అమ్మ పండగ.. గుండె నిండుగా

23 Jan, 2020 12:18 IST|Sakshi
పూజలందుకుంటున్న శంబర పోలమాంబ,జాతర కోసం తయారు చేసిన అప్పడాలను ఎండబెడుతున్న మహిళలు

సమీపిస్తున్న శంబర జాతర

27, 28, 29 తేదీల్లో నిర్వహణ

బంధువులకు ఆహ్వానాలు

పిండివంటల తయారీ.. ఇళ్లకు ముస్తాబు

ఉత్సాహంగా గ్రామస్తుల నిరీక్షణ

ఎవరికైనా జనవరిలో ఒకటే పండగ వస్తుంది.. అదే సంక్రాంతి. శంబర గ్రామస్తులకు మాత్రం ప్రత్యేకం. రెండు పండగలు వస్తాయి. సంక్రాంతి పండగ అయ్యాక పది రోజులకు వచ్చే శంబర జాతర. జనవరి 27, 28, 29 తేదీల్లో జరగనున్న శంబర పోలమాంబ జాతరకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామస్తుల ఇళ్లల్లో అమ్మ పండగ పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. 

మక్కువ: ఏటా శంబర పండగ, సంక్రాంతి పండగలను ఒకే నెలలో నిర్వహిస్తుంటారు. సాధారణంగా సంక్రాంతి పండగంటే పిండి వంటల తయారీ, నూతన వస్త్రాల కొనుగోలు, ఆడపిల్లలు, అల్లుళ్లు, ఆడపడుచులను పిలవడం, నూతన వస్త్రాలు, కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, అయిదేళ్లకోసారి గ్రామదేవత పండగలను మార్చి, మే నెలల్లో జరుపుకొంటారు. శంబర గ్రామంలో మాత్రం ఏటా జనవరిలో రెండు పండగలు నిర్వహిస్తుంటారు. సంక్రాంతి పండగ జరిగిన 10 రోజుల తరువాత శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఏటా నిర్వహిస్తుంటారు. జాతర కోసం గ్రామస్తులు ఎదురు చూస్తారు.

ఏటా జాతర వల్ల మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వవని వారి నమ్మకం.. విశ్వాసం. కూలోనాలో చేసి జాతర సమయానికి కొంతసొమ్మును కూడబెట్టుకుంటారు. మిగిలిన వారితో సమానంగా పిల్లలకు బట్టలు, పెద్దఅమ్మవారికి, రథంమానుకు చీరలు చూపించి, కోళ్లు మొక్కుబడులు చెల్లించుకుంటారు. చుట్టాలు, బంధువులను పండగకు ఆహ్వానిస్తారు. జనవరి 27 తొలేళ్లు, 28న సిరిమాను, 29న అనుపోత్సవం నిర్వహణకు గ్రామంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పుట్టింటి వారికిఆహ్వానం
సంక్రాంతికి సుమారు రూ.10 వేల వరకు ఖర్చు చేస్తారు. శంబర పండగకు మాత్రం సుమారు రూ.30 వేల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఖర్చవుతుంది. సంక్రాంతి పండగ మధ్యాహ్నం శంబర గ్రామస్తులు కన్నవారింటికి వెళ్లి, శంబర పండగకు కన్నవారిని ఆహ్వానిస్తారు. గ్రామానికి చెందిన యాదవులు అయిదేళ్లకోసారి గాబు సంబరాలు ఘనంగా జరుపుకొంటారు. మూడు, నాలుగు కుటుంబాలు కలిసి సుమారు రూ.లక్ష వరకు ఖర్చుచేసి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుతారు.

పొదుపు చేస్తాం
ఏడాది మొత్తం కష్టపడి శంబర పండగకు కొంతసొమ్మును దాచుకుంటాం. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండగను హాయిగా జరుపుతాం. పూర్వం నుంచి వచ్చిన సంప్రదాయాలను ఆచరిస్తున్నందుకు గర్వంగా ఉంది.  – నైదాన పైడితల్లి, మహిళ, శంబర  

ఏటా జరుపుతాం
ఏటా గ్రామంలో లక్షలాదిమంది భక్తుల మధ్య జాతర జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. జాతరకు చుట్టాలు, బంధువులతో గ్రామం, ఇళ్లు కళకళలాడతాయి. సంక్రాంతి పండగకంటే.. శంబర పండగకే ఇళ్లకు రంగులు వేయించుకుంటాం. శంబర పండగంటే మాకు అంత ఇష్టం.  – మడ్డు మంగ, శంబర  

తల్లి పండగంటే ఎంతో ప్రీతి
తల్లి పండగ వస్తుందంటే ఎంతో సంబరంగా ఉంటుంది. ఇంట్లో ఇబ్బందులున్నా, తల్లిని మొక్కుకుంటే అప్పులు పుడతాయి. ఏడాది మొత్తం ఖాళీ లేకుండా పనులు దొరకడంతో అప్పులు తీర్చుకునేందుకు అవకాశముంటుంది. బంధువుల్ని పిలిచి పండగను ఆనందంగా చేసుకుంటాం.– బెవర పోలమ్మ, మహిళ, శంబర  

జాతర ఏర్పాట్లు ముమ్మరం
మక్కువ: ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు దేవాదాయ శాఖాధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చదురుగుడి వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వనంగుడి వద్ద, చదురుగుడి వద్ద మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వనంగుడి వద్ద భక్తులు తాగునీటి కుళాయిలు నిర్మిస్తున్నారు. గోముఖినది ఒడ్డున రహదారికి ఇరువైపులా తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు మాత్రమే తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేయాలని, మరోవైపు ఏర్పాటుచేసి భక్తులు నడకకు ఇబ్బంది పెట్టరాదని సాలూరు సీఐ సింహాద్రినాయుడు హెచ్చరించారు. చదురుగుడి క్యూలైన్ల వద్ద భక్తుల తలనీలాలకు టెంట్లు ఏర్పాటు చేశారు. వినోద కార్యక్రమాలకు ఇతర జిల్లాల నుంచి వివిధ సర్కస్‌ కంపెనీలు గ్రామానికి చేరుకున్నాయి. సిరిమానోత్సవం రోజు పూజారి సిరిమాను అధిరోహించేందుకు అవసరమైన పక్కా భవనాన్ని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు.

పక్కా ప్రణాళికతోజాతర
మక్కువ: భక్తులు ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో శంబర జాతర నిర్వహించాలని బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలీ ఆదేశించారు. శంబర గ్రామంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ముందుగా ప్రధానాలయం ముందు రహదారిని పరిశీలించి, ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు? భక్తులను ఏయే మార్గంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలిస్తున్నారు అన్న అంశాలను సీఐ సింహాద్రినాయుడును అడిగి తెలుసుకున్నారు. అనంతరం చదురుగుడి వెనుకన ఉన్న క్యూలైన్లను ఆమె పరిశీలించారు. క్యూలైన్లు ఇరుగ్గా ఉన్నందున వాటి సంఖ్య పెంచాలని దేవదాయశాఖ సిబ్బందిని ఆదేశించారు.

క్యూలైన్‌ సమీపంలో కాలువ వద్ద పలకలు లేకపోవడంతో భక్తులు ప్రమాదాల బారిన పడే అవకాశమున్నందున తక్షణమే కాలువ వద్ద చదును చేసి రెండు మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. తలనీలాలు, గోముఖి నదికి వెళ్లే మార్గం, క్యూలైన్‌కు వెళ్లే మార్గం రెండుగా విభజించాలన్నారు. క్యూలైను సమీపంలో కొబ్బరికాయలు కొట్టిన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానాలయం ముందు వీవీఐపీలు, వీఐపీల సదుపాయం కోసం టెంట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వనంగుడి వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించి, భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సీఐ సింహాద్రినాయుడు, ఎస్‌ఐ రాజేశ్‌లను ఆదేశించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు