రచ్చబండలో సమైక్య హోరు

17 Nov, 2013 00:54 IST|Sakshi
రచ్చబండలో సమైక్య హోరు

సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ప్రభుత్వం చేపట్టిన రచ్చబండ కార్యక్రమం అడుగడుగునా సమైక్య నిరసనల మధ్య కొనసాగింది. కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్న రచ్చబండకు పోలీసులు పలు ‘ముందు జాగ్రత్త’ చర్యలు చేపట్టారు. కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే భయంతో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్‌నాయకులు, కార్యకర్తలను ముందే అదుపులోకి తీసుకోవడమో, గృహనిర్బంధంలో ఉంచడమో చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను కోసం శుక్రవారం నుంచే వెతుకుతున్న పోలీసులు చివరకు ఆయన సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా చిల్లకల్లులో అరెస్ట్ చేశారు. అయినప్పటికీ రచ్చబండలో సీఎంకు సమైక్య సెగ తప్పలేదు. కిరణ్ ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై సంక్షేమపథకాల రూపశిల్పి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో లేకపోవడం పట్ల మహిళలు నిరసన తెలిపారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
 
 దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఇంతమంది పాల్గొన్న సభలో ఎవరో ఒకరు హడావిడి చేస్తూనే ఉంటారు, పట్టించుకోవద్దని వ్యాఖ్యానించారు. పోలీసులు అడ్డుకున్నా.. మహిళలు తమ ఆందోళన ఆపలేదు. ‘రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర ఎడారి’ అనే ఫ్లెక్సీలతో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు బెమ్మవరపు కృష్ణకుమారి, కఠారి సుజాత, అమీర్‌బీ, బుజ్జి నిరసన తెలిపారు. ‘ముఖ్యమంత్రి గారూ.. సీమాంధ్ర ప్రజల మొర ఆలకించండ’ంటూ నినదాలు చేశారు. సమైక్యానికి మద్దతు ఇచ్చేవారు చేతులు ఎత్తాలని ముఖ్యమంత్రి కోరినప్పుడు కూడా కొందరు లేచి జై జగన్ నినాదాలు చేశారు. మరోవైపు ఇందిరమ్మ మోడల్ కాలనీ వాసులు తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ముఖ్యమంత్రి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
 
 చిత్తూరులో: తిరుపతి రూరల్ మండలంలో రచ్చబండకు హాజరయ్యేందుకు వస్తున్న మంత్రి గల్లా అరుణకుమారిని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు అడ్డుకునే యత్నం చేశారు. పోలీసులు చెవిరెడ్డి సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేశారు. చంద్రగిరిలోనూ మంత్రి గల్లాను అడ్డుకునేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
 అనంతపురంలో: అనంతపురం జిల్లా కుందుర్పిలో ‘రచ్చబండ’లో పాల్గొన్న మంత్రి రఘువీరారెడ్డికి ‘సమైక్య’సెగ తగలకుండా శనివారం ఉదయాన్నే వైఎస్సార్‌సీపీ నాయకులను, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కార్యక్రమం ముగించుకుని వెళ్లిన తరువాత వారిని వదిలిపెట్టారు. పోలీసు చర్యలను ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
 
 పశ్చిమగోదావరిలో: పాలకొల్లులో రచ్చబండకు  కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణలు హాజరయ్యారని తెలుసుకున్న  ఉద్యోగ జేఏసీ నాయకులు అక్కడికి వచ్చి పెద్దపెట్టున సమైక్య నినాదాలు చేశారు. అనంతరం నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, కన్వీనర్ డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ తదితరులను కావూరి పిలిపించుకుని మాట్లాడారు. మంత్రి పదవి రాగానే సమైక్యవాదాన్ని ఎందుకు దాటవేశారని ఉద్యోగులు ఆయన్ని సూటిగా ప్రశ్నించారు.
 
 తెలంగాణాలోనూ రచ్చ..
 
 తెలంగాణ జిల్లాల్లో శనివారం జరిగిన మూడోవిడత రచ్చబండ సభలు రచ్చ..రచ్చగా మారాయి. తెలంగాణను అడ్డుకుంటున్నాడంటూ.. పలుచోట్ల సీఎం కిరణ్ ఫ్లెక్సీలను, హోర్డింగులను తెలంగాణవాదులు తొలగించారు. నల్లగొండలో కిరణ్ ఫొటోతో రచ్చబండ సభలు జరపొద్దంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే సీఎం కిరణ్ ఫ్లెక్సీని చించి దహనం చేశారు. ఆలేరులో టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ సమక్షంలోనే సీఎం ఫొటో ఉన్న వాల్‌పోస్టర్లను చించివేశారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో సభా వేదికపై ఫ్లెక్సీలో కిరణ్ ఫొటో పెట్టడంపై జేఏసీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఆయన ఫొటో కనబడకుండా తెల్లకాగితం అతికించారు.  మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో రచ్చబండ సభావేదికపై కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కించడాన్ని టీడీపీ, సీపీఎం నాయకులు తప్పుబట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.  దీన్ని నిరసిస్తూ ఆందోళన దిగిన 13 మంది సీపీఎం నేతలను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కరీంనగర్ జిల్లా రామగుండంలో అధికారులు సీఎం ప్రసంగ పాఠాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అడ్డుకున్నారు.
 
 బోయిన్‌పల్లిలోనూ సీఎం ప్రసంగాన్ని వివిధ పార్టీల నాయకులు అడ్డుకొని, పోస్టర్‌పై ఉన్న ఆయన ముఖం కనిపించకుండా రంగుపూశారు. వీణవంకలో వేదికపై ఫ్లెక్సీలో కిరణ్ ముఖం కనిపించకుండా పేపర్లు అతికించారు. సీఎం సన్నిహితుడైన హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్న సైదాపూర్ రచ్చబండ సభలోనూ ప్రసంగ పాఠాన్ని బహిష్కరించారు. ముస్తాబాద్‌లో వేదికపై ఫ్లెక్సీలో ఫొటో ముద్రించలేదు. ఆదిలాబాద్ రచ్చబండలో కిరణ్ ఫొటో ఫ్లెక్సీని పెట్టడంతో తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ నేతలు చింపివేశారు. అనంతరం సీఎం ఫొటోస్థానంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా ఫొటోను అతికించారు.  సీఎం చర్యలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం ఫొటోకు చెప్పుల దండ వేశారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీఎం కిరణ్ వైఖరిని నిరసిస్తూ ఈనెల 18,19 తేదీల్లో కామారెడ్డి నియోజకవర్గంలో జరిగే రచ్చబండను బహిష్కరించనున్నట్టు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు