సకలం బంద్

12 Sep, 2013 02:10 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో 48 గంటల బంద్ బుధవారం ప్రారంభమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. పెట్రోల్ బంక్‌లు తెరుచుకోలేదు. థియేటర్లలో ఆటలను రద్దుచేశారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా బెల్ కంపెనీ ఉద్యోగులు విధులను బహిష్కరించి బంద్‌కు మద్దతు పలికారు. ఉయ్యూరు పట్టణాన్నిఆందోళనకారులు దిగ్బంధించారు.

గండిగుంట, మంటాడ బైపాస్ వద్ద రాస్తారోకో చేశారు. జేఏసీ పిలుపు మేరకు గుడ్లవల్లేరులో సిటీకేబుల్ ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించారు. గుడివాడలో జోరువానలోనూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నెహ్రూచౌక్ సెంటర్‌లో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు 37వ రోజుకు చేరుకున్నాయి.  చల్లపల్లి ఎస్.ఐ. గౌస్‌పాషా బంద్‌లో పాల్గొన్న కోగంటి ప్రసాద్‌ను చితకబాదడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన సమైక్యవాదులు రామానగరం సినిమాహాల్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.   

రహదారికి ఇరువైపుల లారీలను అడ్డుగా ఉంచి ఆందోళన చేశారు. జగ్గయ్యపేట పాత మున్సిపల్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన రిలే దీక్షలో బీసీ సంక్షేమ సంఘ మహిళా విభాగం సభ్యులు కూర్చున్నారు. కంభంపాడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారంతో ముగిశాయి. జి.కొండూరులో పొలిటికల్ జేఏసీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో మండలానికి చెందిన 17 మంది పాస్టర్లు కూర్చున్నారు. ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి.

పామర్రులో జుఝువరం గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షల్లో పాల్గొన్నారు. నందిగామలో వైఎస్సార్  సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లపల్లిలో రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. నూజివీడులో బ్రాహ్మణ సంఘం పెద్దలు రిలే దీక్షకు దిగారు. నూజివీడులో  వైఎస్సార్ సీపీ నాయకులు చేస్తున్న రిలేదీక్షలు 16వ రోజుకు చేరాయి. పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు దీక్షలను ప్రారంభించారు.

పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గూడపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. కలిదిండి సెంటరులో సమైక్యాంధ్ర మద్దతుగా పెదలంక సర్పంచ్ నడకుదుటి నాగమణి ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్తులు రిలే నిరాహారదీక్ష చేశారు. నూజివీడు నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది.  టాటా మ్యాజిక్ వాహనాల యూనియన్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు పట్టణంలో శవయాత్ర నిర్వహించి చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో దహనం చేశారు.

నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గాంధీ సెంటర్‌లో పూలబండ్ల వద్ద పూలు విక్రయిస్తూ నిరసన తెలిపారు.  విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు బుధవారం అర్ధరాత్రి  నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. సిబ్బంది తమ సెల్‌ఫోన్‌లను కూడా ఎన్టీటీపీఎస్ యాజమాన్యానికి అప్పగించారు. పెడన మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో  కూరగాయల షాపులు యజమానులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. వీవీఆర్ ఆధ్వర్యంలో కాకర్లమూడి గ్రామానికి చెందిన మహిళలు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు.
 
విజయవాడలో వ్యాపారం బంద్...

 వాణిజ్య రాజధాని విజయవాడలో వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. హోల్‌సేల్ వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, స్వర్ణ వ్యాపారులు బంద్‌లో పాల్గొన్నారు. ఎన్జీవో నేతలు ఆటోలను సైతం అడ్డుకున్నారు. సాయంత్రం నుంచి రాజధానికి వెళ్లే ప్రైవేటు బస్సులను ఎన్జీవో నాయకులు అడ్డుకున్నారు. వన్‌టౌన్ పోస్టాఫీసు సెంటర్‌లో వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ నేతృత్వంలో నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించి బంద్ చేయించారు. ఆటోనగర్ క్రేన్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో  భారీగా క్రేన్ల ర్యాలీ నిర్వహించారు.  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చిట్టినగర్ జంక్షన్‌లో భారీ మానవహారం నిర్వహించారు. దుర్గగుడి ఉద్యోగులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. జోరువానలోనూ ర్యాలీని కొనసాగించారు.   కంకిపాడు సినిమాహాలు సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్ యార్డు, లాకురోడ్డు, పునాదిపాడు సెంటర్ మీదుగా ఈడుపుగల్లు సెంటర్ వరకు సాగింది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా