ఆకట్టుకున్న సంగీత విభావరి

6 Feb, 2019 06:47 IST|Sakshi

పశ్చిమగోదావరి, భీమవరం (ప్రకాశం చౌక్‌) : శ్రీమావుళ్లమ్మ అమ్మవారి 55 వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న నాటకాలు, కూచిపూడి నృత్యాలు, సంగీత విభావరిలు, భజనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం జరిగింది. ఆలయ అర్చకులు చిన్ని, సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక అమ్మవారి ఉత్సవాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పంచమ వేద నాట్య నిలయం హైదరాబాద్‌ వారిచే ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాత్రి 8 గంటలకు సోని ఆర్కెస్ట్రా భీమవరం వారిచే ప్రముఖ సినీనేపథ్య గాయని సమీరా భరద్వాజ్, హనుమాన్‌లు కాంబినేషన్‌లో సాగిన సంగీత విభావరి ఎంతో ఆకట్టుకుంది. జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంగీత విభావరి తిలకించారు.

అమ్మవారి ఉత్సవాల్లో నేడు : శ్రీమావుళ్లమ్మ అమ్మవారి 55 వార్షికోత్సవాల్లో బుధవారం సాయంత్రం 5 గంటలకు సినీ మ్యూజికల్‌ నైట్, రాత్రి 8 గంటలకు రెండు రత్నములు నాటకం కార్యక్రమాలు ఉంటాయి.భీమవరం శ్రీమావుళ్లమ్మ వారి సన్నిధికి వచ్చి పాట పాడడం తన అదృష్టమని వర్ధమాన సినీగాయని సమీరా భరద్వాజ్‌ అన్నారు. భీమవరం వచ్చిన ఆమె మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు.

సాక్షి: ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు ఎన్ని పాటలు పాడారు?
సమీరా: 15 సినిమాలకు 20 పాటలు.

సాక్షి: మీరు పాడిన మొదటి సినిమా ఎవరు అవకాశం ఇచ్చారు?
సమీరా: నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ వద్ద 6 నెలల పాటు పనిచేశాను. ఆయన బ్రూస్లీ సినిమాలో మొదటి అవకాశం ఇచ్చారు.

సాక్షి: మీ స్వస్థలం? ఏం చదువుకున్నారు?
సమీరా:విజయవాడ. నాన్న చంద్రశేఖర్‌ చెన్నై ఐటీసీలో పనిచేస్తారు. మేం చెన్నైలో ఉంటున్నాం. బీకాం చేసి సీఎస్‌ చేశాను.

సాక్షి: గుర్తింపు తెచ్చిన సినిమాలు? పాటలు?
సమీరా: సరైనోడు, శతమానం భవతి, అర్జున్‌రెడ్డి తదితర హిట్‌ చిత్రాల్లో పాడాను. సరైనోడులో తెలుసా.. తెలుసా.. పాటకు టీ ఎస్సార్‌ అవార్డు, అర్జున్‌రెడ్డిలో మధురమే పాటకు మిర్చి మ్యూజిక్‌ అవార్డు వచ్చింది.

సాక్షి: ఎన్ని కొత్త సినిమాల్లో పాడబోతున్నారు.
సమీరా: 5 కొత్త సినిమాలకు పాడుతున్నాను.

సాక్షి: సంగీత ప్రావిణ్యం ఉందా?
సమీరా:కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను.  

సాక్షి: మీకు ఇష్టమైన సింగర్, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌?
సమీరా:నాకు సింగర్స్‌ చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కార్తీక్‌ ఇష్టం. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ మణిశర్మ, కిరవాణి అంటే ఇష్టం.

మరిన్ని వార్తలు