సేమ్ టు సేమ్

22 Feb, 2014 03:16 IST|Sakshi

 నేడు కవలల దినోత్సవం
 అప్పుడపుడు ఇలాంటి అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి. ఒకే పోలిక కలిగిన వ్యక్తులను చూసి ఆశ్చర్యపోతుంటాం. ప్రపంచంలో ఒకే పోలిక గల వారు ఏడుగురు ఉంటారని చెప్పుకునే మాట అటుంచితే... కవలలుగానో, ట్రిప్లెట్స్ గానో పుట్టిన వాళ్లల్లో ఒకరిని చూసి ఇంకొకరుగా భ్రమిస్తుంటాం. పోల్చుకోలేనంతగా పోలికలు ఉండడంతో తికమక పడుతుంటాం. బాల్యంలో కవలలను చూసి పోల్చుకోవడం కష్టంగానే ఉంటుంది. శిశు దశలో కవలలను చూసి తల్లిదండ్రులే పోల్చుకోలేకపోతుంటారు. అందుకే కవలలు జన్మించగానే ఆస్పత్రుల్లో డాక్టర్లు మొదట జన్మించిన శిశువుకు ఏదో ఒక గుర్తు ఉంచుతారు. పెద్దయ్యాక పోలికల్లో కొంచెం తేడా కన్పించినా బాల్యంలో మాత్రం కవలలు ప్రతిబింబాల్లా అనిపిస్తారు.
 
 సినిమాలు
 హలోబ్రదర్, జీన్స్, గంగా మంగ, రాముడు భీముడు, అదుర్స్.. ఇలా ఇంకా పలు తెలుగు, హిందీ సినిమాలకు కవలల అంశం ప్రధాన కథాంశంగా మారి అలరించింది. హీరోలు డబల్ యాక్షన్‌లో చేస్తున్న గమ్మత్తై పనులు ప్రేక్షకులను అలరించి సినిమాలను విజయవంతం చేస్తున్నాయి.
 
 మోదం-ఖేదం
 కవలల్లో ఇద్దరు మగ పిల్లలైతే తల్లిదండ్రులు జాక్‌పాట్ కొట్టినట్లేనని చుట్టుపక్కల వారు ఆకాశాన్ని ఎత్తేస్తారు. ఆడ, మగ శిశువులైతే దేవుడు బ్యాలెన్స్ చేశాడని సంతృప్తి పరుస్తారు. కానీ, ఇద్దరు ఆడ శిశువులైతే చుట్టు పక్కల వారి సానుభూతిని భరించడం తల్లిదండ్రులకు కష్టమే. అత్తింటి వారే గాక విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కవలల తల్లిని సూటిపోటు మాటలతో వేధిస్తారు. కవలలు జన్మించారన్న తల్లి ఆనందాన్ని క్షణాల్లో ఆవేదనగా మారుస్తారు.
 
 ఎందుకిలా?
 కవలలు జన్మించడానికి శాస్త్రీయమైన కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మోనో జైగోటిక్స్‌కు సంబంధించిన వారు ఒకే గర్భ సంచిలో ఒకే మాయలో ఇద్దరు ఆడ, మగ శిశువులుగా పెరుగుతారు. అలాంటి వారికి ఒకే పోలిక, ఒకే గ్రూపు రక్తం వచ్చే అవకాశముంది. ఇలాంటి వారు ఒక ఆడ, ఒక మగ శిశువులుగా జన్మించే అవకాశం ఉంది. డైజైగోటిక్స్‌కు చెందిన వారు ఒకే గర్భ సంచిలో వేర్వేరు మాయల్లో పెరుగుతారు. ఇద్దరు ఆడ లేక ఇద్దరు మగపిల్లలుగా పుడతారు. తల్లివైపు వారసత్వంతోనూ, గర్భం దాల్చే సమయంలో ఎక్కువ మందులు వాడినప్పుడు కవలలు జన్మించే అవకాశం ఉంది. పురుష బీజకణం స్త్రీ అండంతో కలిసి వెంటనే రెండుగా విడిపోయినపుడు కవలలుగా ఏర్పడతారు.
 - న్యూస్‌లైన్, కడప కల్చరల్
 

మరిన్ని వార్తలు