సబ్‌స్టేషన్లను సమైక్యవాదులు ముట్టడించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని  కోనాడ జంక్షన్‌లో జాతీయ రహదారిపై  రాస్తారోకో చేపట్టారు.  కురుపాంలో  కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ ఇంటిని ముట్టడించగా, ఆయన స్పందిస్తూ విభజనను అడ్డుకునేందుకు చివరివరకు ప్రయత్నించడం కోసమే పదవిలో కొనసాగుతున్నానని చెప్పారు.
 
 జాతీయరహదారిని దిగ్బంధించిన రైతులు:
  పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు.   దీంతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోరుుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరు 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ శాఖ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. మండపేటలో జరిగిన మహాజన గళగర్జనకు వేలాదిగా సమైక్యవాదులు తరలి వచ్చారు. రావులపాలెంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా