ఉధృతంగా కొనసాగుతున్న సమైక్యోద్యమం

10 Oct, 2013 03:19 IST|Sakshi
గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు సడలని సంకల్పంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు వెనకడుగు వేసేదిలేదని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో సమైక్యోద్యమం 71వ రోజైన బుధవారం ఉధృతంగా సాగింది. విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో నాలుగోరోజు కూడా జిల్లాలో  ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కుటీర పరిశ్రమల వారు ఇబ్బందులు పడాల్సివచ్చింది. నరసరావుపేటలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రైలురోకో నిర్వహించి కాచిగూడ-గుంటూరు రైలును అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. 
 
 ఆర్టీసీ కార్మికులు డిపో ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు పాతఫైళ్లను తలగలబెట్టి నిరసన వ్యక్తంచేశారు. తెనాలిలో ఏపీఎన్జీవోలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిషాసురులుగా మారి రాష్ట్ర విభజనకు ఊతమిస్తున్నారని, వారి మనసులు మార్చాలని అమ్మవారిని వేడుకున్నట్లు సమైక్యవాది డాక్టర్ జె.కోటినాగయ్య చెప్పారు. అక్కడ కాళికామాత అమ్మవారి దేవస్థానం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఆలయం చుట్టూ పొర్లుదండాలతో ప్రదక్షణ చేశారు. వినుకొండ, సత్తెనపల్లిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఆయా జాయింట్ యాక్షన్ కమిటీలు మూసివేయించాయి.పెదకూరపాడు నియోజకవర్గంలో సమైక్యవాదులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ప్రత్తిపాడులో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు పాతమద్రాసు రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. 
 
  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్  ఆధ్వర్యంలో, ప్రత్తిపాడులో అక్కడి నాయకులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పెదనందిపాడు మండల బీసీ సెల్ నాయకులు దీక్షలో కూర్చున్నారు. బాపట్ల గడియారస్తంభం సెంటర్‌లో ఏర్పాటుచేసిన రిలే నిరాహారదీక్ష  నాలుగో రోజుకు చేరింది. సత్తెనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ గార్లపాటి ప్రభాకర్ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వినుకొండలో పార్టీ సమన్వయకర్త నన్నపనేని సుధ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
 
 గుంటూరు నగరంలో ..
  రాష్ట్ర విభజనను నిరసిస్తూ చలపతి ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి, హిందూ కళాశాల సెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రోడ్డుపై వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. హిందూకళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రాజకీయ జేఏసీ దీక్షావేదికపై నిరశన చేపట్టిన ఇంటర్‌విద్యార్థులకు సమైక్యంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షులు ఆచార్య పి.నరసింహారావు, కన్వీనర్ ఎన్.శామ్యూల్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. 
 
>
మరిన్ని వార్తలు