తిరుమలకు సమైక్య సెగ

17 Aug, 2013 06:28 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ‘సమైక్య’ సెగ తలిగింది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. వెంకన్న హుండీ ఆదాయం సగానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి 24 గంటలపాటు తిరుపతి-తిరుమల మధ్య టాక్సీలను నిలిపి వేయాలని తిరుమల, తిరుపతి ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయాలని ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ  ఈనెల 13వ తేదీన తిరుమలకు బస్సులు నిలిపివేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
 
 స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి బస్సులు నడపాల్సిందిగా సూచించడంతో కొద్దిపాటి బస్సులను పునరుద్ధరించారు. సాధారణ రోజుల్లో దాదాపు 500 బస్సులు తిరుమలకు తిరుగుతుండగా, ఈనెల 14వ తేదీ నుంచి 107 బస్సు సర్వీసులను మాత్రమే పునరుద్ధరించారు.  ఇవి కూడా తిరుపతి బస్టాండ్ నుంచి గాక అలిపిరి బాలాజీ బస్టాండు నుంచి తిరుమలకు నడుపుతున్నారు. మామూలు రోజుల్లో బస్సుల ద్వారా వెళ్లి వచ్చే భక్తుల సంఖ్య లక్షకుపైగా ఉంటుంది. ప్రస్తుతం 107 బస్సుల్లో సగటున 26 వేల మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. భక్తుల సంఖ్య తగ్గడంతో తిరుమల వెంకన్నకు వచ్చే ఆదాయం కూడా భారీగా పడిపోయింది. రోజూ రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల వరకూ ఉండే హుండీ ఆదాయం కోటిన్నరకు పడిపోయింది. గదులు కూడా ఖాళీ అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు వాహనాలు నిలిచిపోవడం కూడా తిరుమలపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది.
 
 శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 32 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 10 గంటల్లోనే దర్శనం లభిస్తోంది. రద్దీ పెరగడంతో రూ.300 టికెట్ల దర్శనం సాయంత్రం 4 గంటలకు నిలిపివేశారు. అలిపిరి, శ్రీవారి వెుట్టు మార్గాల్లో నడిచి వచ్చిన భక్తులు 9 కంపార్‌మెంట్లలో వేచిఉన్నారు. వీరికి దర్శన సమయం 5 గంటలుగా కేటాయించారు. వెంకన్న సేవలో డీజీపీ దినేష్‌రెడ్డి: రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
 
 ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకున్న ఆయన సన్నిధి చేరుకుని అభిషేక సేవలో స్వామిని దర్శించుకున్నారు. వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆలయాధికారులు డీజీపీకి శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. డీజీపీ శ్రీకాళహస్తి చేరుకుని ముక్కంటీశుని, తిరుచానూరులో పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.
 
 విభజిస్తే రాజకీ య నిష్ర్కమణ : కోట్ల
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియా చానళ్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారడం ఖాయమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు