సమైక్యతాశక్తి జగన్

25 Dec, 2013 02:24 IST|Sakshi
సమైక్యతాశక్తి జగన్

=సమైక్యాంధ్ర బహిరంగ సభలో కొణతాల
 =వైఎస్ లేకనే ఆంధ్రకు ఈ అన్యాయం
 =జగన్‌కు భయపడి కేంద్రం విభజన కుట్ర
 =జననేతకు అండగా నిలవాలని పిలుపు

 
అరకు/అరకు రూరల్, న్యూస్‌లైన్: ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఏకైక వ్యక్తి, శక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అన్నారు. ఇక్కడి గిరిజన మ్యూజియం ముఖద్వారం ఎదురుగా అరకు నియోజకవర్గ సమన్వయకర్తలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి దొన్నుదొరల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ సమైక్యాంధ్ర బహిరంగ సభ మంగళవారం నిర్వహించారు. సభలో కొణతాల మాట్లాడుతూ, మహానేత వైఎస్ అనంతర పరిస్థితులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోవడంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని చెప్పారు.

ఆయన లేకపోవడంతోనే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజన సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనానికి భయపడే విభజనకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గిరిజన బెటాలియన్ ఏర్పాటుకు వైఎస్ సుముఖత వ్యక్తం చేసి 300 మందికి ఉద్యోగాలు ఇప్పించారని చెప్పారు. జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారని తెలిపారు.

కాఫీ సాగు చేస్తున్న గిరిరైతులు బాగుపడడంలేదు కానీ దాని వల్ల కేంద్ర మంత్రి జైరాం రమేష్ లబ్ధిపొందుతున్నారని చెప్పారు. మరో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి విశాఖ రాజధాని చేయాలని చెబుతున్నారని, ప్రజలకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు.  జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే వైఎస్సార్ విధానాలు అమలవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కొండ కుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చుతూ ఉంటే, ఏపీలో మాత్రం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.
 
అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ పూనుకుందని చెప్పారు. పెందుర్తి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడారు. అంతకు ముందు ఎన్టీఆర్ గ్రౌండ్‌నుండి భారీ ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. హుకుంపేట మండలం శోభకోట సర్పంచ్ ప్రధాని కనకాలతో పాటు నలుగురు వార్డు సభ్యులు పార్టీలో చేరారు.  కొణతాల వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
 
మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన  కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ నాయకుడు పీవీజీ కుమార్, యువజన విభాగం కన్వీనర్‌అదీప్‌రాజు, ఆరు మండలాల నుంచి పలువురు సర్పంచ్‌లు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు