సమైక్య సెగ రైల్వేశాఖనూ తాకింది

14 Aug, 2013 05:01 IST|Sakshi
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ :  సమైక్య సెగ రైల్వేశాఖనూ తాకింది. సమ్మె ప్రభావంతో పాసింజర్ రైళ్లన్నీ  ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం, పలాస మీదుగా నడిచే పాసింజర్ రైళ్లలో ప్రయాణికులు నామమాత్రంగా ఉండడంతో  రైల్వే క్యాంటిన్ల వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో విశాఖ, శ్రీకాకుళం నుంచి వచ్చే పాసింజర్ రైలు ప్రయాణికుల సంఖ్య దాదాపు తగ్గిపోయింది. ముందస్తుగా బంద్ తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు డిపోలకే పరిమితమవ్వడం వల్ల రైల్వే క్యాంటిన్ కార్మికులకు ఆదాయం బాగానే ఉంటుందనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. 
 
 పయాణికులు సాధారణంగా కన్నా తక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని క్యాంటిన్ల కార్మికులు తెలిపారు. ఉద్యమ ప్రభావం వల్ల రైళ్ల రాకపోకలకు ఎటువంటి అవాంతరాలూ ఎదురుకాలేదు. అయితే నిత్యం ప్రయాణం చేసే లోకల్ రైళ్లు మాత్రం మంగళవారం బోసిపోయాయి. విజయనగరం-విశాఖ-పలాస ప్యాసింజర్, డీఎంయూ, కోర్బా, విజయవాడ ప్యాసింజర్ తదితర పాసింజర్ రైళ్లు ఎటువంటి రద్దీ లేకుండానే నడిచాయి. అయితే పాసింజర్ రైళ్లలో ఎక్కువగా  ప్రయాణం చేసిన వారిలో నెలవారీ సీజన్ టికెట్ కొనుగోలు చేసిన వారే అధికంగా ఉంటారు. ఈ పాసింజర్ రైళ్లపైనే ఆధారపడే కార్మికులు కొన్ని రోజులుగా ఇబ్బందులెదుర్కొంటున్నారు. 
 
 సాధారణంగా స్టేషన్ పరిసరాల్లో ఇడ్లీ, దోసె, టీ, కాఫీ, స్నాక్స్, పుస్తకాలు వంటివి ఎక్కువగా అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే ప్రయాణికులు టీ, కాఫీ, స్నాక్స్‌పైనే ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. బంద్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోతున్నామని కార్మికులు తెలిపారు. అన్ని ఖర్చుల పోనూ 24 గంటల పాటు కార్మికుడు శ్రమిస్తే రూ.300 నుంచి రూ.400 వరకూ ఆదాయం సంపాదిస్తాడు. బంద్ నేపథ్యంలో కనీసం తమకు కూలీ గిట్టుబాటు కావడం లేదని, ఇదే కొనసాగితే తమ పరిస్థితి అగ మ్యగోచరమేనని పలువురు క్యాంటిన్, ఫుట్‌పాత్ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. 
 
మరిన్ని వార్తలు