సమైక్య సమర సైనికులై..

26 Oct, 2013 03:51 IST|Sakshi

 సాక్షి, కాకినాడ:
 అందరి హృదయ స్పందనా సమైక్యతే! అందరి లక్ష్యమూ సమైక్యాంధ్ర పరిరక్షణే! అందుకే వైఎస్సార్ సీపీ సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి జనం వెల్లువలా కదలి వెళ్లారు. ఆది నుంచీ తమ ఆకాంక్షలకు ప్రతినిధిగా, ప్రతిధ్వనిగా నిలుస్తున్న జననేత జగన్‌పై నిండు నమ్మకంతో, ఆయన సారథ్యంలో జాతి ఐక్యతను నిలిపే సైనికుల్లా సమరోత్సాహంతో రాజధానికి బయల్దేరారు. రాష్ర్ట రాజధానిలో సమైక్యగళం వినిపిం చేందుకు  ఉరకలెత్తారు.
 
 జిల్లాలోని అన్ని దారుల దిశా శుక్రవారం రాష్ట్ర రాజధానే అయింది. వేల సంఖ్యలో పార్టీనేతలు, శ్రేణులు, విద్యార్థులు, రైతులు, కూలీలు, సమైక్యవాదులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. సమైక్యాం ధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సమైక్యశంఖారావం సభే వారందరి గమ్యం. సెప్టెంబర్ ఏడున ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరిగాక 50 రోజుల తర్వాత ఈ సభ జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుం ది. జైలు నుంచి బయటకొచ్చాక జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా సమైక్యాంధ్రపై బహిరంగ సభలో  ప్ర సంగించనుండడంతో జననేతకు అండగా నిలిచి  స మైక్యనాదం ఢిల్లీకి వినిపించాలన్న దృఢసంకల్పంతో సమైక్యవాదులు రాజధాని దారి పట్టారు.
 
 వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీజీసీ సభ్యులు, పార్టీ కో ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల కన్వీనర్ల నాయకత్వంలో వేలాదిగా పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ, టూరిస్ట్ బస్సులన్నీ పార్టీ శ్రేణులతో నిండిపోయాయి. వీటితో పాటు ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా  సమకూర్చిన బస్సులు, కార్లు, ఇతర వాహనాలలో వేలాది మంది పయనమయ్యారు. సమైక్య శంఖారావం సభ కోసమే ప్రత్యేకంగా కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వే సిన రైలు పార్టీ శ్రేణులతో పాటు సమైక్యవాదులతో కిక్కిరిసిపోయింది. పలు నియోజకవర్గాల్లో  పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బస్సులు సరిపోకపోవడంతో పలువురు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా  సమైక్యవాదులు రాజధానికి కదంతొక్కారు.
 
 పాతిక వేలమందికి పైనే..
 జిల్లా నుంచి పాతికవేల మందికి  పైగా సమైక్య శంఖారావం సభకు బయల్దేరారని అంచనా. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ప్రత్యేక రైలును జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు జెండా ఊపి ప్రారంభించారు. వేణుతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజాల ఆధ్వర్యంలో కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు కాకినాడ సిటీ నుంచి  బయల్దేరారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన వందలాది మంది సామర్లకోటలో ప్రత్యేక రైలు ఎక్కారు. జిల్లా జేఏసీ నేతలు ప్రత్యేక రైలుకు సమైక్యరాష్ట్ర నినాదంతో ఉన్న పోస్టర్‌లను అతికించారు.
 
 అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పినిపే విశ్వరూప్, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకట రమణచౌదరితో పాటు ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మితో సహా పార్టీ కో ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్ల ఆధ్వర్యంలో అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ ని యోజకవర్గాల వారీగా సమకూర్చిన బస్సులు, ఇతర వాహనాల్లో పార్టీ శ్రేణులు బయల్దేరాయి. జిల్లా కన్వీనర్ కుడుపూడి, అమలాపురం కో ఆర్డినేటర్ చింతా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అమలాపురం నుంచి బయల్దేరారు. రంపచోడవరంలో కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్, పరిశీలకుడు కర్రి పా పారాయుడుల ఆధ్వర్యంలో జిల్లా అధికారప్రతి నిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, ఎస్టీ సెల్ కన్వీనర్ పల్లాల వెంకటరమణారెడ్డిలతో  పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు.
 
 రాజమండ్రి నుంచి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో బస్సులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పయనమయ్యారు. రామచంద్రపురం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో వందలాది మంది బయల్దేరారు. రాజానగరం నుంచి సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నాయకులు జక్కంపూడి రాజా, గణేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో  అనుబంధ విభాగాల కన్వీనర్‌లు మార్గాని గంగాధర్, గొల్లపల్లి డేవిడ్‌రాజు తదితరులు పయనమయ్యారు. బొమ్మూరు నుంచి రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, అనపర్తిలో పార్టీ నాయకులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మండపేటలో కో ఆర్డినేటర్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రా ధాకృష్ణ, రాజోలు నుంచి పార్టీ కోఆర్డినేటర్‌లు బొంతు రాజేశ్వరరావు, మట్టా శైలజ, మత్తి జయప్రకాష్, వెంకట్రామరాజు, ముమ్మిడివరంలో కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, భూపతిరాజు సుదర్శనబాబు, పెన్మత్స చిట్టిరాజు తదితరుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బయలుదేరారు. పి.గన్నవరంలో పార్టీ కోఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాలరావు, మందపాటి కిరణ్‌కుమార్, కొండేటి చిట్టిబాబు పార్టీ శ్రేణులతో రాజధానికి బయల్దేరారు.

మరిన్ని వార్తలు