ఒకరికి వాడిన రేజర్‌నే మరో రోగికి వాడుతున్నారు

8 Aug, 2018 08:45 IST|Sakshi

ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు సోకే ప్రమాదం

బ్లేడులు, రేజర్స్‌ రోగులతో కొనిపిస్తున్నారు

జీజీహెచ్‌ అధికారుల తీరుపై విమర్శలు

గుంటూరు మెడికల్‌: రోగంతో బాధపడుతూ రాజధాని ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్న పేద రోగులకు ఆస్పత్రి అధికారులు, సిబ్బంది చేస్తున్న నిర్వాకంతో కొత్త రోగాలు వచ్చే ప్రమాదం మెండుగా ఉంది. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో  హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ లాంటి వైరస్‌లు సోకే ప్రమాదం ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండి పోవడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే...

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయాల్సిన రోగులకు ఆ పరేషన్‌ ముందు తప్పనిసరిగా వెంట్రుకలను క్షురకులు తొలగిస్తారు. తల లేదా ఇతర శరీర భాగాలకు తీవ్రమైన గాయాలై కుట్టు వేయాల్సిన సమయాల్లో సైతం వెంట్రుకలను తొలగించిన పిదప మాత్రమే కుట్లు వేస్తారు. అయితే బార్బర్‌లకు బ్లేడ్లు, రేజర్‌లు కొనుగోలు చేసి ఇవ్వాల్సిన అధికారులు ఆ విషయం పట్టించుకోవడం లేదు. క్షురకులు తమకు నెలకు వస్తున్న ఆరువేల జీతంలోనే కొంత మొత్తం బ్లేడ్లు, రేజర్ల కొనుగోలుకు వినియోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు. రోగులు కొనుగోలు చేయని పక్షంలో ఒకరికి వినియోగించిన రేజర్‌తోనే మరో రోగికి వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒకరి నుంచి మరొకరికి రోగాలు వ్యాప్తి చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.  ప్రతి ఒక్కరికీ కొత్త రేజర్‌ కొనుగోలు చేయలేకపోతున్నామని అందువల్లే బ్లేడ్‌ను మార్చి అదే రేజర్‌తో షేవింగ్‌ చేస్తున్నట్టు క్షురకులు వెల్లడించారు.

చాలీచాలని వేతనాలు...
జీజీహెచ్‌లో ప్రస్తుతం రెండు క్షురకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2010లో ఒకరు  పదవీ విరమణ చేయగా, 2015లో మరో వ్యక్తి చనిపోవటంతో రెండు  రెగ్యులర్‌ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. అవుట్‌సోర్సింగ్‌లో 2010 నుంచి  ఒకరు, 2015 నుంచి ఇద్దరు చొప్పున, ప్రస్తుతం ముగ్గురు క్షురకులు మూడు పూటలా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఒక్కరే క్షురకుడు ఉండటంతో పలుమార్లు రాత్రి వేళల్లో క్షురకులు లేక నాల్గోతరగతి వైద్య సిబ్బంది షేవింగ్‌ చేసేందుకు అవస్థలు పడేవారు. అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న క్షురకులకు ఒక్కొక్కరికి నెలకు ఆరువేల వేతనం ఇస్తున్నారని, ఆరువేలతో తమ కుటుంబం గడవడం లేదని వాపోతున్నారు. క్షురకులు వేచి ఉండేందుకు ఎలాంటి గదులు లేకపోవటంతో రాత్రి వేళ విధులకు చాలా ఇబ్బందిగా ఉంటున్నట్లు తెలిపారు. బ్లేడ్లు, రేజర్‌లు కొత్తవి కొనుగోలు చేసి ఇవ్వటంతో పాటుగా తమకు వేతనాలు పెంచేలా ఉన్నతాధికారులు చూడాలని వారు కోరుతున్నారు.

నా దృష్టికి రాలేదు
బ్లేడ్లు, రేజర్ల సమస్య ఉన్నట్టు నా దృష్టికి ఇప్పటివరకు రాలేదు. క్షురకులు, రోగులు వాటిని కొనుగోలు చేసే పనిలేకుండా ఆస్పత్రి నుంచి కొనుగోలు చేసి అందజేసి ఇన్‌ఫెక్షన్‌లు సోకకుండా చర్యలు తీసుకుంటాం. క్షురకుల పోస్టులతో పాటుగా నాల్గోతరగతి పోస్టులను ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా త్వరలోనే రిక్రూట్‌ చేయనుంది. వారు కనీస వేతనాలు ఇవ్వటంతో పాటుగా ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అర్హత ఉన్నవారిని రిక్రూట్‌ చేసుకుంటారు.–డాక్టర్‌ రాజునాయుడు,జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు